ఈ వారం కథ: 'తరువుకి కాయ భారమా!' | A Sunday Special Story Written By Dr Sannihit | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: 'తరువుకి కాయ భారమా!'

Jul 19 2026 8:53 AM | Updated on Jul 19 2026 9:10 AM

A Sunday Special Story Written By Dr Sannihit

కథ

టమి అనేది ఎవరికైనా బాధాకరం. జీవితంలో ఎంతో సాధించాక, ఎన్నో మెట్లెక్కాక, ‘నువ్వు ఓడిపోయావు’ అని నీ జీవితం నీతో చెబితే అది ఎంత విషాదకరం. రఘురాం పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఎక్కడో పల్లెటూర్లో పుట్టిన వాడు. కష్టపడి చదువుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఢిల్లీ దాకా ఎదిగిన వాడు. కానీ ఏం లాభం? ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, సాధించిందంతా శూన్యం అని తెలిసి వచ్చింది. భార్య, పిల్లలు అందరూ అతన్ని ఒక చేతగాని వాడు అని తీర్మానించి వదిలారు. వయసు మళ్ళిన అతను ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అయితే అది నిజమా లేక కేవలం వారి అభిప్రాయం మాత్రమేనా అన్న సంశయం అతన్ని పీడించసాగింది. ఎటూ తేల్చుకోలేక నిరంతరం ఆలోచనల్లోకి జారిపోతున్నాడు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నాడు!
∙∙ 
‘రఘూ... అన్నం తిను నాన్నా’ అని బతిమాలుతున్న తల్లిని కోపంగా చూశాడు రఘురాం. 
అన్నపూర్ణకు కూడా కోపం వచ్చింది. ఎంతసేపూ చదువు చదువు అంటూ తిండీ తిప్పలు మానేస్తున్నాడు రఘురాం. ఇలా అయితే పిల్లాడు ఎలా బలంగా ఉంటాడు అని ఆమె బాధ. అసలే పల్లెటూరు, తిండి తినకుండా అనారోగ్యం పాలైతే వైద్య సౌకర్యం లేదు. ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న టౌన్‌  హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తుంది.
చాలాసేపు బతిమాలాక పుస్తకం ముందు నుండి లేచాడు రఘురాం. తల్లి పెట్టిన అన్నం కూర తిని పెరుగు కూడా వేసుకున్నాడు. సంతృప్తిగా చూసింది అన్నపూర్ణ.

‘ఏరా...అన్నం తిన్నావా?’ ప్రేమగా అడిగాడు అప్పుడే పొలం నుండి వచ్చిన శంకరయ్య.
‘తిన్నాను నాన్నా’ అని చెప్పి మళ్ళీ పుస్తకం అందుకున్నాడు రఘురాం. ముసి ముసిగా నవ్వుకుంది అన్నపూర్ణ.
రఘురాం చాలా మంచి విద్యార్థి. రోజూ ఇంటి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్‌కి వెళుతూ బుద్ధిగా చదువుకుంటాడు. టీచర్లకు కూడా అతనంటే ఎంతో ఇష్టం. చదువు పట్ల అతని శ్రద్ధను చూసి మురిసిపోతారు అన్నపూర్ణ శంకరయ్యలు. ఊరి వాళ్ళు కూడా ‘మంచి కొడుకుని కన్నావమ్మా’ అని చెబుతూ ఉంటారు అన్నపూర్ణతో!

కాలచక్రం గిర్రున తిరిగింది. రఘురాం ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కేంపస్‌ ఇంటర్వ్యూలో క్లియర్‌ అయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్న ఒక పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్ట్‌కి సెలెక్ట్‌ అయ్యాడు. అతని విజయాన్ని చూసి గ్రామస్థులు వేనోళ్ళ పొగిడారు. కొడుక్కి దిష్టి తీసి హైదరాబాద్‌ పంపించింది అన్నపూర్ణ.
జాబ్‌లో జాయిన్‌  అయి సెటిల్‌ అయ్యాక తల్లిదండ్రులని రమ్మన్నాడు రఘురాం.

