హామీలు, వైఫల్యాలపై ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం
సోషల్ మీడియా గొంతు పిసుకుతున్న చంద్రబాబు సర్కారు
నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ఒక ఆయుధం
ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే ఒక నేరం
చంద్రబాబు రెండు నాల్కల ధోరణిపై సర్వత్రా ఆగ్రహం
రెండేళ్లలో 2 వేల కేసులు.. 15 వేలకుపైగా లింకుల తొలగింపు
సుప్రీంకోర్టు, హైకోర్టు మొట్టికాయలు వేసినా మారని వైఖరి
విమర్శకులను అణచి వేసేందుకు కొత్తగా నిఘా యంత్రాంగం
వైఎస్సార్‌సీపీ అధికారిక ఇన్‌స్టా ఖాతా తొలగింపు.. ఫేస్‌బుక్ పేజీ బ్లాక్
ప్రతిపక్ష నేతలను వెంటాడి వేధించడమే లక్ష్యంగా అడుగులు
సాక్షి, అమరావతి: తాను ప్రతిపక్షంలో ఉంటే సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి గొంతుక. అధికారంలోకి వచ్చాక అదే సోషల్ మీడియా ఒక ముప్పు. ఇదీ చంద్రబాబు నైజం. 2024 ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై వేల మంది సోషల్ మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ ఛానళ్లు, ఇన్ఫ్లుయెన్సర్ల సైన్యంతో విష ప్రచారం చేయిస్తూ యుద్ధం నడిపిన టీడీపీ, జనసేన కూటమి.. ఇప్పుడు తమను ప్రశ్నించే ప్రతి గొంతుపైనా ఉక్కుపాదం మోపుతోంది. కేసులు, అర్ధరాత్రి అరెస్టులు, నిర్బంధాలు, ఖాతాల ఫ్రీజ్‌లు, చివరికి ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టం దాకా అణచివేత పరంపర కొనసాగిస్తోంది.
సోషల్ మీడియా గొంతు పిసికేందుకు ఏకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసే వరకూ వెళ్లింది. తన వైఫల్యాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను చంద్రబాబు భరించలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా కనిపించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయె న్సర్లు.. ఇప్పుడు చంద్రబాబుకు నేరగాళ్లుగా కనిపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా నోరెత్తే వారిని జైలుకు పంపుతామని స్వయంగా ఆయనే బెదిరించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది.
జిల్లాకొక నిఘా విభాగంతో వేట
సోషల్ మీడియా ద్వారా తమను విమర్శిస్తున్న, ప్రశ్నిస్తున్న వారిని గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సైబర్ గార్డ్ విభాగాలు, జిల్లా స్థాయి సోషల్ మీడియా పర్యవేక్షణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి గత రెండేళ్లలోనే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారితోపాటు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఏకంగా 2వేల వరకూ కేసులు నమోదు చేశారు.
సాక్ష్య పోర్టల్ ద్వారా తమకు అనుకూలంగా లేవంటూ 15 వేల వెబ్ లింకులను తొలగించారు. సగటున రోజుకు రెండు కేసులు పెడుతున్నారు. 20 లింకులను తొలగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారి అభిప్రాయాలపై ఇంత భారీగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాజాగా పోలీసు యంత్రాంగం మొత్తాన్ని విమర్శకుల వేటకు వాడుతుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
రెండేళ్లలో ఎన్నెన్నో అరాచకాలు
ఈ రెండేళ్లలో ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎలా విరుచుకుపడ్డారో చూస్తే ప్రభుత్వ కక్షసాధింపు తీరు అర్థమవుతుంది. యూరియా కొరతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోస్టు పెట్టాడనే కారణంతో సాయి భార్గవ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును ఏకంగా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక సోషల్ మీడియా పోస్టుకు సీఐడీ రంగంలోకి దిగడం విశేషం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే కారణంతో బొసా రమణ అనే యాక్టివిస్టును వేధించి అరెస్టు చేశారు. ఈ అరెస్టు వ్యవహారంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
రమణ కోసం భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వచ్చింది. తమను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతుండడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన అవుతు శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేయగా, ఆయనకు కింది కోర్టు విధించిన రిమాండ్ చట్టవిరుద్ధమని హైకోర్టు కొట్టేసింది. ఏకంగా పొరుగు రాష్ట్రం తెలంగాణలోకి వెళ్లి సోషల్ మీడియా యాక్టివిస్టు కేవీఆర్‌ను అర్ధరాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అడ్డుకోబోయిన ఆయన భార్యను పోలీసులు బలవంతంగా నెట్టేసిన దృశ్యాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. యూట్యూబర్ రావణ్‌పై ఏకంగా ఉపా ప్రయోగం కలకలం రేపింది.
నాడు టీడీపీ కోసం వేల మంది.. సోషల్ మీడియా వారియర్లు
2024 ఎన్నికల ముందు ఇదే సోషల్ మీడియాను టీడీపీ, జనసేన ఏ స్థాయిలో వాడుకున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విష ప్రచారానికి, అసత్య కథనాలకు వేల మంది సోషల్ మీడియా వారియర్లను రంగంలోకి దింపి పని చేయించారు చంద్రబాబు. అప్పటి సీఎం జగన్ చెప్పిన ప్రతి మాట, ప్రభుత్వం చేసిన ప్రతి పని మీద సోషల్ మీడియాను ప్రయోగించారు చంద్రబాబు. అప్పుడు అది ఆయనకు భావ ప్రకటనా స్వేచ్ఛగా కనిపించింది.
2023లో స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తాను అరెస్టయినప్పుడు దేశ విదేశాల్లోని టీడీపీ సానుభూతిపరులతో సోషల్ మీడియాలో ఉద్యమమే నడిపించింది టీడీపీ. అప్పుడు సోషల్ మీడియా వారికి రక్షణ కవచంగా ఉపయోగపడింది. ఇప్పుడు అదే చంద్రబాబుకు నేరగాళ్ల వేదికగా కనిపిస్తోంది. ఆయన్ను విమర్శించే ప్రతి ఒక్కరికీ జగన్ ద్వారా ఫండింగ్ అందుతోందంటూ నేరస్తులుగా ముద్ర వేస్తున్నారు. తాను అధికారంలోకి రావడానికి నిచ్చెనగా ఉపయోగపడిన సోషల్ మీడియానే ఇప్పుడు తన ప్రభుత్వ అసలు రూపాన్ని ప్రజల ముందు పెడుతుంటే చంద్రబాబు ఏ మాత్రం భరించలేకపోతున్నారు.
సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని అడిగే గొంతులను టాస్క్‌ఫోర్స్‌తో మూయించాలని చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగాలు, మానసిక వేధింపులు, యాక్టివిస్టులను నేరస్తుల తరహాలో మీడియా ముందు నిలబెట్టడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పని చేస్తోంది. తద్వారా తన ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు బయటకు రాకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఇలా ఎన్ని చేసినా రోజుకో బాగోతం వెలుగు చూస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీలే బ్లాక్
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే తొలగించడం, పార్టీ ఫేస్‌బుక్ పేజీని భారత్‌లో అందుబాటులో లేకుండా చేయడం దాకా ఈ అణచివేత వెళ్లింది. ఐటీ యాక్ట్ కింద సోషల్ మీడియా పోస్టులకు నేరుగా అరెస్టులు చేయొద్దన్న సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా, రాష్ట్రంలో అవి అమలు కావడం లేదంటే అణచివేత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


