113 కులాలను తొలగించిన బీజేపీ ప్రభుత్వం
హైకోర్టు ఆదేశాల ప్రకారమేనని వెల్లడి
రెండు బిల్లులను ఆమోదించిన అసెంబ్లీ
నిరసనగా టీఎంసీ రెబెల్ ఎమ్మెల్యేల వాకౌట్
కోల్‌కతా: ఓబీసీ కేటగిరీ రిజర్వేషన్లను 17 శాతం నుంచి 7 శాతానికి తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. గత టీఎంసీ ప్రభుత్వం 2012లో చేసిన చట్టానికి పలు సవరణలతో సువేందు సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం రెండు బిల్లులను సోమవారం ప్రవేశపెట్టింది. బెంగాల్ వెనుకబడిన తరగతుల సవరణ బిల్లు–2026, బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్ బిల్లు–2026లతో 66 కులాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఓబీసీ రిజర్వేషన్ల కోటా 17 శాతం నుంచి 7 శాతానికి తగ్గిపోతుంది. కలకత్తా హైకోర్టు ఆదేశాలను అనుసరించి, ఈ మార్పులను చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ‘గత ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎటువంటి సర్వే చేపట్టకుండా అడ్డగోలుగా చేర్చిన 113 కులాలను జాబితా నుంచి తొలగించాం. వివిధ సర్వేలతో తేలిన అంశాల ఆధారంగా 66 ఉపకులాలను మాత్రం అలాగే ఉంచాం’అని మంత్రి గౌరీశంకర్ ఘోష్ ఈ సందర్భంగా అసెంబ్లీలో తెలిపారు.
చేర్చాల్సిన కులాలేవైనా ఇంకా ఉంటే వెనుకబడిన కులాల కమిషన్ చేసే సిఫారసులను పరిశీలిస్తామన్నారు. బీసీ కమిషన్‌ను పట్టించుకోకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్ విధానాన్ని హైకోర్టు కొట్టివేసిందని మంత్రి గుర్తు చేశారు. అదనంగా 77 కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను కలకత్తా హైకోర్టు 2024లో కొట్టివేసింది. అంతేకాదు, 2010 తర్వాత జారీ అయిన, వీటి ఆధారంగా ఉద్యోగాలు పొందిన 12 లక్షల మంది ఓబీసీ సర్టీఫికెట్లను సైతం రద్దు చేసింది.
సువేందు ప్రభుత్వం మే 19వ తేదీన మతం ఆధారంగా వర్గీకరించిన పథకాల అమలును నిలిపివేసింది. అలాగే, 2010కు ముందు ఓబీసీ రిజర్వేషన్ల జాబితాలో ఉన్న 66 సామాజిక వర్గాలను క్రమబద్ధీకరించి, వారికి దక్కాల్సిన 7 శాతం కోటా అర్హతను పునరుద్ధరించింది. అసెంబ్లీలో ఈ బిల్లులకు అనుకూలంగా 186 మంది ఎమ్మెల్యేలు, 17 మంది వ్యతిరేకంగా ఓటేయగా, ఆరుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. మమత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనగా బిల్లులను వ్యతిరేకిస్తూ రితబ్రత బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ రెబెల్ వర్గం వాకౌట్ చేసింది.
2న కేబినెట్ ముందుకు యూసీసీ ముసాయిదా
ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) ముసాయిదాను జూలై 2వ తేదీన కేబినెట్ పరిశీలిస్తుందని సీఎం సువేందు అధికారి సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. యూసీసీ బిల్లును రూపొందించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి రంజన ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాల్లో మతంతో సంబంధం లేకుండా రాష్ట్ర పౌరులందరికీ ఒకే విధమైన నిబంధనలు అమల్లోకి తేవడమే యూసీసీ లక్ష్యం.