ఒక మంచిరోజు చూసుకుని హైదరాబాద్‌ వచ్చారు వాళ్ళు. కొడుకు ఉంటున్న కంపెనీ క్వార్టర్‌ని, ఆ నాగరిక వాతావరణాన్ని చూసి మురిసిపోయారు. తమలాంటి వాళ్ళ కడుపున పుట్టి ఇక్కడి దాకా ఎదిగిన కొడుకు మీద వారి ప్రేమ రెట్టింపయింది. ఉన్నన్నాళ్ళు వాళ్ళకి హైదరాబాద్‌లో ఉన్న అన్ని టూరిస్ట్‌ ప్రదేశాలను తిప్పి చూపించాడు రఘు. సంతోషపడిపోయారు వాళ్ళు. కొన్ని రోజుల పాటు కొడుకుని బాగా చూసుకుని తమ ఊరు వెళ్ళడానికి బయలుదేరారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ లో వాళ్ళను ట్రైన్‌  ఎక్కించి బయటకు వస్తూ చిన్న పిల్లాడిలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు రఘురాం.
చాలా ఒంటరిగా ఫీల్‌ అయ్యాడు. ఇంకోవైపు రైల్లో వెళుతున్న అతని తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే. కొడుకును వదిలి ఎప్పుడూ ఉండలేదు వాళ్ళు!
∙∙ 
వృత్తిలో ఎదుగుతున్నాడు రఘురాం. ఒక గ్రేడ్‌ ప్రమోషన్‌  పొందాక పెళ్ళి మీద మనసయింది అతనికి.
కొలీగ్‌ రవళి అందుకు కారణం. అందం, తెలివితేటలతో అతని మనసు దోచుకుంది.
అమాయకంగా కనపడుతూ కష్టపడే మనస్తత్వం ఉన్న రఘురాం కూడా ఆమె మనసుని కొల్లగొట్టాడు. ఈ విషయం తెలిసి ఎంతో సంబరపడిపోయారు అన్నపూర్ణమ్మ దంపతులు.
ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంత పీట వేసి కొడుక్కి పెళ్ళి చేశారు. మనసారా దీవించి దగ్గరుండి దంపతులతో కాపురం పెట్టించారు. శోభనం ముహూర్తం పెట్టి, ఆ అద్భుత క్షణాల్లో రఘుని, రవళిని గదిలోకి పంపించారు. రఘు మనసు ఉద్విగ్నంగా ఉంది. అనుభవించబోయే సుఖాన్ని తలచుకుని అతని మనసు గాల్లో తేలుతోంది. రవళిని ఆశగా దగ్గరకు తీసుకున్నాడు.
సున్నితంగా అతన్ని విడిపించుకుని దూరంగా జరిగింది రవళి. నవ్వుకున్నాడు రఘు. తొలి కలయిక పట్ల ఆమెకు భయం ఉంది అనుకున్నాడు.

రవళి సిగ్గుపడుతూ ‘ఇంట్లో మీ అమ్మా నాన్న ఉన్నారు కదా... నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది.
వాళ్ళు ఊరు వెళ్ళిపోయాక మనం కలుద్దాం. అప్పటిదాకా వద్దు’ అంది.
ఆమె చెప్పిన లాజిక్‌ అర్థం కాలేదు రఘుకి. అయినా ‘సరే ’ అన్నాడు. తర్వాత మంచంపై విడిగా పడుకున్నారు ఇద్దరూ.
తర్వాతి రోజు నుంచే కోడలి మనస్తత్వం అర్థం చేసుకున్నారు రఘు తల్లిదండ్రులు. తాము ఉండటం ఆ అమ్మాయికి ఇష్టం లేదు అని తెలుసుకున్నారు. ఆ విషయాన్ని గొడవగా మారిస్తే కొడుకు మనసు బాధపడుతుందని మిన్నకుండిపోయారు.
‘ఊళ్లో పనులు ఉన్నాయిరా... వెళ్తాం’ అని కొడుకుతో అన్నారు. వెంటనే, ‘సరే...’ అన్నాడు రఘు.
సికింద్రాబాద్‌లో వాళ్ళని రైలు ఎక్కించి బయటకు వచ్చాక ‘హమ్మయ్యా’ అని రిలీఫ్‌గా ఫీలయ్యాడు.
ఆ రాత్రి రవళి కౌగిలిలో కరిగిపోతూ స్వర్గాన్ని చూశాడు.

