బడుల్లో పిల్లల ప్లేట్లలో మధ్యాహ్న భోజనంలో (మిడ్‌డే మీల్) గుడ్డు ఇక కనిపించకపోవచ్చు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. ఆ భోజనాల తయారీ బాధ్యతలను ఇస్కాన్ (ISKCON)కు అప్పగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. అలాగే.. గుడ్ల స్థానంలో సోయాబీన్, రాజ్మా, పనీర్ వంటి శాఖాహార పదార్థాలను అందించాలని ప్రతిపాదించింది. దీంతో పిల్లల పోషకాహారం, మతపరమైన భావజాలం, ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
విద్యార్థులకు మరింత నాణ్యమైన, పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో మిడ్‌డే మీల్ బాధ్యతలను ఇస్కాన్‌కు అప్పగిస్తున్నాం. ఇందుకోసం ఒక్కో విద్యార్థిపై ఆహార వ్యయాన్ని రూ.6.50 నుంచి రూ.10కు పెంచుతున్నాం అని స్వయంగా ప్రకటించారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. అయితే.. ఇస్కాన్ ప్రతినిధులు గుడ్లు బంద్ చేస్తామని చెబుతున్నారు. బదులుగా ఇచ్చే సోయాబీన్, రాజ్మా, పనీర్‌లలో కూడా తగిన ప్రోటీన్లు ఉంటాయని, పిల్లలకు అవసరమైన పోషకాలు అందుతాయని చెబుతున్నారు. అటు ప్రతిపక్షాలు, ఇటు పోషకాహార నిపుణులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి, ఆహారపు అలవాట్లను భావజాలం ఆధారంగా మార్చే ప్రయత్నమని విమర్శిస్తున్నాయి.
ఇదేం మొదటిసారి కాదు!
స్కూల్ మెనూలో నుంచి గుడ్లను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2015లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మిడ్‌డే మీల్‌లో గుడ్లను చేర్చేందుకు నిరాకరించింది. 2025లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గుడ్లు, చిరుధాన్యాలతో తయారయ్యే కొన్ని వంటకాలకు ఇచ్చే నిధులను ఉపసంహరించుకుంది.
పోషకాహారమే ప్రధాన ఆందోళన
భారతదేశంలో పేద కుటుంబాలకు చెందిన లక్షలాది మంది పిల్లలకు స్కూల్ మధ్యాహ్న భోజనమే రోజులో అత్యంత పోషకాహారం కలిగిన భోజనం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ మురికివాడల్లో చదివే పిల్లలకు ఇది మరింత కీలకం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) ప్రకారం దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో సుమారు 19 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం (Wasting), 29.3 శాతం మంది ఎదుగుదల లోపం (Stunting)తో బాధపడుతున్నారు.పశ్చిమ బెంగాల్‌లో ఈ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఇలాంటి సమయంలో గుడ్లను తొలగించడం సరైన నిర్ణయమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గుడ్డే ఎందుకు కీలకం?
గుడ్డు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఆహారంగా వైద్య నిపుణులు భావిస్తారు. ఇందులో నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సోయాబీన్, రాజ్మా, పనీర్‌లలో కూడా పోషకాలు ఉన్నప్పటికీ, వాటి ధర, వండేందుకు పట్టే సమయం, పిల్లలు ఇష్టంగా తినే అంశాలు గుడ్డుతో పోలిస్తే భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బెంగాలీల ఆహార సంస్కృతిపైనా చర్చ
బెంగాల్‌లో అత్యధిక మంది ప్రజలు మాంసాహారులు. చేపలు, మాంసం, గుడ్లు అక్కడి ఆహార సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. చేపల విషయంలో బెంగాల్ ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయం అందరికీ తెలిసిందే. అలాంటి రాష్ట్రంలో స్కూల్ మెనూలో గుడ్లను తొలగించడం స్థానిక ఆహారపు అలవాట్లకు కూడా విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయమా?.. పోషకాహారమా?
విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అందించే ఆహారం మతపరమైన లేదా రాజకీయ భావజాలం ఆధారంగా కాకుండా, శాస్త్రీయ పోషకాహార ప్రమాణాల ఆధారంగా ఉండాలి. పేద పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.


