సాగునీటి ప్రాజెక్టులపై ప్రధాన చర్చ
ఎజెండాపై సీఎంతో ఆదివారం ఉత్తమ్, భట్టి భేటీ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని పలు కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేవంత్‌తో ఆదివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై ప్రాజెక్టుల అంచనా పెంపుతోపాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇతర కీలక అంశాలపై చర్చించినట్టు తెలిసింది.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్యాకేజీలు–7, 11, 15, 17ల అంచనాల పెంపు, జె.చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు అంచనాలు తుదిసారిగా పెంపు, గట్టు రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలపై గతంలో ఆర్థిక శాఖ కొర్రీలు వేయడంతో రాష్ట్ర మంత్రివర్గ ఆమోదానికి నోచుకోవడం లేదు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను సందర్శించి ఇచ్చిన హామీల అమలులో సైతం పురోగతి లేకుండా పోయింది. చివరిసారిగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో తదుపరి మంత్రివర్గ సమావేశంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలపైనే తొలుత చర్చిద్దామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
ఆదివారం సీఎం సమక్షంలో ప్రాజెక్టుల అంచనాల పెంపు ప్రతిపాదనలపై మంత్రులు ఉత్తమ్, భట్టి విక్రమార్క చర్చించినట్టు తెలిసింది. ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ అభ్యంతరాలకు నీటిపారుదల శాఖ నుంచి సమగ్ర వివరణ కోరినట్టు సమాచారం. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోయడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పేకొట్టే అంశంపై సైతం చర్చించినట్టు తెలిసింది.
నేడు దేవాదులకు మంత్రుల బృందం
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి దేవాదుల, సీతమ్మసాగర్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. తొలుత హెలికాప్టర్ ద్వారా దేవాదుల ప్రాజెక్టు ఆఫ్‌టేక్ పాయింట్‌కు చేరుకొని గోదావరి జలాల తరలింపును పరిశీలించనున్నారు. ప్రాజెక్టుపై అక్కడే సమీక్షిస్తారు. అనంతరం సీతారామ సాగర్ ప్రాజెక్టు ఆఫ్‌టేక్ పాయింట్‌కు చేరుకొని ప్రాజెక్టుపై అక్కడే సమీక్షించిన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.


