పలు ప్రాజెక్టులకు సీఎం స్టాలిన్ శ్రీకారం
రూ. వేల కోట్లతో పనులు
జాలర్ల కుటుంబాలకు నెలకురూ.2 వేలు ఆర్థిక సాయం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను డీఎంకే ప్రభుత్వం వేగవంతం చేసింది. గత మూడు రోజులుగా నిర్విరామంగా సాగుతూ వస్తున్న అభివృద్ధి జాతరలో గురువారం మరో వెయ్యికోట్లకు పైగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వివిధ శాఖలకు సంబంధించిన భారీ అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మత్స్య శాఖ, పర్యావరణ, పట్టణాభివృద్ధి, కార్మిక సంక్షేమ శాఖలలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ప్రతిబింబించే విధంగా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
మత్స్య శాఖ పరిధిలో..
రూ. 766 కోట్ల భారీ కేటాయింపుతో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి సీఎం అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రూ. 100.84 కోట్ల వ్యయంతో పూర్తయిన 8 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో రామనాథపురం జిల్లాలో ఏర్పాటు చేసిన బహుళార్ధసాధక సముద్రపు పాచి(సీ వీడ్) పార్క్, కొత్త ఫిషింగ్ పోర్టులు ప్రధానంగా ఉన్నాయి. అలాగే, తూత్తుకుడి, కన్యాకుమారి, తిరునెల్వేలి వంటి జిల్లాల్లో రూ. 665.53 కోట్ల వ్యయంతో 13 కొత్త ప్రాజెక్టులకు శంఖు స్థాపన చేశారు. చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన మత్స్యకారుల కుటుంబాలకు నెలకు రూ. 2,000 ఆర్థిక సాయం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
పర్యావరణం – అటవీ శాఖ..
ప్రకృతి పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చేపట్టింది. నీలగిరి గరిఆడు(తహర్ – అడవి మేక) ప్రాజెక్ట్‌కకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర జంతువైన నీలగిరి గరిఆడును రక్షించడానికి కోయంబత్తూరులో ప్రత్యేక పరిరక్షణ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. టీఎన్ షోర్ పేరిట ప్రపంచ బ్యాంకు సహకారంతో పిచ్చవరంలో రూ. 26.50 కోట్లతో వాడింగ్ బర్డ్ కన్జర్వేషన్ సెంటర్, మరక్కానంలో రూ. 50.30 కోట్లతో అంతర్జాతీయ పక్షుల కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ’ఏనుగుల డాక్టర్’గా పేరుగాంచిన దివంగత డాక్టర్ వైద్యనాథన్ కృష్ణమూర్తికి మరణానంతర ’డాక్టర్ ఎ.జె.డి. జాన్సింగ్ వన్యప్రాణుల సంరక్షణ అవార్డు’, రూ. 25 లక్షల నగదు బహుమతిని కుటుంబ సభ్యులకు సీఎం అందజేశారు.
పట్టణాభివృద్ధి – మాస్టర్ ప్లాన్ 2045
నగరాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుచ్చిలో 804.53 చ.కి.మీ విస్తీర్ణంతో రెండవ సమగ్ర మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు. ఇందులో కొత్త బస్ టెర్మినల్స్, ఔటర్ రింగ్ రోడ్ , బీఆర్‌టీఎస్ సౌకర్యాలు ఉన్నాయి. తూత్తుకుడిలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ 463.62 చ.కి.మీ విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ అమలు లక్ష్యంగా నివేదికను విడుదలచేశారు.. దీని ద్వారా భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రానున్నాయి.
మహిళా వ్యవస్థాపకులు..
సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల శాఖ తరపున తమిళనాడు మహిళా వ్యవస్థాపక అభివృద్ది పథకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈపథకం మేరకు లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తాలను పంపిణీ చేశారు. లక్షల మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించారు. అలాగే, రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ రచనలు సాధారణ తమిళంలో ప్రజాదరణ పొందిన ఎడిషన్‌గా మూడవ దశలో అనువదించి, 73 సంపుటాలుగా ప్రచురించి ఆవిష్కరించారు. మరో 500 పుస్తకాలను విడుదల చేశారు. అలాగే, తమిళ పండితులు వి. అనైముత్తు , కవి ఈరోడ్ తమిళన్బన్, ఇతరుల పుస్తకాలకు రాయల్టీ చెక్కులను అందజేశారు. కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రులు గీతా జీవన్, అనిత ఆర్ రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, గణేషన్, కేఎన్ నెహ్రు, అన్బిల్ మహేశ్, ఎం సుబ్రమణియన్, శేఖర్‌బాబు, స్వామినాధన్, చక్రపాణి, సీఎస్ మురుగానందంతో పాటుగా వివిధ శాఖల కార్యదర్శులు,అధికారులు పాల్గొన్నారు.


