క్షణకాలపు అజాగ్రత్త.. జీవితమంతా ఆవేదన | Don’t leave children in idling vehicles | Sakshi
Sakshi News home page

క్షణకాలపు అజాగ్రత్త.. జీవితమంతా ఆవేదన

Jul 13 2026 7:58 AM | Updated on Jul 13 2026 7:58 AM

Don’t leave children in idling vehicles

సాక్షి, హైదరాబాద్‌: ద్విచక్ర వాహనాన్ని ఆపిన తర్వాత ఇంజిన్‌ ఆన్‌లో ఉండగా చిన్నారులను దానిపై వదిలేయడం పెను ప్రమాదాలకు దారి తీస్తుందని నగర కొత్వాల్‌ వీసీ సజ్జనర్‌ పేర్కొన్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఓ సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేసిన ఆయన ’క్షణకాలపు అజాగ్రత్తతో జీవితకాలపు ఆవేదన ఎదుర్కొవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. 

ఇంజిన్‌ ఆన్‌లో ఉన్న ద్విచక్ర వాహనంపై పిల్లలను వదిలేయడం లేదా వారు పక్కనే ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఆ వీడియో చూస్తే అర్థమవుతుందని తెలిపారు. ‘సాధారణంగా చిన్నారులకు బైక్‌ ఎక్కడం ఓ సరదా. యాక్సిలరేటర్‌ తిప్పడం సంబరం. కానీ.. వాహనం స్టార్ట్‌ చేసి ఉన్నప్పుడు వారు తెలియక చేసే ఆ చిన్న పొరపాటే క్షణాల్లో ఊహించని ప్రమాదంగా మారి ప్రాణాల మీదికి తెస్తుంది’ అని కొత్వాల్‌ హెచ్చరించారు. కళ్లముందే నిమిషం వ్యవధిలో జరిగిపోయే ఇలాంటి దారుణాలను అడ్డుకోవాల్సింది తల్లిదండ్రులేనని స్పష్టం చేశారు.

 దీనికి సంబంధించి కొన్ని కనీస జాగ్రత్తల్ని ఆయన సూచించారు. వాహనం ఆపిన వెంటనే ఇంజిన్‌ ఆఫ్‌ చేసి, ఇగ్నేషియం ‘కీ’ తీసేయడం ప్రాథమిక నియమంగా పెట్టుకోవాలి. ఇంజిన్‌ ఆన్‌లో ఉన్న టూవీలర్‌పై చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా కూర్చోబెట్టకూడదు. ముఖ్యంగా పిల్లల చేతులు యాక్సిలరేటర్‌కు అందేలా వాహనాల ముందు భాగంలో నిలబెట్టడం అత్యంత ప్రమాదకరం. చిన్న నిర్లక్ష్యంతో కుటుంబానికి విషాదం కాకూడదు. సురక్షిత ప్రయాణం బాధ్యతాయుత ప్రవర్తనతోనే సాధ్యమవుతుందని గుర్తిస్తూ అందరూ ట్రాఫిక్‌ నియమాలను, భద్రతా ప్రమాణాలను పాటించాలని సజ్జనర్‌ సూచించారు.   

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement