లక్ష్య సేన్‌ రెండో‘సారీ’ | Lakshya Sen becomes runner up in All England Badminton Tournament | Sakshi
Sakshi News home page

లక్ష్య సేన్‌ రెండో‘సారీ’

Mar 9 2026 4:05 AM | Updated on Mar 9 2026 4:05 AM

Lakshya Sen becomes runner up in All England Badminton Tournament

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ రన్నరప్‌గా భారత షట్లర్‌

రెండోసారి తుది పోరులో పరాజయం

బర్మింగ్‌హామ్‌: బ్రిటిష్‌ గడ్డపై విజయగర్జన చేయాలని ఆశించిన భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ రెండోసారి రన్నరప్‌ ట్రోఫీతో సంతృప్తి పడ్డాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 15–21, 20–22తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ లిన్‌ చున్‌ యి (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 

57 నిమిషాలపాటు సాగిన ఈ తుది సమరంలో చైనీస్‌ తైపీ ప్లేయర్‌ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. తద్వారా 127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి చైనీస్‌ తైపీ క్రీడాకారుడిగా లిన్‌ చున్‌ యి ఘనత వహించాడు. విజేతగా నిలిచిన లిన్‌ చున్‌ యికి 1,01,500 డాలర్ల (రూ. 93 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 12,000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ లక్ష్య సేన్‌కు 49,300 డాలర్ల (రూ. 45 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10,200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

లక్ష్య సేన్‌ ఓటమితో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో భారత సింగిల్స్‌ టైటిల్‌ నిరీక్షణ కొనసాగనుంది. 2022లో తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్‌ చేరిన లక్ష్య సేన్‌ డెన్మార్క్‌ స్టార్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. భారత్‌ తరఫున ప్రకాశ్‌ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్‌ (2001లో) ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ గెలవగా... ప్రకాశ్‌ నాథ్‌ (1947లో), ప్రకాశ్‌ పదుకొనే (1981లో), సైనా నెహ్వల్‌ (2015లో) రన్నరప్‌గా నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement