ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీటౌన్‌లో సుపరిచితమైన పేరు. ఇటీవలే ఆమె ఇష్క్‌నామా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షెహనాజ్.. ప్రేమ అంటే ముఖ్యమైన వ్యక్తులకు సమయం, స్వేచ్ఛ ఇవ్వడమేనని అన్నారు. అయితే పెళ్లిళ్లకు తాను దూరంగా ఉండేదాన్ని అని వెల్లడించారు.
ప్రేమ, పెళ్లి సంబంధాలపై తన అభిప్రాయాలను షెహనాజ్ గిల్ వెల్లడించారు. మా కుటుంబంలో పెళ్లి చూపులు చిన్న వయసులోనే చూసేవారని తెలిపింది. అమ్మాయిలకు చాలా చిన్న వయసు నుంచే త్వరలో పెళ్లి అవుతుందని చెప్పేవారని గుర్తు చేసుకుంది. అలా వరుడి కోసం అన్వేషణ చాలా ముందుగానే మొదలవుతుందని పేర్కొంది. మా బంధువుల్లో ఒకరు నాకు పెళ్లి చేయాలని చూసింది.. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదని తెలిపింది.
పెళ్లిళ్లకు వెళ్తే సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నిస్తారని షెహనాజ్ వెల్లడించింది. అందుకే నేను ఎక్కువగా పెళ్లిళ్లకు వెళ్లడం కూడా మానేసేదాన్ని అని తన అనుభవాన్ని పంచుకుంది. ఇప్పుడు నా కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని.. ఇప్పుడు అందరూ నా వెంట పడుతున్నారని నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. షెహనాజ్ గిల్ నటించిన 'ఇష్క్‌నామా' చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదలైంది.