కొడుకు సుఖాన్ని కోరుకున్న రఘు తల్లిదండ్రులు ఆ తర్వాత ఎప్పుడూ హైదరాబాద్‌ రాలేదు. ఏదైనా అవసరం ఉంటే రఘు మాత్రమే ఊరు వెళ్ళి వస్తూ ఉండేవాడు.
తొలిసారిగా కొడుకు పుట్టాడు రఘు దంపతులకి. వాళ్ళ ఆనందం అంబరాన్ని అంటింది.
నామకరణం రోజున రమ్మని తల్లిదండ్రులకు కబురు చెప్పాడు రఘు.
ఆ రోజుకి హైదరాబాద్‌లో దిగారు వాళ్ళు. ప్రేమగా ఆహ్వానించాడు రఘు. రవళి మాత్రం వాళ్ళతో మాట్లాడలేదు. మనవడ్ని చూసి మురిసిపోయారు అన్నపూర్ణమ్మ దంపతులు.

ఆ పసివాడికి తమ కులదైవం పేరు పెట్టాలని అడిగారు రఘుని. అది విన్న రవళి ‘నా కొడుక్కి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టొద్దు. నచ్చితే ఉండండి లేదంటే వెళ్ళిపోండి’ అని కఠినంగా చెప్పింది. దెబ్బ తిన్న పక్షుల్లా చూశారు వాళ్ళు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వాళ్ళకి. రఘు అయితే నోట మాటరాక అలా నిలబడిపోయాడు.
అసలు కోడలికి తమ మీద ఎందుకంత ద్వేషమో అర్థం కాలేదు వాళ్ళకి. నామకరణ కార్యక్రమం అయిన మర్నాడే తమ ఊరు వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ, ‘మమ్మల్ని ఇంకెప్పుడూ పిలవకురా’ అని రఘురాంతో చెప్పారు. అభావంగా చూశాడు రఘు.
∙∙ 
శంకరయ్య దిగులుతో మంచం పట్టేశాడు. కొడుకు దగ్గర ఉంటూ శేష జీవితాన్ని హాయిగా గడపాలనుకున్న అతని కల నెరవేరక మనోవ్యాధిగా మారింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు.
ఇక బ్రతకడం కష్టం అని డాక్టర్స్‌ చెప్పాక రఘుకి కబురు పెట్టింది అన్నపూర్ణమ్మ. బిజీ (?)గా ఉండటం వల్ల వెంటనే ఊరికి వెళ్ళలేకపోయాడు రఘు. చివరి చూపులు కూడా దక్కకుండా కన్ను మూశాడు శంకరయ్య. ఆ విషయం రఘుకి చేరవేశారు ఊరి వాళ్ళు. తండ్రి మరణ వార్త విని మనసులో విపరీతంగా దుఃఖించాడు రఘు.
‘నాన్నగారు ఇక మనకి లేరు’ అని రవళితో ఏడుస్తూ చెప్పాడు.
పెద్దగా బాధ పడలేదు ఆమె. మామగారితో అంత అనుబంధం లేదు కదా ఆమెకు.

‘సరే... వెళ్ళి జరగాల్సిన కార్యక్రమాలు చూసుకుని తిరిగి వచ్చెయ్‌’ అని చెప్పింది. వెంటనే బయలుదేరి ఊరికి వెళ్ళాడు రఘురాం.
ఊరి వాళ్ళంతా ‘ఇప్పుడా రావడం’ అన్నట్టు అతన్ని ఒక దోషిలా చూడసాగారు. మనసులో బాధ పడుతూనే తండ్రికి అంత్యక్రియలు జరిపించాడు. తల్లికి జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్‌ తిరిగి వచ్చేశాడు.
అన్నపూర్ణమ్మ పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఇన్నాళ్ళూ తోడు ఉన్న భర్త చనిపోవడంతో ఒంటరితనం చుట్టుముట్టింది ఆమెను. కొడుకు దగ్గరకి వెళ్ళి ఉండమని గ్రామస్తులు సలహా ఇచ్చారు.
ఒక రోజు రఘుకి ఫోన్‌  చేసి ‘బాబూ... నీ దగ్గరకు వస్తానురా... ఇక్కడ నాకు భయంగా ఉంది’ అని అడిగింది. గొంతులో ఏదో అడ్డు పడినట్టు ఏమీ చెప్పలేకపోయాడు రఘు.

