ఎండుమిర్చి ఎగుమతులపై దుష్ప్రచారం | Bad publicity on dried chilli exports | Sakshi
Sakshi News home page

ఎండుమిర్చి ఎగుమతులపై దుష్ప్రచారం

Jul 9 2026 6:06 AM | Updated on Jul 9 2026 6:06 AM

Bad publicity on dried chilli exports

పురుగుమందు అవశేషాలున్నాయని సరుకును తిరస్కరించిన చైనా  

వాణిజ్యపరంగా భారత్‌ను దెబ్బతీసేందుకే చైనా ఎత్తుగడలని అనుమానాలు  

ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో సీసీఎఫ్‌ఐ శ్వేతపత్రం విడుదల  

అంతర్జాతీయంగా కేంద్రం ఒత్తిడి తీసుకురావాలంటున్న నిపుణులు  

సాక్షి, అమరావతి: భారత్‌ నుంచి చైనాకు ఎగుమతి చేసిన ఎండుమిర్చిని చైనా తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పురుగుమందుల అవశేషాలు (ఎంఆర్‌ఎల్‌) పరిమితికి మించి ఉన్నాయని పేర్కొన్న చైనా ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు, ప్రయోగశాల పరీక్ష నివేదికలను ఇప్పటిæవరకు వెల్లడించలేదు. ఇది నిజంగా ఆహారభద్రత కోసమా? లేక భారత ఎగుమతులను అడ్డుకునేందుకు తీసుకున్న వాణిజ్య నిర్ణయమా? అని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  

మిరప ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీదే అగ్రస్థానం  
ఎండుమిర్చి ఎగుమతుల్లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఏటా ఆరులక్షల టన్నుల నుంచి ఎనిమిదిలక్షల టన్నుల మిరప ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. దీన్లో 2 లక్షల టన్నులకుపైగా చైనాకు వెళతాయి. దీంతో మన దేశానికి అతిపెద్ద మిరప మార్కెట్‌గా చైనా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్టాల్లో పండే తేజ రకం మిర్చికి చైనాలో ప్రత్యేక డిమాండ్‌ ఉంది. మనదేశం నుంచి అయ్యే మిరప ఎగుమతుల్లో 40 శాతం మన రాష్ట్రం నుంచే జరుగుతున్నాయి. అలాంటి మిరప ఉత్పత్తుల ఎగుమతులపై ఇటీవల వస్తున్న ఆరోపణలు దేశీయ మిరప మార్కెట్‌ను సంక్షోభానికి గురిచేస్తోంది. ఈ ఏడాది చైనాకు ఎగుమతి అయిన కంటైనర్లలో పురుగుమందు అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయంటూ తిరస్కరణకు గురవడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.  

శాస్త్రీయ ఆధారాలను చైనా బయటపెట్టాలి 
ప్రపంచ ఆహారభద్రత ప్రమాణాలను రూపొందించే కోడెక్స్‌ అలిమెంటారియస్‌ కమిషన్‌.. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) ఆధ్వర్యంలో ఎంఆర్‌ఎల్‌ ప్రమాణాలను నిర్ణయిస్తుంది. డబ్ల్యూహెచ్‌వో పరిధిలోని ఎస్‌పీఎస్‌ (మానవ, జంతు, మొక్కల ఆరోగ్యరక్షణ చర్యలు) ఒప్పందం ప్రకారం ఒక దేశం దిగుమతి సరుకును తిరస్కరిస్తే, అందుకు తగిన పరీక్ష నివేదికలు, శాస్త్రీయ ఆధారాలు, తిరస్కరణకు గల కారణాలను ఎగుమతి చేసిన దేశానికి తప్పనిసరిగా ఇవ్వాలి. 

ఇప్పుడు చైనా అలాంటి వివరాలను బహిర్గతం చేయలేదని క్రాప్‌ కేర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఎఫ్‌ఐ) బుధవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొంది. ఎండుమిర్చిలో ఎసిఫేట్‌ అనే పురుగుమందుకు కోడెక్స్‌ నిర్ణయించిన గరిష్ఠ అవశేష పరిమితి 50 పీపీఎం. ఎసిఫేట్‌ సహజంగా విచి్ఛన్నమవుతున్నప్పుడు మెథామిడోఫాస్‌ అనే ఉప ఉత్పత్తి వెలువడుతుంది. కోడెక్స్‌ నిబంధనల ప్రకారం ఈ రెండింటి కలిపిన మొత్తం అవశేష పరిమాణమే ఎంఆర్‌ఎల్‌గా పరిగణించాలి. 

కానీ చైనా ఈ రెండింటిని కలిపి లెక్కించిందా? లేక మెథామిడోఫాస్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుందా? అనే విషయాన్ని స్పష్టం చేయలేదని సీసీఎఫ్‌ఐ పేర్కొంది. మెథామిడోఫాస్‌ను భారత్‌లో ప్రస్తుతం పురుగుమందుగా వినియోగించడం లేదని, ఇది ఎసిఫేట్‌ విచ్ఛిన్నం వల్ల సహజంగా ఏర్పడే పదార్థం మాత్రమేనని స్పష్టం చేసింది. చైనా గుర్తించిన అవశేషాలపై పూర్తి పరీక్ష నివేదికలను వెల్లడించకుండా సరుకును తిరస్కరించడం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. తిరస్కరణకు బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉంటే వాటిని భారత్‌కు అందించాలని డిమాండ్‌ చేసింది. 

లేకపోతే ఇది సాంకేతిక కారణాల కంటే వాణిజ్య పరిరక్షణ చర్యగా భావించే అవకాశం ఉందని, అవసరమైతే ఈ అంశాన్ని ప్రపంచ వాణిజ్యసంస్థ ఎస్‌పీఎస్‌ కమిటీ ముందు లేవనెత్తే హక్కు భారత్‌కు ఉందని సీసీఎఫ్‌ఐ పేర్కొంది. ఇలాంటి వివాదాలు రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని చైనా నుంచి పూర్తి పరీక్ష నివేదికలు తెప్పించడంతో పాటు ప్రపంచ వాణిజ్యసంస్థ నిబంధనల ప్రకారం దేశ ప్రయోజనాలను పరిరక్షించే చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement