మంత్రి తుమ్మల ఆరా.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
వరంగల్ రీజియన్ పరిధిలోని మార్కెట్ యార్డుల్లో భారీగా అక్రమాలు
చక్రం తిప్పుతున్న అధికారులపై అవినీతి ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: మార్కెటింగ్ శాఖను అవినీతి, అక్రమాలు కుదిపేస్తున్నాయి. వరుస వివాదాల నేపథ్యంలో ఈ శాఖను గాడిన పెట్టేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. పత్తి కొనుగోళ్లు మొదలు మార్కెట్ యార్డుల్లో పోస్టింగ్‌ల వరకు అన్ని స్థాయిల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ వివిధ జిల్లాల మార్కెట్ కమిటీల చైర్మన్లు, కొందరు అధికారుల ద్వారా మంత్రి దృష్టికి వెళ్లాయి. ఇటీవల శాఖ డైరెక్టర్ బదిలీ కాగా, మరో అధికారి వ్యవహారశైలిపైనే ఎక్కు వగా ఫిర్యాదులు వచ్చినట్టు సమా చారం. ఈ నేపథ్యంలోనే అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించినట్టు తెలిసింది.
పత్తి కొనుగోళ్లలోనే భారీగా అక్రమాలు
సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేసే క్రమంలో మార్కెటింగ్ శాఖనే కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ శాఖ ఆమోదిస్తేనే సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుంది. ఒక రైతు నుంచి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తుంది. కౌలుదారుల నుంచి టెంపరరీ రిజి్రస్టేషన్ (టీఆర్) పేరుతో పత్తిని కొనుగోలు చేస్తారు. దీనిని ఆసరాగా తీసుకొని వేల క్వింటాళ్ల పత్తిని బినామీ టీఆర్‌లు సృష్టించి జిన్నింగ్ మిల్లుల యజమానుల నుంచే సీసీఐ కొనుగోలు చేసినట్టుగా చూపించి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది.
ఈ క్రమంలోనే 2024లో ఏడుగురు కార్యదర్శులను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, 2025లో కూడా పలువురిపై ఫిర్యాదులు వచ్చినా, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దీంతో శాఖాపరంగా అంతర్గత వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని బయటకు రానీయకుండా మార్కెటింగ్ శాఖలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఓ అధికారి చక్రం తిప్పుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై మంత్రి తుమ్మల విచారణకు ఆదేశించినట్టు సమాచారం. కార్యదర్శులపై వచ్చిన ఫిర్యాదులపై ఆరా
» వరంగల్ జిల్లా జనగామ మార్కెట్ యార్డులో జరిగిన అవకతవకలపై చైర్మన్ బానుక శివరాజు చేసిన ఫిర్యాదులపై కూడా విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. 2024–25 సీజన్‌లో సీసీఐ పత్తి కొనుగోళ్లలో టీఆర్ పేరుతో సుమారు రూ.1.50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని, తిరిగి 2025–26 సీజన్‌లో కేంద్రం తీసుకొచి్చన యాప్‌ను వాడుకొని ‘ఓటీపీ’ల పేరుతో మరో రూ.1.50 కోట్ల అక్రమాలు చేశారని ఫిర్యాదు చేశారు.
» జనగామ మార్కెట్‌లో గిడ్డంగి అద్దె రూపంలో వచ్చిన రూ.10.45 లక్షల్లో రూ.9.98 లక్షలను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించినట్టు విచారణలో తేలిందని, ఓం సాయి సెక్యూరిటీ ఫోర్స్ పేరుతో రూ.9.87 లక్షల చెల్లింపులు జరిపి, అందులో భద్రతా సేవలకు సంబంధం లేని ఖర్చులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
» పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీలో 2020–21లో రూ.98.87 లక్షలు, 2022–23లో రూ.56.97 లక్షల నిధుల వినియోగంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2023–24లో రూ.37.70 లక్షలు ఉపసంహరించగా, అందులో రూ.22.63 లక్షలు మాత్రమే ప్రధాన కార్యాలయానికి జమ చేసి, మిగిలిన రూ.15.07 లక్షలు సొంత అవసరాలకు వినియోగించారనే ఆరోపణలున్నాయి.
» 2014–15లో వరంగల్‌లో జరిగిన సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అందుకు కారణమైన అధికారిని అందలం ఎక్కించారని ఇటీవల ఓ అధికారి మంత్రికి ఫిర్యాదు చేశారు. కేవలం నలుగురు రైతుల పేరిట ఏకంగా రూ. 2.93 కోట్ల విలువైన 7,245 క్వింటాళ్ల పత్తిని అప్పట్లో సీసీఐకి విక్రయించిన విషయాన్ని సీసీఐ గుర్తించి సంబంధిత అధికారిపై చర్యలకు 2017 నుంచి పలుమార్లు సిఫారసు చేసినా, మార్కెటింగ్ శాఖ పట్టించుకోలేదని రుజువులతో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆ అధికారిని కాపాడుతూ 2024లో హైదరాబాద్‌కు బదిలీ చేసి, ఇప్పుడు తిరిగి మళ్లీ వరంగల్‌కు పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
» మునుగోడు నియోజకవర్గంలోని ఓ మార్కెట్‌లో కార్యదర్శిని తొలగించాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఏకంగా మంత్రి తుమ్మలకు లేఖ రాస్తే, మంత్రి ఆదేశాలతో అతన్ని తొలుత వరంగల్ జేడీఎం కార్యాలయానికి బదిలీ చేసిన అధికారులు, తిరిగి అక్కడి నుంచి నల్లగొండ డీఎం కార్యాలయానికి బదిలీ చేశారు. తర్వాత నల్లగొండ నుంచి వరంగల్‌కు పంపి, అక్కడి నుంచి గత జూన్‌లో ఏకంగా హైదరాబాద్‌లోని ఓ ప్రధాన మార్కెట్‌కు బదిలీ చేశారు. ఈ వ్యవహారం వెనుక ఏం జరిగిందనే దానిపై కూడా విచారణకు ఆదేశించినట్టు సమాచారం.


