breaking news
retaired employee
-
ఈ వారం కథ: 'తరువుకి కాయ భారమా!'
ఓటమి అనేది ఎవరికైనా బాధాకరం. జీవితంలో ఎంతో సాధించాక, ఎన్నో మెట్లెక్కాక, ‘నువ్వు ఓడిపోయావు’ అని నీ జీవితం నీతో చెబితే అది ఎంత విషాదకరం. రఘురాం పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఎక్కడో పల్లెటూర్లో పుట్టిన వాడు. కష్టపడి చదువుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఢిల్లీ దాకా ఎదిగిన వాడు. కానీ ఏం లాభం? ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, సాధించిందంతా శూన్యం అని తెలిసి వచ్చింది. భార్య, పిల్లలు అందరూ అతన్ని ఒక చేతగాని వాడు అని తీర్మానించి వదిలారు. వయసు మళ్ళిన అతను ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అయితే అది నిజమా లేక కేవలం వారి అభిప్రాయం మాత్రమేనా అన్న సంశయం అతన్ని పీడించసాగింది. ఎటూ తేల్చుకోలేక నిరంతరం ఆలోచనల్లోకి జారిపోతున్నాడు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నాడు!∙∙ ‘రఘూ... అన్నం తిను నాన్నా’ అని బతిమాలుతున్న తల్లిని కోపంగా చూశాడు రఘురాం. అన్నపూర్ణకు కూడా కోపం వచ్చింది. ఎంతసేపూ చదువు చదువు అంటూ తిండీ తిప్పలు మానేస్తున్నాడు రఘురాం. ఇలా అయితే పిల్లాడు ఎలా బలంగా ఉంటాడు అని ఆమె బాధ. అసలే పల్లెటూరు, తిండి తినకుండా అనారోగ్యం పాలైతే వైద్య సౌకర్యం లేదు. ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న టౌన్ హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తుంది.చాలాసేపు బతిమాలాక పుస్తకం ముందు నుండి లేచాడు రఘురాం. తల్లి పెట్టిన అన్నం కూర తిని పెరుగు కూడా వేసుకున్నాడు. సంతృప్తిగా చూసింది అన్నపూర్ణ.‘ఏరా...అన్నం తిన్నావా?’ ప్రేమగా అడిగాడు అప్పుడే పొలం నుండి వచ్చిన శంకరయ్య.‘తిన్నాను నాన్నా’ అని చెప్పి మళ్ళీ పుస్తకం అందుకున్నాడు రఘురాం. ముసి ముసిగా నవ్వుకుంది అన్నపూర్ణ.రఘురాం చాలా మంచి విద్యార్థి. రోజూ ఇంటి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్‌కి వెళుతూ బుద్ధిగా చదువుకుంటాడు. టీచర్లకు కూడా అతనంటే ఎంతో ఇష్టం. చదువు పట్ల అతని శ్రద్ధను చూసి మురిసిపోతారు అన్నపూర్ణ శంకరయ్యలు. ఊరి వాళ్ళు కూడా ‘మంచి కొడుకుని కన్నావమ్మా’ అని చెబుతూ ఉంటారు అన్నపూర్ణతో!కాలచక్రం గిర్రున తిరిగింది. రఘురాం ఇంజినీరింగ్ పూర్తి చేసి కేంపస్ ఇంటర్వ్యూలో క్లియర్ అయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్న ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో జూనియర్ ఇంజినీర్ పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యాడు. అతని విజయాన్ని చూసి గ్రామస్థులు వేనోళ్ళ పొగిడారు. కొడుక్కి దిష్టి తీసి హైదరాబాద్ పంపించింది అన్నపూర్ణ.జాబ్‌లో జాయిన్ అయి సెటిల్ అయ్యాక తల్లిదండ్రులని రమ్మన్నాడు రఘురాం.ఒక మంచిరోజు చూసుకుని హైదరాబాద్ వచ్చారు వాళ్ళు. కొడుకు ఉంటున్న కంపెనీ క్వార్టర్‌ని, ఆ నాగరిక వాతావరణాన్ని చూసి మురిసిపోయారు. తమలాంటి వాళ్ళ కడుపున పుట్టి ఇక్కడి దాకా ఎదిగిన కొడుకు మీద వారి ప్రేమ రెట్టింపయింది. ఉన్నన్నాళ్ళు వాళ్ళకి హైదరాబాద్‌లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్రదేశాలను తిప్పి చూపించాడు రఘు. సంతోషపడిపోయారు వాళ్ళు. కొన్ని రోజుల పాటు కొడుకుని బాగా చూసుకుని తమ ఊరు వెళ్ళడానికి బయలుదేరారు. సికింద్రాబాద్ స్టేషన్ లో వాళ్ళను ట్రైన్ ఎక్కించి బయటకు వస్తూ చిన్న పిల్లాడిలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు రఘురాం.చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఇంకోవైపు రైల్లో వెళుతున్న అతని తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే. కొడుకును వదిలి ఎప్పుడూ ఉండలేదు వాళ్ళు!∙∙ వృత్తిలో ఎదుగుతున్నాడు రఘురాం. ఒక గ్రేడ్ ప్రమోషన్ పొందాక పెళ్ళి మీద మనసయింది అతనికి.కొలీగ్ రవళి అందుకు కారణం. అందం, తెలివితేటలతో అతని మనసు దోచుకుంది.అమాయకంగా కనపడుతూ కష్టపడే మనస్తత్వం ఉన్న రఘురాం కూడా ఆమె మనసుని కొల్లగొట్టాడు. ఈ విషయం తెలిసి ఎంతో సంబరపడిపోయారు అన్నపూర్ణమ్మ దంపతులు.ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంత పీట వేసి కొడుక్కి పెళ్ళి చేశారు. మనసారా దీవించి దగ్గరుండి దంపతులతో కాపురం పెట్టించారు. శోభనం ముహూర్తం పెట్టి, ఆ అద్భుత క్షణాల్లో రఘుని, రవళిని గదిలోకి పంపించారు. రఘు మనసు ఉద్విగ్నంగా ఉంది. అనుభవించబోయే సుఖాన్ని తలచుకుని అతని మనసు గాల్లో తేలుతోంది. రవళిని ఆశగా దగ్గరకు తీసుకున్నాడు.సున్నితంగా అతన్ని విడిపించుకుని దూరంగా జరిగింది రవళి. నవ్వుకున్నాడు రఘు. తొలి కలయిక పట్ల ఆమెకు భయం ఉంది అనుకున్నాడు.రవళి సిగ్గుపడుతూ ‘ఇంట్లో మీ అమ్మా నాన్న ఉన్నారు కదా... నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది.వాళ్ళు ఊరు వెళ్ళిపోయాక మనం కలుద్దాం. అప్పటిదాకా వద్దు’ అంది.ఆమె చెప్పిన లాజిక్ అర్థం కాలేదు రఘుకి. అయినా ‘సరే ’ అన్నాడు. తర్వాత మంచంపై విడిగా పడుకున్నారు ఇద్దరూ.తర్వాతి రోజు నుంచే కోడలి మనస్తత్వం అర్థం చేసుకున్నారు రఘు తల్లిదండ్రులు. తాము ఉండటం ఆ అమ్మాయికి ఇష్టం లేదు అని తెలుసుకున్నారు. ఆ విషయాన్ని గొడవగా మారిస్తే కొడుకు మనసు బాధపడుతుందని మిన్నకుండిపోయారు.‘ఊళ్లో పనులు ఉన్నాయిరా... వెళ్తాం’ అని కొడుకుతో అన్నారు. వెంటనే, ‘సరే...’ అన్నాడు రఘు.సికింద్రాబాద్‌లో వాళ్ళని రైలు ఎక్కించి బయటకు వచ్చాక ‘హమ్మయ్యా’ అని రిలీఫ్‌గా ఫీలయ్యాడు.ఆ రాత్రి రవళి కౌగిలిలో కరిగిపోతూ స్వర్గాన్ని చూశాడు.కొడుకు సుఖాన్ని కోరుకున్న రఘు తల్లిదండ్రులు ఆ తర్వాత ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. ఏదైనా అవసరం ఉంటే రఘు మాత్రమే ఊరు వెళ్ళి వస్తూ ఉండేవాడు.తొలిసారిగా కొడుకు పుట్టాడు రఘు దంపతులకి. వాళ్ళ ఆనందం అంబరాన్ని అంటింది.నామకరణం రోజున రమ్మని తల్లిదండ్రులకు కబురు చెప్పాడు రఘు.ఆ రోజుకి హైదరాబాద్‌లో దిగారు వాళ్ళు. ప్రేమగా ఆహ్వానించాడు రఘు. రవళి మాత్రం వాళ్ళతో మాట్లాడలేదు. మనవడ్ని చూసి మురిసిపోయారు అన్నపూర్ణమ్మ దంపతులు.ఆ పసివాడికి తమ కులదైవం పేరు పెట్టాలని అడిగారు రఘుని. అది విన్న రవళి ‘నా కొడుక్కి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టొద్దు. నచ్చితే ఉండండి లేదంటే వెళ్ళిపోండి’ అని కఠినంగా చెప్పింది. దెబ్బ తిన్న పక్షుల్లా చూశారు వాళ్ళు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వాళ్ళకి. రఘు అయితే నోట మాటరాక అలా నిలబడిపోయాడు.అసలు కోడలికి తమ మీద ఎందుకంత ద్వేషమో అర్థం కాలేదు వాళ్ళకి. నామకరణ కార్యక్రమం అయిన మర్నాడే తమ ఊరు వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ, ‘మమ్మల్ని ఇంకెప్పుడూ పిలవకురా’ అని రఘురాంతో చెప్పారు. అభావంగా చూశాడు రఘు.∙∙ శంకరయ్య దిగులుతో మంచం పట్టేశాడు. కొడుకు దగ్గర ఉంటూ శేష జీవితాన్ని హాయిగా గడపాలనుకున్న అతని కల నెరవేరక మనోవ్యాధిగా మారింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు.ఇక బ్రతకడం కష్టం అని డాక్టర్స్ చెప్పాక రఘుకి కబురు పెట్టింది అన్నపూర్ణమ్మ. బిజీ (?)గా ఉండటం వల్ల వెంటనే ఊరికి వెళ్ళలేకపోయాడు రఘు. చివరి చూపులు కూడా దక్కకుండా కన్ను మూశాడు శంకరయ్య. ఆ విషయం రఘుకి చేరవేశారు ఊరి వాళ్ళు. తండ్రి మరణ వార్త విని మనసులో విపరీతంగా దుఃఖించాడు రఘు.‘నాన్నగారు ఇక మనకి లేరు’ అని రవళితో ఏడుస్తూ చెప్పాడు.పెద్దగా బాధ పడలేదు ఆమె. మామగారితో అంత అనుబంధం లేదు కదా ఆమెకు.‘సరే... వెళ్ళి జరగాల్సిన కార్యక్రమాలు చూసుకుని తిరిగి వచ్చెయ్’ అని చెప్పింది. వెంటనే బయలుదేరి ఊరికి వెళ్ళాడు రఘురాం.ఊరి వాళ్ళంతా ‘ఇప్పుడా రావడం’ అన్నట్టు అతన్ని ఒక దోషిలా చూడసాగారు. మనసులో బాధ పడుతూనే తండ్రికి అంత్యక్రియలు జరిపించాడు. తల్లికి జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు.అన్నపూర్ణమ్మ పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఇన్నాళ్ళూ తోడు ఉన్న భర్త చనిపోవడంతో ఒంటరితనం చుట్టుముట్టింది ఆమెను. కొడుకు దగ్గరకి వెళ్ళి ఉండమని గ్రామస్తులు సలహా ఇచ్చారు.ఒక రోజు రఘుకి ఫోన్ చేసి ‘బాబూ... నీ దగ్గరకు వస్తానురా... ఇక్కడ నాకు భయంగా ఉంది’ అని అడిగింది. గొంతులో ఏదో అడ్డు పడినట్టు ఏమీ చెప్పలేకపోయాడు రఘు.‘మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా’ అని కాల్ కట్ చేశాడు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ‘అమ్మ ఫోన్ చేసింది. ఇక్కడకు వస్తాను అంటోంది’ అని రవళితో చెప్పాడు.‘అనుకున్నాను... ఇలాంటి రోజు వస్తుందని. నాకు అయితే ఆవిడ రావడం ఇష్టం లేదు. నీకు నచ్చితే పిలిపించుకో’ అని తేల్చేసింది రవళి. తల పట్టుకున్నాడు రఘురాం.బాగా ఆలోచించాక, తల్లిని అలా వదిలేస్తే లోకం నిందిస్తుందని భయపడి ఏదైతే అది అయిందని తల్లిని తన దగ్గరకు రమ్మని ఫోన్ చేశాడు. ఒక రోజు పొద్దున్నే హైదరాబాద్‌కి చేరుకుంది అన్నపూర్ణమ్మ. తల్లిని రైల్వే స్టేషన్ నుండి పికప్ చేసుకుని తీసుకొస్తూ, దారిలో బోలెడన్ని జాగ్రత్తలు చెప్పాడు రఘు. రవళితో ఎక్కువగా మాట్లాడొద్దని, తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాడు. అన్నిటికీ తలూపింది అన్నపూర్ణమ్మ.ఇంట్లోకి వచ్చిన అత్తను చూసి తల తిప్పుకుంది రవళి. ఈ చర్యతో చెప్పలేని బాధకు గురయింది అన్నపూర్ణమ్మ. భర్త చనిపోయి ఇక్కడికి వస్తే కనీసం పలకరించే దిక్కు లేదు అని మథనపడింది. రఘురాం ఇది గమనించినా, తెలియనట్టు తప్పుకున్నాడు.అత్తాకోడళ్ళు ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు ఇంట్లో. రఘు వాళ్ళిద్దరి మధ్యన నలిగిపోతున్నాడు. మనవడు ఆదిత్య మాత్రం, నాన్నమ్మతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. అది కొంత ఉపశమనం కలిగించేది అన్నపూర్ణమ్మకు.రఘురాంకి ఆఫీసులో ఇది ప్రమోషన్ రావాల్సిన టైము. కష్టపడి పని చేసి బాస్‌ని ఇంప్రెస్ చేస్తున్నాడు. రోజూ ఆఫీసు నుండి లేట్‌గా వస్తున్నాడు. రవళి కూడా వర్క్‌లో బిజీగానే ఉంటోంది.ఆదిత్య తన స్కూల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చెయ్యడం, స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూడటంతో ఎవరినీ పట్టించుకునే స్థితిలో ఉండడు. వీటన్నిటి వల్ల అన్నపూర్ణమ్మ ఒంటరిగా ఫీల్ అవసాగింది. కొడుకు దగ్గర ఉంటే మనసు కుదుట పడుతుందని వస్తే అది మరింత మానసిక ఒంటరితనం కలిగించడం ఆమెకు నచ్చడం లేదు. అలాగని ఊరు తిరిగి వెళితే అది మరింత పరువు పోయే చర్య అవుతుంది.కొడుకు ఉంచుకోలేక పంపించేశాడు అని నవ్వుతారు ఊళ్ళో వాళ్ళు. అందుకే మనసు చంపుకుని కాలం వెళ్ళదీయసాగింది.ఒక రోజు ఆఫీసు నుండి వస్తూనే అసహనంగా అరవసాగాడు రఘురాం.‘ఏమైంది... ఇలా డిస్టర్బ్డ్గా ఉన్నావు?’ అని అడిగింది రవళి.‘ఎలా ఉంటాను... నా పేరు ప్రమోషన్ లిస్ట్‌లో లేదు’ అని ఏడుపు మొహం పెట్టాడు రఘు.‘అందుకే నేను ఎప్పటి నుండో చెబుతున్నాను. ఆ దరిద్రాన్ని ఇంట్లో నుండి పంపెయ్యమని. మీరు వినడం లేదు. తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. ఇక ప్రమోషన్ ఎలా వస్తుంది’ అని అగ్నికి ఆజ్యం పోసింది.‘అవును... నిజమే’ అని కోపంగా రగిలిపోతూ తల్లి దగ్గరకు వచ్చి, ‘అమ్మా... నువ్వు ఊరెళ్ళిపో’ అని గట్టిగా అరిచాడు.హతాశురాలైంది అన్నపూర్ణమ్మ. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు తనకు సంబంధం లేని ఈ గొడవకు తాను కారణం ఎలా అవుతుంది అని ఆశ్చర్యపోయింది.కొడుకుని కష్టపడి పెంచి పెద్దచేసి ఒక స్థాయికి తీసుకువస్తే ఇవాళ అతని కంటికి తానొక దరిద్రంలా కనబడటం జీర్ణించుకోలేకపోయింది. ప్రాణం పోయినట్టు విలవిల్లాడిపోయింది. ఇక కొడుకు దగ్గర ఉండటం అర్థరహితం అని నిర్ణయించుకుని మర్నాడే ఊరు బయలుదేరింది.సికింద్రాబాద్ స్టేషన్లో ఆమెను రైలు ఎక్కించి బయటకు వచ్చాక ‘హమ్మయ్యా... దరిద్రం వదిలింది’ అని రిలీఫ్‌గా ఫీల్ అయ్యాడు రఘురాం.∙∙ ‘తల్లి’ అనే దరిద్రం వదిలాక వృత్తిలో ఎదగసాగాడు రఘురాం. ప్రమోషన్ కూడా వచ్చింది.అయితే ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. వెళ్ళక తప్పని పరిస్థితి. రవళిని, కొడుకు ఆదిత్యని వదల్లేక వదల్లేక వదిలి ఢిల్లీ వెళ్ళి ఆఫీసులో జాయిన్ అయ్యాడు. అక్కడే క్వార్టర్స్‌లో మకాం పెట్టాడు. వంటకు అదీ ఇబ్బంది లేదు. వేళకు తిండి తినడం, ఆఫీసుకు వెళ్ళి పని చేయడం ఇదే అతని దినచర్య. ఇక్కడ హైదరాబాద్‌లో రవళి , తన కొడుకు ఆదిత్యను బాగా చదివిస్తూ బిజీగా అయిపోయింది.కొన్నాళ్ళ తర్వాత పై చదువులకు విదేశాలు వెళ్ళిపోయాడు ఆదిత్య. అటు భర్తకు దూరంగా ఉండటం, ఇటు కొడుకు ఎబ్రాడ్ వెళ్ళడంతో ఒంటరితనం ఆవరించింది రవళికి. ఆమె మనసు స్వేచ్ఛను, ఆనందాన్ని కోరుకోసాగింది.ఒకరోజు రఘురాం రవళితో ఫోన్ లో అన్నాడు. ‘నువ్వు జాబ్ మానేసి ఢిల్లీ వచ్చెయ్. హాయిగా కలిసి ఉందాం’ అని. ఒళ్ళు మండింది రవళికి.‘నేను జాబ్ ఎందుకు మానాలి? నువ్వే మానేసెయ్. నేను కూడా కెరీర్లో ఎదగాలి కదా?’ అని మండిపడింది. ఇక నోరు తెరవలేకపోయాడు రఘురాం.ఒకసారి ఎందుకో భార్యను చూడాలి అనిపించి చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చాడు. కానీ తీరా ఇంటికి వచ్చేటప్పటికి రవళి లేదు. సెల్‌కి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఇక చేసేదేమీ లేక వెయిట్ చెయ్యసాగాడు. ఎప్పుడో రాత్రికి వచ్చింది రవళి. రఘురాంని చూసి షాక్ అయింది.‘ఏంటి చెప్పకుండా దొంగలా వచ్చావు? నా మీద అనుమానమా?’ అని వెటకారంగా అంది.నిజానికి ఆమె తన వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్‌తో ఊరి చివర రిసార్ట్‌కి ఔటింగ్‌కి వెళ్ళింది. బాగా ఎంజాయ్ చేసి అలసిపోయి వచ్చింది.‘అలా ఎందుకు అనుకుంటావు. రావాలి అనిపించింది వచ్చాను. ఇందులో తప్పేం ఉంది?’ నెమ్మదిగా అన్నాడు రఘురాం.‘తప్పేం లేదు. నిన్ను నమ్మడం నాదే తప్పు’ అని విసుక్కుంది. ఆ రాత్రి ఆమెను దగ్గరకు తీసుకోవాలి అనుకున్నాడు కానీ రవళి అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. భౌతికంగా దూరమైన వారి మధ్య ఇప్పుడు మానసిక దూరం కూడా పెరిగిపోయింది. తెల్లారి లేచి ఢిల్లీ వెళ్ళిపోయాడు రఘురాం.ఎందుకో తెలీదు కానీ క్రమంగా అనారోగ్యం పాలయ్యాడు రఘురాం. బీపీ, షుగర్ అతన్ని ముట్టడించాయి. రోజు రోజుకీ బాగా నీరసించిపోతున్నాడు.ఇక తప్పక ఒక రోజు భార్యకు ఫోన్ చేసి, ‘నాకు దగ్గరగా ఉండు... సమయానికి చేసే వాళ్ళు లేక ఇబ్బందిగా ఉంది.. ఇక్కడికి వచ్చెయ్’ అని బతిమాలాడు.గట్టిగా నవ్వింది రవళి. ‘ఏం మాట్లాడుతున్నావు? నేను అన్నీ మానుకుని వచ్చి నీకు సేవలు చెయ్యాలా? ఏ కాలంలో ఉన్నావు? నాకు నా లైఫ్ ముఖ్యం. నీ బాగోగులు చూసుకుంటూ నా లైఫ్ వృథా చేసుకోలేను... బై’ అని ఫోన్ పెట్టేసింది. కొడుకు ఆదిత్యకు కాల్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు వాడు. గుండె ముక్కలు అయింది రఘురాంకి. తన శక్తియుక్తులన్నీ కుటుంబం కోసమే ధారపోశాడు. తన బంధువులందరినీ వదులుకుని, భార్య, కొడుకు చుట్టూనే తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. కానీ తను కొంచెం బలహీనం అయ్యేసరికి ఎవరికీ అక్కరలేకుండా పోయాడు. ఇదేనా కుటుంబ బంధాలకు ఉన్న విలువ? ఇందుకోసమేనా తన జీవితాన్ని పణంగా పెట్టింది అన్న ప్రశ్నలు అతన్ని వేధించ సాగాయి. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేశాడు. మూటా ముల్లె సర్దుకున్నాడు. ఎయిర్ పోర్ట్‌కి వచ్చి టికెట్ కొనుక్కుని ఫ్లయిట్లో కూర్చున్నాడు. ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది.∙∙ ఉరుము లేని పిడుగులా ఊడిపడ్డ కొడుకుని చూసి ఆనందాశ్చర్యాలకు లోనయింది అన్నపూర్ణమ్మ.‘రా నాయనా... రా...’ అని ప్రేమగా ఆహ్వానించింది. తల్లిని చూసి పసివాడిలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు రఘురాం. చిన్నప్పుడు తల్లి తనని వదిలి ఏదైనా ఊరు వెళితే ఆమె వచ్చేదాకా ఎదురు చూసి రాగానే, ‘అమ్మా ...’ అంటూ కౌగలించుకునేవాడు. ఎంత నిశ్చింతగా ఉండేదో అప్పుడు.ఇప్పుడు కూడా అలాగే నిశ్చింతగా, సెక్యూర్డ్‌గా ఫీల్ అయ్యాడు. తనకు ఇంక ఏ భయమూ లేదని ఆనంద పడ్డాడు.‘అమ్మా... ఇక నిన్ను విడిచి నేను ఎక్కడికీ వెళ్ళనమ్మా...’ అని చిన్న పిల్లాడిలా చెప్పాడు. నిండుగా నవ్వింది అన్నపూర్ణమ్మ.‘అలాగే నాయనా... ఎక్కడికీ వెళ్ళొద్దు... నాతో పాటే నువ్వూ ... నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను’ అని దగ్గరకు తీసుకుంది. తల్లి ఒడిలో పసివాడిలా ఒదిగిపోయాడు పెద్ద రిటైర్డ్ ఆఫీసర్ రఘురాం... భార్యా కొడుకులకు భారం అయిపోయిన రఘురాం!!- డా. సన్నిహిత్ -
లైఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే పింఛన్
సాక్షి, హన్మకొండ అర్బన్ : జిల్లా ఖజానా శాఖ ద్వారా సుమారు 20 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు నెలవారీ పింఛన్ పొందుతున్నారు. వీరికి ప్రతినెలా సుమారు రూ. 65 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే, నిబంధనల మేరకు ప్రతీ పింఛన్‌దారు ఏటా తాను జీవించి ఉన్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని విధిగా ఖజానా అధికారులకు అందజేయాలి. ప్రస్తుతం కోవిడ్–19 నేపథ్యంలో భౌతికంగా కాకుండా 2021 మార్చి 31లోపు ప్రభుత్వ టీ యాప్ పోలియో యాప్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా జీవన్ ప్రమాణ్ ద్వారా అందచేయాలి. అలా అందజేసిన వారికి మాత్రమే 2021 – 2022 ఆర్థిక సంవత్సరం మొత్తం పింఛన్ అందుతుంది. లేనిపక్షంలో వచ్చే ఏడాది మే నుంచి పింఛన్ ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయండి.. టీ యాప్ పోలియో ద్వారా గత ఏడాది కూడా జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు తీసుకున్నారు. అలా గత ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకున్న పింఛన్‌దారులు ఈ ఏడాదికి నేరుగా సెల్ఫీ ద్వారా ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకోని వారు మాత్రం నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు తమ మొబైల్ ఫోన్లో టీ యాప్ పోలియో తెలంగాణ ప్రభుత్వ యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ నంబర్, ఈ మెయిల్ నమోదు చేస్తే పిన్ వస్తుంది. అనంతరం తెలంగాణ ప్రభుత్వ పింఛన్దారుడిగా చెబుతూ ఓటరు ఐడీ నంబర్ (ఎపిక్ నంబర్) లేదా బ్యాంకు అకౌంట్ నంబర్‌తో పాటు పేరు, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. వీటితో పాటు సెల్ఫీ దిగి అప్లోడ్ చేయాలి. అన్నీ సరిగ్గా ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత టీయాప్ పోలియో సాఫ్ట్వేర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నమోదైన ఓటరు వివరాలు, ఖజానా శాఖ సాఫ్ట్‌వేర్‌లో నమోదైన వివరాలు ఫొటోలతో సహా ట్రెజరీ అధికారుల పరిశీలనకు అందుతాయి. అక్కడ సరైనదేనని ధృవీకరించుకుని రిజిస్ట్రేషన్‌ను ఆమోదిస్తారు. ఆ తర్వాత పింఛన్‌దారులు జీవిత కాలమంతా జీవన ధృవీకరణ పత్రాన్ని ఇంట్లో నుంచి టీయాప్ పోలియో యాప్ ద్వారా సమర్పించవచ్చు. కాగా, రిజిస్ట్రేషన్ పరిశీలన పూర్తయ్యాక మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్‌ను ట్రెజరీ అధికారులు ఆమోదించినట్లుగా మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే మళ్లీ సెల్ఫీ దిగి తన జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. రెండోసారి దిగిన సెల్ఫీ ఫొటోతో జీవన ధృవీకరణ పత్రాన్ని నేరుగా ట్రెజరీ సాఫ్ట్వేర్ ఆమోదిస్తుంది. ఎవరివైనా వివరాలు లేదా ఫొటోలు రెండూ సరిగ్గా లేనప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ట్రెజరీ అధికారులు తిరస్కరిస్తారు. మళ్లీ సరిగ్గా నమోదు చేసి తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని కోసం ఎలాంటి రుసుము ఎవ్వరికీ చెల్లించాలి్సన అవసరం లేదు. మరికొంత సమాచారం పోస్ట్ ద్వారా వచ్చిన జీవన ధృవీకరణ పత్రాలను అధికారులు ఆమోదించరు. పత్రం సమర్పించిన తర్వాత ఎవరైనా పింఛన్‌దారులు మరణిస్తే ఆ వివరాలను కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఓటరు కార్డు లేని పింఛన్‌దారులు ఆధార్ నంబర్ ద్వారా సమీప మీ సేవా కేంద్రానికి లేదా కేంద్ర ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ కేంద్రాలకు వెళ్లి జీవన ధృవీకరణ పత్రాన్ని అందచేయవచ్చు. ఇందుకోసం నామమాత్రపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ నంబర్ లేని వారి జీవన ధృవీకరణ పత్రం మీ సేవ కేంద్రాల్లో ఆమోదించరు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛన్‌దారులు ట్రెజరీ కార్యాలయంలో తమ ఆధార్ నంబర్ నమోదు చేయించుకోవాలి. కాగా, ఓటరు కార్డు, ఆధార్ నంబర్ లేని వారితో పాటు ఆధార్ నంబరు ఉండి కూడా వేళ్లు సరిగ్గా స్కాన్ కాక జీవన ధృవీకరణ పత్రాన్ని ఆన్లైన్లో ఇవ్వలేని వారైతే సంబంధిత ట్రెజరీ అధికారిని కలిసి పత్రాన్ని నేరుగా అందచేయవచ్చు. రెవెన్యూ ధ్రువీకరణ పత్రం కూడా.. జీఓ 315 ద్వారా పింఛన్ పొందుతున్న అవివాహిత మహిళలు, వితంతు మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలతో పాటు మైనర్ పింఛన్ పొందుతున్న ఫ్యామిలీ పింఛన్‌దారులు వివాహం చేసుకోనట్లు, ఉద్యోగం చేయడం లేదన్నట్లుగా రెవెన్యూ శాఖ ద్వారా ధృవీకరణ పత్రాన్ని ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి. దివ్యాంగుల పింఛన్‌దారులు ఇటీవల(మూడేళ్ల క్రితం) తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. వీరు ధృవీకరణ పత్రాలను ట్రెజరీ కార్యాలయంలో ఇవ్వకుండా నేరుగా జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తే పింఛన్ నిలిపివేస్తారు. రెండు పింఛన్లు పొందుతున్న వారైతే ఒక దానిపైనే కరువు భత్యం పొందాల్సి ఉంటుంది. ఇలాంటి వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కువగా వస్తున్న కరువు భత్యాన్నే పొందాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉంటున్నారా? విదేశాల్లో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులు అక్కడి ఎంబసీ ద్వారా జీవన ధృవీకరణ పత్రాన్ని జిల్లా ఖజానా అధికారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. బంధువుల ద్వా రా వచ్చినా, వాట్సప్ లేదా ఫేస్బుక్ వీడియో కాల్ ద్వారా అందిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరు. ఎంబసీ ద్వారా పంపలేనప్పుడు స్వదేశానికి వచ్చిన తర్వాత ట్రెజరీ అధికారికి పత్రాలను సమర్పించి పింఛన్ పొందొచ్చు. కార్యాలయాలకు రావొద్దు కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లు ఎవరూ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి కార్యాలయాలకు రావొద్దు. పెన్షనర్లలో ఎక్కువ మంది 60 ఏళ్ల వయస్సు పైబడినవారు ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా కార్యాలయాలకు వచ్చి అనారోగ్యం కొని తెచ్చుకోవద్దు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు, ఇతర ఆన్లైన్ పద్ధతుల ద్వారా లైఫ్ సర్టిఫికెట్ అందజేస్తే సరిపోతుంది. ఈ విషయంలో దళారుల మాటలు నమ్మి డబ్బు ఇవ్వొద్దు. ఎవరికైనా(వరంగల్ అర్బన్ జిల్లా పెన్షనర్లు) ఏదైనా సమస్యలు, సందేహాలు ఉంటే నేరుగా 77999 34090 నంబర్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయవచ్చు.– గుజ్జు రాజు, జిల్లా ఖజానా లెక్కల అధికారి -
రామారావు.. అప్పారావు.. భాస్కరరావు!
