ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో శనివారం అడవి ఏనుగులు వేర్వేరు ఘటనల్లో ఇద్దరిపై దాడి చేసి చంపాయి. ఈ వారంలో ఆ రాష్ట్రంలో ఏనుగుల దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఈ దాడులు ధరంజైగఢ్ డివిజన్ పరిధిలోని ఛాల్, కపు అటవీ ప్రాంతాల్లో తెల్లవారుజామున జరిగాయని అధికారులు చెప్పారు. కపు అటవీ ప్రాంత పరిధిలోని తల్గావ్ గ్రామంలోకి ఓ అడవి ఏనుగు రావడంతో భయాందోళన నెలకొంది. ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చిన శకుంతల బాయి (37)పై ఏనుగు దాడి చేసి చంపిందని ధరంజైగఢ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జితేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు.
మృతురాలి చిన్న కుమార్తె తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిందని ఆయన చెప్పారు. మరో ఘటనలో ఛాల్ అటవీ ప్రాంత పరిధిలోని ఔరనారా గ్రామానికి చెందిన కూలీ బంధన్ సింగ్ అగారియా (50) తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇంటి బయటకు వెళ్లగా అడవి ఏనుగు దాడి చేసి చంపిందని ఉపాధ్యాయ్ తెలిపారు.
గ్రామస్థుల సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ, పోలీసు సిబ్బంది రెండు ఘటనల ప్రాంతాలకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించినట్టు ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ.25,000 ఆర్థిక సాయం ఇచ్చారు. మిగిలిన రూ.5.75 లక్షల పరిహారాన్ని అన్ని ప్రక్రియలు పూర్తైన తర్వాత విడుదల చేస్తామని అధికారి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో పదేళ్లకు పైగా ఏనుగుల సమస్యగా కొనసాగుతోంది. ఇటీవల మధ్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించింది. కోర్బా జిల్లా, సమీపంలోని రాయ్‌గఢ్ జిల్లా ధరంజైగఢ్ ప్రాంతం తీవ్ర ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. వీటితో పాటు సుర్గుజా, సూరజ్‌పూర్, జష్‌పూర్, బల్రాంపూర్ జిల్లాల్లో ఏనుగులు తరచూ గ్రామాలు, వ్యవసాయ పొలాల్లోకి రావడంతో ప్రాణనష్టం, పంట నష్టం జరుగుతోంది.
జులై 9న కోర్బా జిల్లాలో అడవిలో పుట్టగొడుగులు ఏరుతున్న 55 ఏళ్ల వ్యక్తిని ఏనుగు తొక్కి చంపింది. గత నెలలో అదే జిల్లాలో 40 ఏళ్ల పశువుల కాపరి, 70 ఏళ్ల మహిళ కూడా ఇలాంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, గత ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగుల దాడుల్లో 330 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.


