పుత్తూరు: పుత్తూరు మండలం వేపగుంట వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను బస్సు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తాపడగా, బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. చైన్నె నుంచి తిరుపతికి ప్రయాణికులతో వెళుతున్న తమిళనాడు బస్సు ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొంది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తాపడింది. బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ ట్రాక్టర్ డ్రైవర్‌ను పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటరు వరకు వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


