ఇండియా ఓపెన్ వేదికపై డెన్మార్క్ షట్లర్ అసహనం
జోక్యం చేసుకోవాలని బీడబ్ల్యూఎఫ్‌కు ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహణ పట్ల డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్‌ఫీల్డ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ‘ఇలాంటి అనారోగ్యకర వాతావరణంలో, ప్రొఫెషనల్ ప్లేయర్లు పోటీపడే టోర్నీని నిర్వహిస్తారా? ఇండియా ఓపెన్ సూపర్–750 స్థాయి టోర్నీని నిర్వహించే వేదిక ఇంత చెత్తగా ఉంటుందా?’ అని బ్లిచ్‌ఫీల్డ్ నిలదీసింది. ఈ నిర్వాకంపై వెంటనే ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) జోక్యం చేసుకొని ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందే పరిస్థితుల్ని చక్కదిద్దాలని కోరింది. ఢిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో ఈ ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది.
17 ఏళ్ల తర్వాత మనకు దక్కిన ఈ ఆతిథ్య భాగ్యం కోసం కేడీ జాదవ్ స్టేడియాన్ని నవీకరిస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రస్తుత ఇండియా ఓపెన్ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందిరా గాంధీ స్టేడియం దుమ్ము ధూళితో కూరుకుపోయిందని, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే వాతావరణం అక్కడ ఏమాత్రం లేనేలేదని, షట్లర్లు సరిగ్గా వార్మప్ చేసుకునే పరిస్థితి కూడా లేదని డెన్మార్క్ అమ్మాయి తీవ్రస్థాయిలో భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై విరుచుకుపడింది.
గతేడాది ఆమె ఇండియా ఓపెన్‌ను కేడీ జాదవ్ స్టేడియంలో ఆడింది. ఇప్పుడు వేరే వేదికకు మార్చడం పట్ల మెరుగైన స్టేడియం అయి ఉంటుందని ఆశించానని, కానీ దానికంటే మరింత ఘోరంగా ఇందిరాగాంధీ స్టేడియం ఉందని విమర్శించింది. గతేడాది కూడా ఆమె సౌకర్యాలు, వేదికపై ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మెరుగైందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ఏమాత్రం మారలేదు. మెరుగు అనే మాటే లేదు. అప్పుడు ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉంది’ అని బ్లిచ్‌ఫీల్డ్ ‘బాయ్’ అధికారుల తీరుపై మండిపడింది.


