రెండేళ్ల నిరీక్షణ.. సీఎం హామీతో తల్లి కన్నీళ్లు | RG Kar Case, Bengal CMs Assures Justice In Assembly Leaves RG Kar Victims Mother In Tears Viral, More Details Inside | Sakshi
Sakshi News home page

రెండేళ్ల నిరీక్షణ.. సీఎం హామీతో తల్లి కన్నీళ్లు

Jun 24 2026 7:54 AM | Updated on Jun 24 2026 10:30 AM

Bengal CMs Assurance Leaves RG Kar Victims Mother in Tears Viral

యువ డాక్టర్‌ హత్యాచార కేసు దేశాన్ని కుదిపేసింది. రెండేళ్లు గడిచినా.. బాధితురాలి కుటుంబం న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో న్యాయం జరుగుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని విన్న బాధితురాలి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. “అధికారం కోసం కాదు.. నా కూతురికి న్యాయం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో హృదయాలను కదిలించాయి.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి Suvendu Adhikari మాట్లాడుతూ.. సంచలనం సృష్టించిన ఆర్జీ కర్‌ (RG Kar) మెడికల్‌ కాలేజ్‌ వైద్యురాలి కేసు గురించి మాట్లాడారు..

“ఆర్జీ కర్‌ కేసులో తప్పకుండా న్యాయం జరుగుతుంది. బెంగాల్‌ ప్రజలు అభయకు(బాధితురాలికి పెట్టిన పేరు) న్యాయం జరగాలని ఓటు వేశారు” అని సీఎం ప్రకటించారు.

ఈ మాటలు విన్న వెంటనే బాధితురాలి తల్లి..  పానిహటి ఎమ్మెల్యే రత్నా దేవనాథ్‌ (Ratna Debnath) భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో తోటి ఎమ్మెల్యేలు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

నా కూతురి కోసమే.. 
ఆర్జీ కర్‌ కేసులో న్యాయం కోసం వీధుల నుంచి న్యాయస్థానాల వరకు పోరాడిన రత్నా దేవనాథ్‌.. చివరకు రాజకీయాలనే మరో వేదికగా ఎంచుకున్నారు. 2026 పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహటి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మహిళల భద్రత, తన కుమార్తెకు న్యాయం అనే అంశాలనే ప్రధాన అజెండాగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. 

ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్‌ ఘోష్‌పై 28,836 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రత్నా దేవనాథ్‌కు 87,977 ఓట్లు రాగా, ప్రత్యర్థి అభ్యర్థికి 59,141 ఓట్లు లభించాయి. రాజకీయాల్లోకి రావడంపై ఆమె అప్పట్లో స్పందిస్తూ.. “వ్యవస్థలో ఉండి పోరాడితేనే నా కూతురికి న్యాయం సాధించగలనని భావించాను” అని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి న్యాయం జరుగుతుందని ప్రకటించగానే, రెండేళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటపడింది.

ఆనాడు ఘోరంగా..
2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజ్‌& హాస్పిటల్‌లో.. విధుల్లో ఉన్న 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌ మృతదేహం ఆసుపత్రి ప్రాంగణంలో లభించింది. దర్యాప్తులో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య వర్గాల్లో, మహిళా సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. జస్టిస్‌ ఫర్‌ అభయ పేరిట వైద్య సిబ్బంది అంతా ఉద్యమంలో పాల్గొన్నారు. బాధితురాలి అసలు పేరును వెల్లడించకుండా నిరసనకారులు ఆమెను ‘అభయ’ (నిర్భయ, భయంలేని) అనే ప్రతీకాత్మక పేరుతో సంబోధించారు.

కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?
ఈ కేసులో కోల్‌కతా పోలీసులకు చెందిన సివిక్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ ప్రధాన నిందితుడిగా దోషిగా తేలాడు. అతడికి జీవిత ఖైదు విధించారు. అయితే ఈ ఘటన వెనుక మరింత పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పవర్‌ఫుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వ్యక్తులు ఇందులో భాగమయ్యారని, అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బెంగాల్‌ పోలీసులు విఫలమయ్యారన్న విమర్శల నేపథ్యంలో.. కేసును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతూనే వస్తోంది.

ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు
తాజాగా ఆర్జీకర్‌ కేసు స్టేటస్‌ను సీఎం సువేందు అధికారి అసెంబ్లీలో తెలియజేశారు. కేసు దర్యాప్తులో లోపాల కారణంగా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. అలాగే ఘటన సమయంలో ఆసుపత్రి ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్‌ ఘోష్‌(Sandip Ghosh) ను కూడా తొలగించినట్లు చెప్పారు. “ఈ కేసులో ఏదీ దాచిపెట్టం. పూర్తి నిజం బయటకు తీసుకొస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.

ఉపేక్షించేది లేదు
ఆర్జీ కర్‌ కేసుతో పాటు హన్స్‌ఖాలి, కామ్‌దుని, కస్బా లా కాలేజ్‌, రాంపూర్‌హాట్‌ వంటి పలు అత్యాచార, మహిళలపై దాడుల కేసులను ప్రస్తావించిన సీఎం.. తమ ప్రభుత్వం మహిళలపై నేరాల విషయంలో ‘జీరో టాలరెన్స్‌’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement