పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కబీర్‌కు వార్నింగ్
కోల్‌కతా: సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోనని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి హెచ్చరించారు. తాను మమతా బెనర్జీలా బలహీన, పిరికి ముఖ్యమంత్రిని కాదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరిపేరును ప్రస్తావించకపోయినా, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) అధ్యక్షుడు, ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను ఉద్దేశించి మాట్లాడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితం హుమాయున్ కబీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సీఎం సువేందు తాజాగా వార్నింగ్ ఇచ్చారు. “మమతా బెనర్జీలా నేను బలహీనమైన లేదా పిరికివాడైన ముఖ్యమంత్రిని కాదు. ప్రజాప్రతినిధులు బాధ్యతారహితంగా మాట్లాడితే సహించను. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మాటలు మాట్లాడాలని స్థానిక ఎమ్మెల్యేకు సూచించాను” అని సువేందు అధికారి అన్నారు. రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించకపోయినా, వచ్చే 30 నుంచి 45 రోజుల్లో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశముందన్నారు.
విభజన రాజకీయాలు వద్దు
రెజీనగర్ ఉప ఎన్నికలో (Rejinagar Bypoll) బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని సువేందు అధికారి హామీ ఇచ్చారు. “ఇక్కడ ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న హిందూ-ముస్లిం రాజకీయాలకు బదులుగా ప్రజల అవసరాలు, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తాం” అని చెప్పారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపైనా సువేందు అధికారి విమర్శలు గుప్పించారు. సీఏఏ-ఎన్‌ఆర్‌సీ, వక్ఫ్ చట్టం వంటి అంశాలపై జరిగిన ఆందోళనల పేరుతో హింస చెలరేగిందని, దాని వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల ముందు ప్రజలను విభజించేలా హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చదవండి: 6 నిమిషాల్లో 43 చెప్పుదెబ్బలు!
నందిగ్రామ్‌లోనూ ఉప ఎన్నిక
రెజీనగర్ స్థానాన్ని కబీర్ ఖాళీ చేయడంతో అక్కడ ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కబీర్ నౌడా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, రెజీనగర్‌తో పాటు నందిగ్రామ్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. సీఎం సువేందు అధికారి నందిగ్రామ్ స్థానాన్ని ఖాళీ చేసి, భవానీపూర్ నియోజకవర్గాన్ని కొనసాగించాలని నిర్ణయించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.


