సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్) తాజాగా జర్మనీ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం పోర్షే ఏజీకి చెందిన ఐటీ యూనిట్ కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకుంది. పోర్షే అనుబంధ సంస్థ ఎంహెచ్‌పీ మేనేజ్‌మెంట్–యూఎన్‌డీ ఐటీ–బెరాటంగ్ జీఎంబీహెచ్ (ఎంహెచ్)లో 100% వాటా సొంతం చేసుకోనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. 32 కోట్ల యూరోల(రూ. 3,574 కోట్లు) ఎంటర్‌ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు వెల్లడించింది.
తాజా కొనుగోలు జర్మన్ దిగ్గజంతో 1.25 బిలియన్ యూరోల విలువైన ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమని తెలిపింది. సొంత అనుబంధ కంపెనీ టీసీఎస్ నెదర్లాండ్స్ బీవీ ద్వారా ఎంహెచ్‌పీని కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. కాగా.. ప్రభుత్వ రంగంతోపాటు ఆటోమోటివ్, తయారీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ రంగాల్లో మేనేజ్‌మెంట్, ఐటీ కన్సల్టెన్సీ సేవలను ఎంహెచ్‌పీ అందిస్తోంది. కంపెనీ సిబ్బంది సంఖ్య 4,500కాగా.. 2025లో 74.2 కోట్ల యూరోల ఆదాయం ఆర్జించింది.
పోర్షేకు సెంటర్
తాజా సహకారంలో భాగంగా పోర్షే కోసం ప్రత్యేకించిన ఏఐ మొబిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(కేంద్రాన్ని) టీసీఎస్ ఏర్పాటు చేయనుంది. ఏఐ, సాఫ్ట్‌వేర్, డేటా ద్వారా ఆటోమోటివ్ పరిశ్రమలో మార్పులకు తెరలేవనున్న నేపథ్యంలో టీసీఎస్‌కున్న ఏఐ, ఇంజినీరింగ్, టెక్, బిజినెస్ ట్రాన్స్‌ఫార్మేషన్ సామర్థ్యాలకు ఎంహెచ్‌పీకిగల పటిష్ట ఆటోమోటివ్ కన్సల్టింగ్ నైపుణ్యాలు జతవనున్నాయి. రెండింటి సమన్వయంతో పోర్షేకు ఏఐని మరింత విస్తృతంగా అందించనున్నట్లు టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్ చెప్పారు.