‘మళ్ళీ ఫోన్‌  చేస్తానమ్మా’ అని కాల్‌ కట్‌ చేశాడు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ‘అమ్మ ఫోన్‌  చేసింది. ఇక్కడకు వస్తాను అంటోంది’ అని రవళితో చెప్పాడు.
‘అనుకున్నాను... ఇలాంటి రోజు వస్తుందని. నాకు అయితే ఆవిడ రావడం ఇష్టం లేదు. నీకు నచ్చితే పిలిపించుకో’ అని తేల్చేసింది రవళి. తల పట్టుకున్నాడు రఘురాం.
బాగా ఆలోచించాక, తల్లిని అలా వదిలేస్తే లోకం నిందిస్తుందని భయపడి ఏదైతే అది అయిందని తల్లిని తన దగ్గరకు రమ్మని ఫోన్‌  చేశాడు. ఒక రోజు పొద్దున్నే హైదరాబాద్‌కి చేరుకుంది అన్నపూర్ణమ్మ. తల్లిని రైల్వే స్టేషన్‌  నుండి పికప్‌ చేసుకుని తీసుకొస్తూ, దారిలో బోలెడన్ని జాగ్రత్తలు చెప్పాడు రఘు. రవళితో ఎక్కువగా మాట్లాడొద్దని, తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాడు. అన్నిటికీ తలూపింది అన్నపూర్ణమ్మ.

ఇంట్లోకి వచ్చిన అత్తను చూసి తల తిప్పుకుంది రవళి. ఈ చర్యతో చెప్పలేని బాధకు గురయింది అన్నపూర్ణమ్మ. భర్త చనిపోయి ఇక్కడికి వస్తే కనీసం పలకరించే దిక్కు లేదు అని మథనపడింది. రఘురాం ఇది గమనించినా, తెలియనట్టు తప్పుకున్నాడు.
అత్తాకోడళ్ళు ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు ఇంట్లో. రఘు వాళ్ళిద్దరి మధ్యన నలిగిపోతున్నాడు. మనవడు ఆదిత్య మాత్రం, నాన్నమ్మతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. అది కొంత ఉపశమనం కలిగించేది అన్నపూర్ణమ్మకు.
రఘురాంకి ఆఫీసులో ఇది ప్రమోషన్‌ రావాల్సిన టైము. కష్టపడి పని చేసి బాస్‌ని ఇంప్రెస్‌ చేస్తున్నాడు. రోజూ ఆఫీసు నుండి లేట్‌గా వస్తున్నాడు. రవళి కూడా వర్క్‌లో బిజీగానే ఉంటోంది.

ఆదిత్య తన స్కూల్‌ ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చెయ్యడం, స్మార్ట్‌ ఫోన్‌లో రీల్స్‌ చూడటంతో ఎవరినీ పట్టించుకునే స్థితిలో ఉండడు. వీటన్నిటి వల్ల అన్నపూర్ణమ్మ ఒంటరిగా ఫీల్‌ అవసాగింది. కొడుకు దగ్గర ఉంటే మనసు కుదుట పడుతుందని వస్తే అది మరింత మానసిక ఒంటరితనం కలిగించడం ఆమెకు నచ్చడం లేదు. అలాగని ఊరు తిరిగి వెళితే అది మరింత పరువు పోయే చర్య అవుతుంది.
కొడుకు ఉంచుకోలేక పంపించేశాడు అని నవ్వుతారు ఊళ్ళో వాళ్ళు. అందుకే మనసు చంపుకుని కాలం వెళ్ళదీయసాగింది.
ఒక రోజు ఆఫీసు నుండి వస్తూనే అసహనంగా అరవసాగాడు రఘురాం.

‘ఏమైంది... ఇలా డిస్టర్బ్‌డ్‌గా ఉన్నావు?’ అని అడిగింది రవళి.
‘ఎలా ఉంటాను... నా పేరు ప్రమోషన్‌ లిస్ట్‌లో లేదు’ అని ఏడుపు మొహం పెట్టాడు రఘు.
‘అందుకే నేను ఎప్పటి నుండో చెబుతున్నాను. ఆ దరిద్రాన్ని ఇంట్లో నుండి పంపెయ్యమని. మీరు వినడం లేదు. తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. ఇక ప్రమోషన్‌ ఎలా వస్తుంది’ అని అగ్నికి ఆజ్యం పోసింది.
‘అవును... నిజమే’ అని కోపంగా రగిలిపోతూ తల్లి దగ్గరకు వచ్చి, ‘అమ్మా... నువ్వు ఊరెళ్ళిపో’ అని గట్టిగా అరిచాడు.
హతాశురాలైంది అన్నపూర్ణమ్మ. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు తనకు సంబంధం లేని ఈ గొడవకు తాను కారణం ఎలా అవుతుంది అని ఆశ్చర్యపోయింది.

కొడుకుని కష్టపడి పెంచి పెద్దచేసి ఒక స్థాయికి తీసుకువస్తే ఇవాళ అతని కంటికి తానొక దరిద్రంలా కనబడటం జీర్ణించుకోలేకపోయింది. ప్రాణం పోయినట్టు విలవిల్లాడిపోయింది. ఇక కొడుకు దగ్గర ఉండటం అర్థరహితం అని నిర్ణయించుకుని మర్నాడే ఊరు బయలుదేరింది.
సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆమెను రైలు ఎక్కించి బయటకు వచ్చాక ‘హమ్మయ్యా... దరిద్రం వదిలింది’ అని రిలీఫ్‌గా ఫీల్‌ అయ్యాడు రఘురాం.
∙∙ 
‘తల్లి’ అనే దరిద్రం వదిలాక వృత్తిలో ఎదగసాగాడు రఘురాం. ప్రమోషన్‌  కూడా వచ్చింది.
అయితే ఢిల్లీలో పోస్టింగ్‌ ఇచ్చారు. వెళ్ళక తప్పని పరిస్థితి. రవళిని, కొడుకు ఆదిత్యని వదల్లేక వదల్లేక వదిలి ఢిల్లీ వెళ్ళి ఆఫీసులో జాయిన్‌  అయ్యాడు. అక్కడే క్వార్టర్స్‌లో మకాం పెట్టాడు. వంటకు అదీ ఇబ్బంది లేదు. వేళకు తిండి తినడం, ఆఫీసుకు వెళ్ళి పని చేయడం ఇదే అతని దినచర్య. ఇక్కడ హైదరాబాద్‌లో రవళి , తన కొడుకు ఆదిత్యను బాగా చదివిస్తూ బిజీగా అయిపోయింది.
కొన్నాళ్ళ తర్వాత పై చదువులకు విదేశాలు వెళ్ళిపోయాడు ఆదిత్య. అటు భర్తకు దూరంగా ఉండటం, ఇటు కొడుకు ఎబ్రాడ్‌ వెళ్ళడంతో ఒంటరితనం ఆవరించింది రవళికి. ఆమె మనసు స్వేచ్ఛను, ఆనందాన్ని కోరుకోసాగింది.
ఒకరోజు రఘురాం రవళితో ఫోన్‌ లో అన్నాడు. ‘నువ్వు జాబ్‌ మానేసి ఢిల్లీ వచ్చెయ్‌. హాయిగా కలిసి ఉందాం’ అని. ఒళ్ళు మండింది రవళికి.

‘నేను జాబ్‌ ఎందుకు మానాలి? నువ్వే మానేసెయ్‌. నేను కూడా కెరీర్‌లో ఎదగాలి కదా?’ అని మండిపడింది. ఇక నోరు తెరవలేకపోయాడు రఘురాం.
ఒకసారి ఎందుకో భార్యను చూడాలి అనిపించి చెప్పా పెట్టకుండా హైదరాబాద్‌ వచ్చాడు. కానీ తీరా ఇంటికి వచ్చేటప్పటికి రవళి లేదు. సెల్‌కి కాల్‌ చేస్తే రెస్పాన్స్‌ లేదు. ఇక చేసేదేమీ లేక వెయిట్‌ చెయ్యసాగాడు. ఎప్పుడో రాత్రికి వచ్చింది రవళి. రఘురాంని చూసి షాక్‌ అయింది.
‘ఏంటి చెప్పకుండా దొంగలా వచ్చావు? నా మీద అనుమానమా?’ అని వెటకారంగా అంది.
నిజానికి ఆమె తన వాట్సాప్‌ గ్రూప్‌ ఫ్రెండ్స్‌తో ఊరి చివర రిసార్ట్‌కి ఔటింగ్‌కి వెళ్ళింది. బాగా ఎంజాయ్‌ చేసి అలసిపోయి వచ్చింది.
‘అలా ఎందుకు అనుకుంటావు. రావాలి అనిపించింది వచ్చాను. ఇందులో తప్పేం ఉంది?’ నెమ్మదిగా అన్నాడు రఘురాం.
‘తప్పేం లేదు. నిన్ను నమ్మడం నాదే తప్పు’ అని విసుక్కుంది. ఆ రాత్రి ఆమెను దగ్గరకు తీసుకోవాలి అనుకున్నాడు కానీ రవళి అతనికి ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. భౌతికంగా దూరమైన వారి మధ్య ఇప్పుడు మానసిక దూరం కూడా పెరిగిపోయింది. తెల్లారి లేచి ఢిల్లీ వెళ్ళిపోయాడు రఘురాం.

