ఎన్నికల నిర్వహణపై డ్యాన్సర్ల గొడవ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణపై డ్యాన్సర్ల గొడవ

Jul 13 2026 8:15 AM | Updated on Jul 13 2026 8:15 AM

ఎన్నికల నిర్వహణపై డ్యాన్సర్ల గొడవ చేపల కోసం వెళ్లి.. ఇద్దరి మృత్యువాత 16న పెద్దేముల్‌కు మంత్రుల రాక వెంచర్‌ ప్రహరీ కూలి విద్యార్థి దుర్మరణం

గచ్చిబౌలి: తెలుగు ఫిలిం డ్యాన్సర్స్‌, డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌లో ఎన్నికల నిర్వహణపై వివాదం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం రాయదుర్గంలోని కార్యాలయంలో రెండు వర్గాలుగా విడిపోయిన డ్యాన్సర్లు గొడవకు దిగారు. ఒక వర్గం ఎన్నికలు నిర్వహించాలని పిలుపు ఇవ్వడంతో కార్మిక శాఖ అధికారి అసోసియేషన్‌ కార్యాలయానికి వచ్చారు. సభ్యుల అనుమతి లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నారని మరో వర్గానికి చెందిన డ్యాన్సర్లు గొడవకు దిగారు. ఎన్నికలు నిర్వహించాలని శేఖర్‌ మాస్టర్‌ వర్గం పట్టుబడుతుండగా, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని జానీ మాస్టర్‌ వర్గం గొడవ పడినట్లు పోలీసులు తెలిపారు. గొడవ జరగడంతో అక్కడున్న వారు డయల్‌ 100కు కాల్‌ చేశారు. ఒక వర్గం సభ్యులు ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలని రాయదుర్గం పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. గొడవ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, మెజార్టీ సభ్యుల నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో మెజార్టీ సభ్యులు ఎన్నికల నిర్వహణకు మద్దతు తెలిపినట్లుగా తెలిసింది. డ్యాన్సర్ల మధ్య జరిగిన గొడవపై ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

– ఫరూఖ్‌నగర్‌లో అలుముకున్న విషాదఛాయలు

షాద్‌నగర్‌రూరల్‌: చేపల కోసం వెళ్లిన బావ, బావమరిది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఫరూఖ్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని ఫరూఖ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌జిలానీ(40), ముజాహిద్‌(36) బావ బావమరుదులు. వీరు ఆటో డ్రైవర్‌లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అప్పుడప్పుడు దేవరకద్రకు వెళ్లి చేపలను పట్టుకొని షాద్‌నగర్‌కు వచ్చి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మహ్మద్‌జిలానీ, ముజాహిద్‌ మహబూబ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ అజహరోద్దీన్‌తో కలిసి ఆటోలో దేవరకద్రకు చేపలకోసం వెళ్లి సాయంత్రం తిరిగి ప్రయాణమయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం బండమీదిపల్లి సమీపంలోని ఆర్టీఓ కార్యాలయం వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కంటైనర్‌ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహ్మద్‌జిలానీ, ముజాహిద్‌లకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌అజహరోద్దీన్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తాండూరు రూరల్‌: హ్యామ్‌ నమూనా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దేముల్‌ మండలానికి రూ.185 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 16న రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై ఈ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్‌ మండల పరిధిలోని సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

మోమిన్‌పేట: వెంచర్‌ ప్రహారీ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మోమిన్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ భరత్‌భూషన్‌ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన అరిగె నాగయ్య, భాగ్యమ్మ దంపతులు చంద్రశేఖర్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడో తరగతి చదువుతున్న కుమారుడు దుర్గాప్రసాద్‌(8) ఉన్నాడు. స్నేహితులతో కలసి సమీపంలోని వెంచర్‌ వద్ద ఆడుకుంటున్న క్రమంలో వెంచర్‌ ప్రహరీ ఒక్కసారిగా కూలడంతో దుర్గాప్రసాద్‌ శిథిలాల కింద పడిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ అంజయ్య సీఐ వెంకట్‌తో కలిసి ఘటనా స్థలిని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు.

మహ్మద్‌జిలానీ (ఫైల్‌)

ముజాహిద్‌ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement