సాక్షి, హైదరాబాద్: ‘మా బిడ్డను వాడు (రాజ్‌కుమార్) వేధిస్తున్నాడని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోలీసు స్టేషన్‌కు వెళ్లాం. చట్టం మమ్మల్ని కాపాడుతుందని నమ్మాం. కానీ.. కేసు నమోదైన తర్వాత వాడు బయట ఏం చేస్తున్నాడో, ఎలాంటి కక్ష పెంచుకున్నాడో చూసే నాథుడే కరువయ్యాడు. చివరకు మా నమ్మకమే మాకు శ్మశానమైంది’.. ఇది షాబాద్‌లో మానవ మృగం జరిపిన నరమేధంలో సర్వస్వం కోల్పోయిన ఓ కుటుంబం హృదయ విదారక రోదన. ఇలా పోక్సో కేసుల చుట్టూ ఉన్న చేదు నిజాలు ఎన్నో. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టడానికి తీసుకొచ్చిన చట్టం కాగితాలపైనే కఠినం. క్షేత్ర స్థాయిలో కేసు నమోదైన తర్వాత నిందితుల కదలికలపై పోలీసుల నిఘా లేకపోవడం పెను శాపంగా మారుతోంది. కేసు పెట్టారనే కక్షతో నిందితులు మరింత రెచ్చిపోతున్నారు. బాధితుల ఇళ్లకు వచ్చి దాడులకు, చివరకు హత్యలకూ తెగబడుతున్నారు.
గాలికొదిలేస్తున్నారు..
సాధారణంగా పోక్సో కేసు నమోదు కాగానే నిందితుడిని అరెస్ట్ చేయడం లేదా అతనిపై పక్కా నిఘా పెట్టడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. ఆచరణలో అలా జరగడం లేదు. షాబాద్ ఉదంతంలో నిందితుడు రాజ్ కుమార్‌పై మే నెలలో పోక్సో కేసు నమోదైంది. ఆ తర్వాత అతని కదలికలపై పోలీసులు పట్టించుకోకపోవడం, కక్షతో రగిలిపోతున్నా గమనించకపోవడంతో ఆరుగురిని హతమార్చాడు. కేసు నమోదైన తర్వాత బయటే తిరుగుతూ బాధితుల కుటుంబాలను కేసు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. పోలీసుల నిఘా లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఊర్లు వదిలి వెళ్లిపోవాల్సిన దుస్థితి. పోక్సో కేసుల్లో నిందితుడు బెయిల్‌పై వచి్చనా లేదా అరెస్ట్ కాకుండా బయట తిరుగుతున్నా స్థానిక పోలీసులు నిరంతరం వారిపై నిఘా ఉంచాలి. స్టేషన్లలో సిబ్బంది కొరత, ఇతర కేసుల ఒత్తిడి నెపంతో నిందితులను గాలికొదిలేస్తున్నారు.
ఇరుగుపొరుగు వారే..
చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించిన పోక్సో కేసులు ఏటా పెరిగిపోతున్నాయి. గతేడాది మూడు కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 1,672 కేసులు నమోదయ్యాయి. 75–80 శాతం కేసుల్లో చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నది బయటి వ్యక్తులు కాదు, వారికి బాగా తెలిసిన బంధువులు, స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారే కావడం గమనార్హం. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల కేసుల్లో ఎలాగైతే బాధితులను షెల్టర్ హోమ్స్, రిహాబిలిటేషన్‌కు తరలించి, చికిత్స అందిస్తారో అదే తరహాలో లైంగిక వేధింపుల నిందితులను కూడా వారి మానసిక ప్రవర్తన మెరుగయ్యే వరకూ క్రమం తప్పకుండా కౌన్సెలింగ్, చికిత్సలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అటకెక్కిన ‘సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ’
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే కామాంధులపై ఉక్కుపాదం మోపేందుకు మూడేళ్ల క్రితం అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ స్టీఫెన్ రవీంద్ర ‘సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ’ ఏర్పాటుకు ప్రణాళిక చేశారు. ప్రభుత్వ అనుమతికి కోసం ప్రతిపాదించారు. ఇది ప్రతిపాదనల దశకే పరిమితమైంది.


