మనశ్శాంతి కోసం జాబ్ మానేసి.. నెలకు రూ.కోటి టర్నోవర్! | Techie Quits Accenture Job For Peace of Mind His Startup Now Clocks Rs 1 Crore Monthly Revenue | Sakshi
Sakshi News home page

మనశ్శాంతి కోసం జాబ్ మానేసి.. నెలకు రూ.కోటి టర్నోవర్!

Sep 5 2026 6:46 PM | Updated on Sep 5 2026 7:46 PM

Techie Quits Accenture Job For Peace of Mind His Startup Now Clocks Rs 1 Crore Monthly Revenue

సాధారణంగా బెంగళూరు నగరంలో.. యాక్సెంచర్‌ వంటి కంపెనీలో ఉద్యోగం వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ సుప్రీత్ కశ్యప్  మాత్రం ఇందుకు భిన్నంగా.. ఉద్యోగం వదిలి మనశ్శాంతి కోసం సొంత ఊరికి వెళ్ళిపోయాడు. నేడు నెలకు కోట్ల రూపాయల ఆదాయం సంపాదించే స్థాయికి చేరాడు. ఇంతకీ కశ్యప్ ఏం చేసాడు?, ఎలా సంపాదిస్తున్నాడు?, అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యాక్సెంచర్‌ ఉద్యోగం వదిలి..
సుప్రీత్ కశ్యప్ మైసూరులో పుట్టి పెరిగాడు. తాను మైసూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. చదువు పూర్తయ్యాక, 2017లో యాక్సెంచర్‌ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం అతనికి మంచి కెరీర్ ఇచ్చినప్పటికీ.. బెంగళూరులో జీవనశైలి తనకు సరిపోవడం లేదని భావించాడు. నగరంలోని ట్రాఫిక్, రద్దీ, నిరంతర ఒత్తిడి కారణంగా ప్రశాంతత లోపించిందని అనిపించింది.

వెల్బీ పేరుతో వ్యాపారం..
అందుకే.. 2018లో యాక్సెంచర్‌లో ఉద్యోగాన్ని వదిలి మైసూరుకు వెళ్ళిపోయాడు. ప్రారంభంలో ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అయితే.. తనకు కేవలం ఉద్యోగం చేయడం కాకుండా, మైసూరు నుంచే ఒక సంస్థను నిర్మించి, ఇతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన వచ్చింది.

ఈ ఆలోచనతో కశ్యప్ వెల్బీ పేరుతో.. దుస్తుల వ్యాపారాన్ని 2021లో ప్రారంభించాడు. వెల్బీ అనేది ప్రధానంగా సౌకర్యవంతమైన, స్పోర్ట్స్, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే దుస్తులను తయారు చేస్తుంది. సస్టైనబుల్, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్‌కు కూడా సంస్థ ప్రాధాన్యత ఇస్తుంది.

రూ.10 లక్షలు పెట్టుబడి
సుప్రీత్‌ తన వ్యాపారం ద్వారా చాలామందికి ఉద్యోగాలు కూడా కల్పించాలని సంకల్పించాడు. దీంతో.. టైర్2, టైర్3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉద్యోగావకాశాలను సృష్టించాలని భావించాడు. వెల్బీలో ఇప్పుడు 15 మందికి పైగా ఫుల్-టైమ్ ఉద్యోగులు ఉన్నారు. సుమారు 40 మంది చేతివృత్తి కళాకారులతో కలిసి పనిచేస్తున్నారు.

వెల్బీని ప్రారంభించడానికి సుప్రీత్ మొదట కుటుంబ సభ్యుల సహాయంతో.. సుమారు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందడంతో మొత్తం పెట్టుబడి రూ.50 లక్షలకు చేరింది. తరువాత సంస్థకు ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.3 కోట్ల పెట్టుబడి లభించింది.

కోట్లలో టర్నోవర్
కంపెనీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. మొదటి సంవత్సరంలో సుమారు రూ.11 లక్షల ఆదాయం వచ్చింది. తరువాతి సంవత్సరం అది రూ.70 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత రూ.2.4 కోట్లు, తదుపరి సంవత్సరం రూ.5.6 కోట్లు ఆదాయం సాధించింది. ఇప్పుడు సంస్థ ఏడాదికి సుమారు రూ.15-16 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయాణంలో వెల్బీ నెలకు సుమారు రూ.1 కోటి ఆదాయం సాధించే స్థాయికి చేరుకుంది. కేవలం రూ.10 లక్షలతో ప్రారంభమైన వ్యాపారం, ఇంత పెద్ద స్థాయికి ఎదగడం సుప్రీత్ వ్యాపార ప్రయాణంలో సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి.

సుప్రీత్ తనను తాను ఒక యాదృచ్ఛిక పారిశ్రామికవేత్తగా భావిస్తాడు. ఎందుకంటే అతడు అనుకోకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అంతే కాకుండా.. తన కుటుంబానికి కూడా వ్యాపార నేపథ్యం లేదు. అందువల్ల వ్యాపారం ప్రారంభించినప్పుడు.. తనకు అనుభవం కూడా పెద్దగా లేదు. కానీ కాలక్రమంలో అనుభవంతో పాటు అనేక విషయాలు నేర్చుకున్నాడు.

మైసూరు నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి
ప్రారంభంలో.. మంచి ఫ్యాషన్ ఫొటోషూట్లు చేస్తే అమ్మకాలు పెరుగుతాయని ఆయన అనుకున్నాడు. కానీ.. తర్వాత అసలు విజయం మంచి ఫొటోలలో కాకుండా, మంచి ఉత్పత్తిని తయారు చేయడం, వినియోగదారులకు అది నిజంగా అవసరమా అని తెలుసుకోవడంలో ఉందని గ్రహించాడు.

అలాగే ఉద్యోగులను నియమించడంలో కూడా ఆయనకు ఒక ముఖ్యమైన పాఠం తెలిసింది. మొదట ప్రతి పనికి ప్రత్యేక వ్యక్తులను నియమించడం వల్ల సంస్థలో అవసరానికి మించిన పెద్ద టీమ్ ఏర్పడింది. తరువాత ఒకటి కంటే ఎక్కువ పనులు చేయగలిగే మల్టీ టాస్క్ ఉద్యోగులను నియమించడం ద్వారా చిన్న టీమ్‌తోనే సంస్థను సమర్థవంతంగా నడపవచ్చని తెలుసుకున్నాడు.

మైసూరులో ప్రారంభమైన వెల్బీ.. ఇప్పుడు భారతదేశం దాటి అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో అమెజాన్ ద్వారా ఉత్పత్తులను విక్రయించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇదీ చదవండి: డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement