
భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు వరుసగా నాలుగో ఆదివారం అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. అయితే ఈ సారి ఇది మహిళల సమరం. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు కొలంబోలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. బలాబలాలపరంగా చూస్తే పాక్‌కంటే భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. ఇరు జట్ల మధ్య గతంలో 11 వన్డేలు జరగ్గా అన్నీ భారతే గెలిచింది. పాక్ ఒక్క మ్యాచ్‌లోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
భారత్ కనీసం 80 పరుగుల తేడాతో లేదా... 5 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. ఈ సారి కూడా ఫలితం అదే వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నీ తొలి పోరులో శ్రీలంకపై సునాయాస విజయం సాధించగా... పాక్ జట్టు బంగ్లా చేతిలో చిత్తుగా ఓడింది. పురుషుల ఆసియా కప్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయరాదని హర్మన్ సేన నిర్ణయించింది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. మరో వైపు కొలంబోను వర్షాలు వెంటాడుతున్నాయి. ఇదే వేదికపై శనివారం ఆసీస్, శ్రీలంక మధ్య మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.