ఎందుకో తెలీదు కానీ క్రమంగా అనారోగ్యం పాలయ్యాడు రఘురాం. బీపీ, షుగర్‌ అతన్ని ముట్టడించాయి. రోజు రోజుకీ బాగా నీరసించిపోతున్నాడు.
ఇక తప్పక ఒక రోజు భార్యకు ఫోన్‌  చేసి, ‘నాకు దగ్గరగా ఉండు... సమయానికి చేసే వాళ్ళు లేక ఇబ్బందిగా ఉంది.. ఇక్కడికి వచ్చెయ్‌’ అని బతిమాలాడు.
గట్టిగా నవ్వింది రవళి. ‘ఏం మాట్లాడుతున్నావు? నేను అన్నీ మానుకుని వచ్చి నీకు సేవలు చెయ్యాలా? ఏ కాలంలో ఉన్నావు? నాకు నా లైఫ్‌ ముఖ్యం. నీ బాగోగులు చూసుకుంటూ నా లైఫ్‌ వృథా చేసుకోలేను... బై’ అని ఫోన్‌  పెట్టేసింది. కొడుకు ఆదిత్యకు కాల్‌ చేస్తే కనీసం ఫోన్‌  కూడా ఎత్తడం లేదు వాడు. గుండె ముక్కలు అయింది రఘురాంకి. తన శక్తియుక్తులన్నీ కుటుంబం కోసమే ధారపోశాడు. తన బంధువులందరినీ వదులుకుని, భార్య, కొడుకు చుట్టూనే తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. కానీ తను కొంచెం బలహీనం అయ్యేసరికి ఎవరికీ అక్కరలేకుండా పోయాడు. ఇదేనా కుటుంబ బంధాలకు ఉన్న విలువ? ఇందుకోసమేనా తన జీవితాన్ని పణంగా పెట్టింది అన్న ప్రశ్నలు అతన్ని వేధించ సాగాయి. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.

బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్‌కి అప్లై చేశాడు. మూటా ముల్లె సర్దుకున్నాడు. ఎయిర్‌ పోర్ట్‌కి వచ్చి టికెట్‌ కొనుక్కుని ఫ్లయిట్‌లో కూర్చున్నాడు. ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది.
∙∙ 
ఉరుము లేని పిడుగులా ఊడిపడ్డ కొడుకుని చూసి ఆనందాశ్చర్యాలకు లోనయింది అన్నపూర్ణమ్మ.
‘రా నాయనా... రా...’ అని ప్రేమగా ఆహ్వానించింది. తల్లిని చూసి పసివాడిలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు రఘురాం. చిన్నప్పుడు తల్లి తనని వదిలి ఏదైనా ఊరు వెళితే ఆమె వచ్చేదాకా ఎదురు చూసి రాగానే, ‘అమ్మా ...’ అంటూ కౌగలించుకునేవాడు. ఎంత నిశ్చింతగా ఉండేదో అప్పుడు.

ఇప్పుడు కూడా అలాగే నిశ్చింతగా, సెక్యూర్డ్‌గా ఫీల్‌ అయ్యాడు. తనకు ఇంక ఏ భయమూ లేదని ఆనంద పడ్డాడు.
‘అమ్మా... ఇక నిన్ను విడిచి నేను ఎక్కడికీ వెళ్ళనమ్మా...’ అని చిన్న పిల్లాడిలా చెప్పాడు. నిండుగా నవ్వింది అన్నపూర్ణమ్మ.
‘అలాగే నాయనా... ఎక్కడికీ వెళ్ళొద్దు... నాతో పాటే నువ్వూ ... నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను’ అని దగ్గరకు తీసుకుంది. తల్లి ఒడిలో పసివాడిలా ఒదిగిపోయాడు పెద్ద రిటైర్డ్‌ ఆఫీసర్‌ రఘురాం... భార్యా కొడుకులకు భారం అయిపోయిన రఘురాం!!

- డా. సన్నిహిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement