ఐటీ కంపెనీ ఉద్యోగులకు బోనస్‌.. జీతాల పెంపుపై అప్డేట్ | Infosys Employees Bonus Variable Pay Q1 Salary Hike Update 2026 | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీ ఉద్యోగులకు బోనస్‌.. జీతాల పెంపుపై అప్డేట్

Aug 25 2026 12:40 PM | Updated on Aug 25 2026 12:57 PM

Infosys Employees Bonus Variable Pay Q1 Salary Hike Update 2026

దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సగటున 70 శాతం పనితీరు ఆధారిత బోనస్‌ (వేరియబుల్ పే) చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల పనితీరు, జాబ్ లెవల్‌ను బట్టి ఈ చెల్లింపు సుమారు 65 శాతం నుంచి 80 శాతం  మధ్య ఉన్నట్లు కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించాయి. తాజా చెల్లింపు గత త్రైమాసికంతో పోలిస్తే మారలేదు. అయితే గతేడాది ఇదే కాలంలో ఇచ్చిన 80 శాతంతో పోలిస్తే 10 శాతం పాయింట్లు తగ్గింది.

జాబ్ లెవల్స్ (JL) 4, 5లోని ఉద్యోగులకు లెవల్‌6తో పోలిస్తే కొంత మెరుగైన వేరియబుల్ పే లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన లెవల్‌4 ఉద్యోగులకు 80 శాతం, లెవల్‌5 ఉద్యోగులకు 78 శాతం వరకు చెల్లింపు జరిగినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు రేటింగ్, అర్హత వంటి అంశాల ఆధారంగా వాస్తవ చెల్లింపు మారవచ్చు.

ఈసారి వేరియబుల్ పే చెల్లింపులు ఐటీ రంగంలో కొనసాగుతున్న సవాళ్ల మధ్య వచ్చాయి. క్లయింట్ల విచక్షణాధికార వ్యయం మందగించడం, స్థూల ఆర్థిక అనిశ్చితి, అలాగే కృత్రిమ మేధ (AI) కారణంగా వ్యాపార నమూనాల్లో వేగంగా వస్తున్న మార్పులు టెక్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. గత త్రైమాసికంలోనూ ఇన్ఫోసిస్ సగటున 70 శాతం వేరియబుల్ పే చెల్లించింది.

రూ.7,769 కోట్ల నికర లాభం

ఇదిలా ఉండగా, జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ పనితీరు మిశ్రమంగా ఉంది. కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం పెరిగి రూ.7,769 కోట్లకు చేరింది. ఆదాయం 14 శాతం పెరిగి రూ.48,211 కోట్లుగా నమోదైంది. అయితే స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 2.4 శాతంగా మాత్రమే ఉంది.

త్రైమాసికం ముగిసే నాటికి ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3,28,062గా ఉంది. ఇది మార్చి త్రైమాసికంతో పోలిస్తే 532 తగ్గింది. మరోవైపు, ఉద్యోగుల వాలంటరీ అట్రిషన్ రేటు 13 శాతానికి పెరిగింది. AI ఆధారిత సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగులపై కంపెనీ దృష్టి సారిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్ల సంఖ్యను 6,000కు పెంచే ప్రణాళికను కూడా ఇన్ఫోసిస్ ప్రకటించింది.

జీతాల పెంపు ఎప్పటి నుంచి?

ఇక ఉద్యోగులు ఎదురుచూస్తున్న వార్షిక వేతన సవరణలపై కూడా కంపెనీ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అర్హత కలిగిన ఉద్యోగులకు జీతాల పెంపును 2026 అక్టోబర్, 2027 జనవరిలో దశలవారీగా అమలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అందువల్ల లెవల్‌4, లెవల్‌5 స్థాయిల్లోని అర్హులైన ఉద్యోగులకు అక్టోబర్‌లో, సీనియర్ స్థాయిల్లోని ఉద్యోగులకు జనవరిలో వేతన సవరణలు అందే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: TCS రూ. 3,574 కోట్ల డీల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement