భోపాల్: ఒక మహిళ ఎన్నో ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధను ఇక భరించలేకపోయింది. అత్తింట్లో ఎదుర్కొంటున్న వేధింపులు ఆమె మనసుని చంపేశాయి. ఎవరూ తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే, తాను చనిపోతే తన గొంతు మూగబోతుందని, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఆవేదనతో కాగితంపై కాకుండా... తన చేతులు, కాళ్లపైనే మెహందీతో చివరి సందేశం రాసింది. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
ఛింద్వారాకు చెందిన ఓ మహిళ అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. చనిపోవడానికి ముందు ఆమె తన చేతులు, కాళ్లపై మెహందీతో సూసైడ్ నోట్ రాసింది. అందులో అత్తింట్లో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొన్న వేధింపుల గురించి రాసిన విషయాలు గుండెను కలిచివేస్తున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతురాలి చేతులు, కాళ్లపై రాసిన సూసైడ్ నోట్‌కు వీడియోగ్రఫీ కూడా చేశారు.
చేతులు, కాళ్లపై సూసైడ్ నోట్ ఎందుకు?
చౌరై పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళ పేరు ప్రీతి వర్మ (32). ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. ప్రీతికి సుమారు 13 ఏళ్ల క్రితం లఖన్ వర్మతో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి భర్త లఖన్, అతని కుటుంబ సభ్యులు ప్రీతిని వేధించేవారు.
మృతురాలు ప్రీతి సోదరుడు హరియోమ్ జాంగేలా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు. ప్రీతి చనిపోయిన తర్వాత కాగితంపై రాసిన సూసైడ్ నోట్‌ను అత్తింటి వారు నాశనం చేసే అవకాశం ఉందని ఆమె భయపడి ఉండొచ్చని చెప్పారు. అందుకే తన శరీరంపైనే మెహందీతో సూసైడ్ నోట్ రాసిందని, అలా చేస్తే దాన్ని చెరపలేరని తెలిపారు. భర్త లఖన్ వర్మ, అత్తింటి వారు చాలాకాలంగా ప్రీతిని వేధించారని చెప్పారు. ఆమెపై మానసికంగా, శారీరకంగా వేధింపులు జరిగేవని తెలిపారు. ప్రీతి 2-3 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ప్రతిసారీ భర్త లఖన్ వర్మ ఆమెను నమ్మించి, బాగా చూసుకుంటానని తిరిగి తీసుకెళ్లేవాడని చెప్పారు.
వాంగ్మూలం ఇచ్చేలోపే ప్రీతి మృతి
పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రీతి వర్మ విషం తాగిన తర్వాత కుటుంబ సభ్యులు ముందుగా జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేసేలోపే శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ ప్రీతి చనిపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు.