సాక్షి, టెక్కలి: రామారావు.. అప్పారావు.. భాస్కరరావు.. ఇవన్నీ ఓటర్ల జాబితాలోని పేర్లు అనుకుంటే పొరపాటే. డివిజన్ కేంద్రమైన టెక్కలికి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి రామారావు ఇన్ని పేర్లతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అధికారుల కళ్లు గప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాజేస్తున్నాడు. ఈయన నిర్వాకంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి యు.తమ్మయ్య ఆధారాలతో సహా సిద్ధమయ్యారు. ఆయన చెప్పిన సమాచారం మేరకు.. టెక్కలి పట్టణానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి నెయ్యిల రామారావు బతికుండగానే అప్పారావుగా పేరు మార్చుకుని తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించాడు. దీంతో భార్య వరలక్ష్మికి వితంతు పింఛన్(ఐడీ నంబరు 101746880) మంజూరైంది. రామారావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేశం కార్యకర్తల సాయంతో వృద్ధాప్య పింఛన్ (ఐడీ నంబరు 101909288) కొట్టేశాడు. అంతేకాకుండా భార్య వరలక్ష్మి అతి తెలివి ప్రదర్శించి తన భర్త రామారావు పేరును భాస్కరరావుగా మార్చి స్థానిక ఎన్టీఆర్ కాలనీలో ఇళ్ల స్థలాలు కాజేయడంతో పాటు టీడీపీ కార్యకర్తల సాయంతో నిర్మాణాలు సైతం చేపట్టారు. అప్పట్లో కొంత మంది ఫిర్యాదు చేసినప్పటికీ టీడీపీ కార్యకర్తల అండతో ఇంటి నిర్మాణం పనులు వేగవంతంగా కొనసాగించేశారు. ఈ కుటుంబ సభ్యులకే స్థానిక శ్రీనివాసనగర్‌లో సొంతంగా భారీ భవనాలు ఉండడం విశేషం. ఎప్పటికప్పుడు అధికారుల కళ్లుకప్పి ప్రభుత్వాన్ని మోసగిస్తూ పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను అక్రమార్గంలో పొందుతున్న వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానిక విశ్రాంత ఉద్యోగి తమ్మయ్య టీడీపీ హయాంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రావడంతో రామారావు కుటుంబ సభ్యుల మోసాలపై ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు చేసేందుకు ఆయన సాక్ష్యాధారాలతో సహా సిద్ధమవుతున్నారు. -
విద్య కోసం పింఛను విరాళం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని విద్యా సంస్థల అభివృద్ధికి గాను ఓ మాజీ మహిళా ప్రొఫెసర్ నెలనెలా తనకొచ్చే రూ.50 వేల పెన్షన్‌ను విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు. 2002 నుంచి ఇప్పటివరకు రూ.97 లక్షలు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విరాళమిచ్చినట్లు మాజీ ప్రొఫెసర్ చిత్రలేఖ మల్లిక్ వెల్లడించారు. కోల్‌కతాలోని బాగుతి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. విక్టోరియా ఇన్స్టిట్యూట్లో సంస్కృతం ప్రొఫెసర్‌గా ఆమె పనిచేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పరిశోధనలు చేస్తున్న వారికి ఆర్థిక సాయం అందించేందుకే ఇలా విరాళమిస్తున్నట్లు తెలిపారు. తనకు నెలకు పింఛన్ కింద రూ.50 వేలు వస్తున్నాయని, ప్రొఫెసర్‌గా పనిచేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీకి రూ.50 లక్షలు విరాళమిచ్చినట్లు పేర్కొన్నారు. తన పరిశోధనలకు మార్గనిర్దేశకత్వం చేసిన పండిట్ బిధుభూశణ్ భట్టాచార్య జ్ఞాపకార్థం గతేడాది రూ.50 లక్షలను వర్సిటీకి అందజేసినట్లు తెలిపారు. మొదటిసారిగా 2002లో తన పింఛన్ రూ.50 వేలను విక్టోరియా ఇన్స్టిట్యూట్ మౌలిక వసతుల కోసం విరాళమిచ్చినట్లు చెప్పారు. అలాగే హౌరాలోని ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్‌కు రూ.31 లక్షలు విరాళం ఇచ్చానని అన్నారు. -
మళ్లీ బడికి..
ఏళ్ల తరబడి విద్యార్థుల మధ్య పాఠశాలలో గడిపిన టీచర్లకు పదవీ విరమణ పొందిన తర్వాత ఇంట్లో ఒంటరిగా కూర్చోడానికి ఇష్టపడరు. అదేవిధంగా కాలక్షేపం కోసం ఇతర పనులు చేయడానికి కష్టంగా భావిస్తారు. అందుకే వారి అనుభవం, జ్ఞానాన్ని పిల్లలకు అందించాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వివరాలు సేకరించే పనిలో ఎంఈఓలు నిమజ్ఞమయ్యారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తే పాఠశాలలు బలపడి ఉత్తీర్ణత శాతం పెంచుకోవడానికి దోహదపడుతుంది. ముందుగా ధన్వాడ, మరికల్లో విద్యాంజలి పేరుతో ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాం. సాక్షి, మహబూబ్‌నగర్(నారాయణపేట) : పదవీ విరమణ వయస్సుకే కాని పనిచేయాలనే మనస్సుకు కాదు. ఇదే నినాదంతో విద్యాశాఖ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నో సంవత్సరాలుగా విద్యాబోధన చేసి పదవీ విరమణ పొందిన టీచర్లు చాలావరకు ఇంటికే పరిమితం అవుతుంటారు. మరి కొందరు ఇష్టం లేకపోయినా కాలక్షేపం కోసం వివిధ రకాలైన వృత్తులు చేస్తుంటారు. అలాంటి వారి సేవలను తిరిగి సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యాబోధనతో చక్కటి ఫలితాలు సాధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో విద్యాంజలి పేరుతో రూపొందించిన కార్యక్రమం ముందుగా ధన్వాడ, మరికల్ మండలాల్లో ప్రారంభించి అన్ని మండలాలకు విస్తరించాలని భావిస్తున్నారు. రిటైర్డ్ అయినా సేవలో.. ఏళ్ల తరబడి సర్కారు ఉప్పు తిన్నందుకు కనీసం శేష జీవితంలో తాను పనిచేసిన శాఖలో సేవ చేయాలనే తలంపుతో ఉన్న రిటైర్డ్ టీచర్ల వివరాల సేకరణలో జిల్లా విద్యాశాఖ అధికారులు నిమజ్ఞమయ్యారు. కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో ఇటీవల చాలా మంది పదవీ విరమణ పొందారు. వారిలో కొందరు ఉచితంగా బోధన చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ముందుగా ధన్వాడ, మరికల్ మండలాల్లో పైలెట్ ప్రాజె క్టుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆ మేరకు ఆయా మండలాల్లో ప్రస్తుతానికి 30 మందిని గుర్తించగా 22 మంది సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సంఖ్య రాబో యే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంద ని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. సౌకర్యవంతమైన సేవలు.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా విద్యాబోధన చేయడానికి ముందుకు వస్తున్న రిటైర్డ్ టీచర్లకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన సేవలను తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. స్వచ్ఛందంగా వస్తుండటంతో వారు స్థానికంగా నివాసం ఉన్నచోటనే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. గతంలో విద్యాబోధన చేసిన అనుభవం, జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకోవడంతో రాబోయే టెన్త్ ఫలితాల్లో సైతం ఉత్తీర్ణత శాతం పెంరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ప్రయోజనం పొందేది కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో 75 ఉన్నత, 86 యూపీఎస్, 337 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 68,501మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉన్నత పాఠశాలలకు ఉపయోగపడే లెక్షరర్లు, జీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్స్, పండిత్‌లతో విద్యాబోధన చేయిస్తారు. వీరి రాకతో ముఖ్యంగా 6461మంది టెన్త్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా ఎస్జీటీలుగా పదవీ విరమణ పొందిన వారిని ప్రాథమిక పాఠశాలలో వారి సేవలను సద్వినియోగం చేసుకోనున్నారు. -
ఆ రిటైర్డ్ కండక్టర్ది హత్యేనా..?
-
పెన్షన్ కోసం వచ్చి మృత్యువాత
నూనెపల్లె: పెన్షన్ కోసం ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నంద్యాల రైల్వే స్టేషన్లో బుధవారం చోటుచేసుకుందని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ మోడీ రంగ స్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల రైల్వేస్టేషన్లో గ్యాంగ్‌మ్యాన్‌గా డేరంగుల రంగయ్య (67).. ఏడేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. ఆయనకు పెన్షన్ అకౌంట్ నూనెపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో ఉంది. ఇతను సంజామల మండలంలోని అక్కంపల్లెలో కొన్ని రోజులు.. మరికొన్ని రోజులు ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉండేవారు. బుధవారం పెన్షన్ కోసం వచ్చి.. బ్యాంక్ వద్ద నగదు తీసుకోలేక తిరిగి రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై రైల్వేస్టేషన్‌లోని బుకింగ్ కార్యాలయం వద్ద మృత్యువాత పడ్డారు. రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద లభించిన బ్యాంక్‌బుక్ ఆధారంగా గుర్తించామని, రంగయ్య కుమారుడు వీరబ్రహ్మం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నామని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.


