క్లాసిక్స్ అంటే ఏమిటి | Sakshi Funday: Classics are books that last a long time | Sakshi
Sakshi News home page

క్లాసిక్స్ అంటే ఏమిటి

Apr 5 2026 6:10 AM | Updated on Apr 5 2026 6:10 AM

Sakshi Funday: Classics are books that last a long time

లిట్‌వరల్డ్‌

‘ప్రపంచంలోని పుస్తకాలన్నీ రెండే రకాలు! కొన్ని క్షణకాలం నిలిచేవి – మరికొన్ని కలకాలం నిలిచేవి’ అన్నాడు పందొమ్మిదవ శతాబ్దపు బహుముఖ ప్రజ్ఞావంతుడు జాన్‌ రస్కిన్‌. అలా కలకాలం నిలిచే పుస్తకాలనే ‘క్లాసిక్స్‌’ అంటూవుంటారు. సాహిత్య విమర్శలో ఏ మాట చెప్పినా, ఆలంకారికంగానే చెప్తారు; అంచేత ‘కలకాలం’ అంటే సుదీర్ఘకాలమనే మనం అర్థంచేసుకోవాలి.

 ‘ఎంత కాలంగా నిలువనున్న సరుకైతే అది అంత ప్రశస్తమైనది’ అనే ప్రమాణం చింతకాయ పచ్చడికీ ఉసిరిపచ్చడికీ వర్తించినంతగా క్లాసిక్స్‌కు వర్తించదు. ‘పురాతన కళాఖండాలు మనకు శ్రేష్ఠమైనవిగా అనిపించడానికి వాటి ప్రాచీనత కారణం కాదు! అలాంటి క్లాసిక్స్‌ ఎప్పుడు చదివినా ఎంతో తాజాగానూ, శక్తిమంతంగానూ, ఆరోగ్యదాయకంగానూ అనిపించడం వల్లనే అవి క్లాసిక్స్‌ అయ్యాయి‘ అన్నాడు గోథే. 

ప్రతి విషయాన్ని చమత్కారంగా చెప్పే అమెరికన్‌ మహారచయిత మార్క్‌ ట్వైన్‌ మాత్రం క్లాసిక్స్‌నూ వదలలేదు! ‘ప్రతిఒక్కరూ చదవాలని అనుకున్నప్పటికీ, ఏ ఒక్కరూ చదవని ఉద్గ్రంథాలే క్లాసిక్స్‌’ అన్నాడట ఆ మహానుభావుడు. అది తప్పని ఆయన విషయంలోనే రుజువైంది. హెమింగ్వేలాంటి వాళ్లు, ట్వైన్‌ రాసిన ‘హక్ల్‌ బెరీ ఫిన్‌’ నవలను క్లాసిక్‌గా పరిగణించిన మాట – దాన్ని చదవాలని ఒకప్పుడు మనమంతా ఉవ్విళ్లూరిన మాట నిజమే కదా! అంచేత, ఈ మాట అంటున్నప్పుడు మార్క్‌ ట్వైన్‌ తన గుబురు మీసాల మాటున నవ్వుకునే వుంటాడని గ్రహించాలి!! 

ఏతావాతా, దీర్ఘకాలం మనగలగడం ఒక్కటే క్లాసిక్స్‌ లక్షణం కాదు – కనీసం అది వాటి ప్రధాన లక్షణం కూడా కాదని తేలిపోయింది! జనజీవనంలో అనంతంగానూ, స్థిరంగానూ కొనసాగే కొన్ని ప్రమాణాలు క్లాసిక్స్‌లో ప్రముఖంగా కనిపించి తీరాలి. మానవమేధను మరింత రసవంతం చేసే లక్షణం దాంట్లో ఉండి తీరాలి. 

భూగోళమంతా విస్తరించుకుని వున్న మానవాళిలో ప్రతి నిత్యం దర్శనమిచ్చే భావావేశం క్లాసిక్స్‌లో పెల్లుబుకుతూ ఉండాలి. ఒక్కమాటలో చెప్పుకుంటే, క్లాసిక్స్‌లో – ఏదో ఒక రూపంలో– మౌలికమైన, విస్తృతమైన, లోతైన ఆలోచన – అనుశీలన – ఆవిష్కరణ వ్యక్తమై ఉండాలి. టీయస్‌ ఇలియట్‌ లాంటి నవ్య సంప్రదాయవాదుల లెక్క ప్రకారం, క్లాసిక్స్‌లో అంతర్నిహితంగా నిర్దిష్ట నైతికబోధన ఉండాలి. పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో, ఈ ప్రతిపాదనను సమర్థించేవాళ్లకన్నా, పట్టించుకోనివాళ్లే ఎక్కువ! 

విషయమేమిటంటే, కొన్ని తరాలపాటు పాఠక లోకాన్ని ప్రభావితం చేసే లక్షణాలున్న గొప్ప పుస్తకాలన్నీ క్లాసిక్సే. ఉదాహరణకి గురజాడ ‘కన్యాశుల్కం’, చలం ‘మైదానం’, విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలు’, దేవులపల్లి ‘కృష్ణపక్షం’, సురవరం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది!’, దాశరథి ‘అగ్నిధార’, నవీన్‌ ‘అంపశయ్య’ – ఇవన్నీ క్లాసిక్సే. నాలాంటి వాడికి మల్లారెడ్డి, రాంభట్ల, సినారె అనువదించిన ‘మఖ్దూం కవిత’, సదాశివ ‘యాది’ కూడా క్లాసిక్స్‌ గానే కనిపిస్తాయి! అవి ఫలానా దేశంలో, ఫలానా భాషలో, ఫలానా కాలంలో వెలువడి వుండాలనేం లేదు. మనం ఈ విషయం గురించి ఇక్కడ చర్చించుకుంటూ ఉండగానే, ఏదో గొప్ప క్లాసిక్‌కు శ్రీకారం చుట్టడం జరిగివున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. 

ఆ మాటకొస్తే, ప్రతి క్లాసిక్‌ అలా వేర్వేరు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో, వేర్వేరు భాషల్లో పుడుతూ వచ్చిందే! నోబెల్‌ బహుమతో – లేదా పులిట్జర్‌ పురస్కారమో – లేదా బుకర్‌ ప్రైజో పొందిన రచనలే క్లాసిక్స్‌ అని ఎవరూ అనరు – అనలేరు! సామాన్యయుగానికి పూర్వం ఏడో శతాబ్దిలో హోమర్‌ గానం చేసిన ‘ఇలియడ్‌’, ‘ఒడిస్సీ’లకు ఏ నోబెల్‌ ప్రైజ్‌ వచ్చిందని అవి క్లాసిక్స్‌ కాగలిగాయి? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వాల్మీకి ‘రామాయణ’ కావ్యానికి ఏ పులిట్జర్‌ ప్రైజ్‌ వచ్చిందని అది క్లాసిక్‌ కాగలిగింది? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వ్యాస ‘మహాభారత’ ఇతిహాసానికి ఏ బుకర్‌ ప్రైజ్‌ వచ్చిందని అది క్లాసిక్‌ కాగలిగింది? అంతెందుకు – టాల్‌ స్టాయ్‌ రాసిన ‘ఆనా కెరినినా’ గానీ, ‘యుద్ధం–శాంతి’ గానీ ఏ పురస్కారానికీ నోచుకోలేదు. 

అవి క్లాసిక్స్‌ కాదనడానికి ఎవరికైనా గుండెలున్నాయా? ఇక, జేమ్స్‌ జాయిస్‌ రాసిన ‘యులిసెస్‌’కు ఏ బహుమతీ దక్కకపోగా తీవ్రమైన ఆంక్షల పోటులూ, సెన్సార్‌ కత్తెర వేటులూ మాత్రమే ప్రాప్తమయ్యాయి. అది మేలిరకం క్లాసిక్‌ సుమా! అని పనిగట్టుకుని చెప్పాలా? హోర్హే లూయీ బోర్హే రాసిన ‘ఫిక్షన్‌’కు నోబెల్‌ పురస్కారం దక్కకపోవడానికి, ఆయన రాజకీయ అభిప్రాయాలే కారణం కావడం అందరికీ తెలిసిందే! అంతమాత్రాన అది క్లాసిక్‌ కాకపోతుందా? ఈ జాబితా సుదీర్ఘమైంది. జార్జ్‌ ఆర్వెల్, వర్జీనియా వూల్ఫ్, చినువా అచెబే, స్కాట్‌ ఫిట్జెరాల్డ్‌ లాంటి మహా రచయితల రచనలెన్నో ఉన్నాయి అందులో! క్లాసిక్స్‌ అంటే ఏమిటో – స్థూలంగా – అర్థం చేసుకోవడానికి ఈ చర్చ సరిపోతుందనుకుంటా. 

మందలపర్తి కిషోర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement