అబ్దుల్లాపూర్‌మెట్: మండలంలోని బాటసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ధన ఆంజనేయులు 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియనన్‌షిప్–2026 పోటీలకు ఎంపికయ్యాడు. పురుషులు, మహిళలు, సబ్ జూనియర్ 16 సంవత్సరాల లోపు బాలుర విభాగం 100 మీటర్ల పరుగు పందెంకు ఎంపిక కావడం బాటసింగారం గ్రామానికి గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్ తెలిపారు. జూన్ 20న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచి ఆంజనేయులు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. గ్రామ సర్పంచ్ ఎర్రవెళ్లి గౌరీశంకర్‌చారి, ఉపసర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు, శారీరక విద్యా ఉపాధ్యాయుడు స్వాములు, క్రీడాభిమానులు విద్యార్థిని అభినందించారు.
అనంతగిరి: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డైట్ కళాశాలల్లో బోధించేందుకు ఇన్‌సర్వీస్ టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సి పాల్ అబ్దుల్ ఘని ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్, ఫిజికల్ ఎడ్యూకేషన్, ఎడ్యూకేషనల్ టెక్నాలజీ, ఇంగ్లిష్, సైకాలజీ, తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల బోధనకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో, గణితం, ఫిలాసఫీ, సోషియాలజీ, సైన్స్, సాంఘిక శాస్త్రం, ఉర్దూ సబ్జెక్టుల బోధనకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమంలో బోధించేవారు ఈ నెల 14వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


