కోల్‌కతా: సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారు. కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొంతున్నారు. గురువారం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని భావిస్తున్నారు. మిథున్ చక్రవర్తిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శుక్రవారం పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో మిథున్ అనారోగ్యం గురించి బయట ప్రపంచానికి తెలిసింది.
''ప్రముఖ సినీ నటుడు, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులలో ఒకరైన మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నేను ఈరోజు ఆయన్ను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లాను. ఆయనతో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను'' అని సువేందు అధికారి ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.
మిథున్‌ను పరామర్శించిన తర్వాత ఆస్పత్రి వెలుపల సీఎం సువేందు మీడియాతోనూ మాట్లాడారు. గురువారం రాత్రి ఆయనకు చిన్న శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించారు. తాను ఆస్పత్రిలో చేరిన విషయం బహిరంగపరచకూడదని మిథున్ అనుకున్నారని చెప్పారు. కాగా, మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆయన అభిమానులు, శ్రేయాభిలాషులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
మిథున్ చక్రవర్తి త్వరగా కోలుకోవాలి: శత్రుఘ్న సిన్హా
పట్నా: మిథున్ చక్రవర్తి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని టీఎంసీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా ఆకాంక్షించారు. పట్నాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. మిథున్ తనకు మంచి మిత్రుడని, ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
చదవండి: ఫడ్నవీస్ ప్రభుత్వంపై మరాఠా ఉద్యమ నేత ఫైర్
''మిథున్ ఆసుపత్రిలో ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం విని చాలా బాధపడ్డాను. మిథున్ చక్రవర్తి నాకు మంచి స్నేహితుడు.. చాలా మంచి కళాకారుడు, గొప్ప స్టార్. ఆయన ఒక అద్భుతమైన మానవతావాది కూడా. ఆయనకు జంతువులంటే చాలా ఇష్టం. తన వద్ద ఉన్న పెంపుడు కుక్కలు, పిల్లులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయనకు ప్రజల పట్ల, ముఖ్యంగా పేదల పట్ల కూడా ప్రగాఢమైన శ్రద్ధ ఉంది. నాకు మిథున్ పట్ల ఎంతో గౌరవం ఉంది. ఆయన నాకు చాలా ప్రియమైన , ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయన్ను పరామర్శించడానికి వెళ్లారు, ఆయన సరైన పనే చేశారు. మిథున్‌కు ప్రజలందరి ప్రేమ, మద్దతు, ఆశీస్సులు దక్కాల''ని శత్రుఘ్న సిన్హా అన్నారు.


