మెహబూబా ముఫ్తీ (కశ్మీర్‌ లీడర్‌) రాయని డైరీ | Mehbooba Mufti Rayani Diary | Sakshi
Sakshi News home page

మెహబూబా ముఫ్తీ (కశ్మీర్‌ లీడర్‌) రాయని డైరీ

Jul 5 2026 1:17 AM | Updated on Jul 5 2026 5:09 AM

Mehbooba Mufti Rayani Diary

మాధవ్‌ శింగరాజు

సర్వోన్నతుడి నిర్యాణం అంతులేని దుఃఖాన్ని మిగిలిస్తుంది. ఆ దుఃఖంలోనే అనంతమైన ఓదార్పూ ఉంటుంది. అయతొల్లా అలీ ఖమేనీ పార్థివ దేహానికి తుది వీడ్కోలు పలికేందుకు టెహ్రాన్‌లోని ‘గ్రాండ్‌ మొసల్లా కాంప్లెక్స్‌’కు చేరుకున్న విషాద జనవాహినిలో నేనూ ఒకరిగా నిరీక్షిస్తూ ఉన్నాను. ఊరేగింపునకు ‘లోక నాయకుడు’ కదలగానే ఒక్కసారిగా శోకాలు మిన్నంటాయి. నివాళుల నలుపు వస్త్రాలతో భూమి యుద్ధమేఘమై బాధాతప్త నినాదాలతో ఉరమటం మొదలైంది. గుండెలు కుండపోతగా కురుస్తున్నట్లుగా ఆగని ఆశ్రువులు!

అమరత్వం విషాదం కాదు. అగాథం కాదు. అంతం అసలే కాదు. అది గౌరవం. చైతన్యం. శాశ్వత జీవితం. దేవుడితో బేరమాడి కొనితెచ్చుకున్న పరమోన్నత స్థితి. ‘‘దేవా, నేను నీ మార్గంలో నడుస్తాను. బదులుగా నా మరణానికి అమరత్వాన్ని అనుగ్రహిస్తావా?’’ అని అల్లాహ్‌తో చేసుకున్న ఒప్పందం. శాంతిని విశ్వసించిన యుద్ధవీరుడు ఖమేనీ. ‘‘శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, న్యాయంగా ఉండటం కూడా...’’ అని శత్రువు చెంప చెళ్లుమనిపించినవాడు. శాంతిని ఒక ప్రగాఢమైన మానవ ఆకాంక్షగా ఖమేనీ విశ్వసించారు. న్యాయం నెలకొన్న చోట మాత్రమే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది అన్నారు. ‘విధించబడిన’ శాంతిని ఇరాన్‌ ఎంత గట్టిగా వ్యతిరేకిస్తుందో, అంత గట్టిగానే తలపై వచ్చిపడే తలవని యుద్ధాన్ని ఎదుర్కొంటుందని ఖమేనీ గర్జించారు.
 
ఏమీ తోచక ఒళ్లు విరుచుకున్నట్లుగా, సామ్రాజ్యాలను విస్తరించుకోవాలని ఖమేనీ కోరుకోలేదు. ఇస్లాంను ఒక చల్లని యంత్రంలా కాక... ప్రేమలు, భావోద్వేగ బంధాలతో అల్లిన ఒక వెచ్చని మానవ స్పర్శతో పెనవేయాలని ఆకాంక్షించారు. జీవితమనే పరిమిత సంపదను మనం ఎలా వదిలించు కుంటామనే దానిపైనే జీవితపు నిజమైన విలువ ఆధారపడి ఉంటుందని ప్రబోధించారు! జీవితాన్ని ‘చిందిన నూనె’ అన్నారాయన. ఆ చిందిన నూనె చిమ్ముతున్న లక్షల దైవిక కాంతుల్లా మొసల్లా కాంప్లెక్స్‌లోని ఖమేనీ సన్నిధి ప్రార్థనలో అందరం నిలుచుని ఉన్నాం. 

టెహ్రాన్‌లో ఇవాళ, రేపు వీడ్కోలు ఊరేగింపు. 7న పవిత్ర ఖోమ్‌ నగరానికి ఊరేగింపుల తరలింపు. 8న ఇరాక్‌లోని కర్బలా, నజఫ్‌లలో భౌతిక కాయానికి పవిత్ర కర్మకాండలు. 9న ఖమేనీ జన్మస్థలం మషద్‌లోని ఇమామ్‌ రెజా మందిరంలో తుది ఖనన ఊరేగింపు. ప్రపంచ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు, ప్రత్యేక అతిథులకు కార్యక్రమాల మొదటి విడతవరకే అధికారిక ఆహ్వానాలు ఉన్నాయి. రేపే నా తిరుగు ప్రయాణం. తండ్రి అంత్యక్రియల ఆహ్వాన లేఖలో నన్ను ‘ఆత్మీయ అతిథి’గా సంబోధించారు మోజ్తబా ఖమేనీ! అది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంటి ఆడపడుచును ఆదరించి నట్లుగా ఉంది.

జూలై 3న నేను శ్రీనగర్‌ నుంచి ఢిల్లీ చేరుకునేటప్పటికే ఇరాన్‌  పంపిన ప్రత్యేక విమానం అక్కడ సిద్ధంగా ఉంది. ఖమేనీకి తుది వీడ్కోలు పలికే భాగ్యం కల్పించటానికి వచ్చి మా కోసం వేచి ఉన్న దేవదూతలా ఉంది ఆ లోహ విహంగం. రమ్మని కబురు పంపటం, తోడ్కొని రమ్మని మనిషిని పంపటం... ఇది కదా పిలుపంటే... దుఃఖానికైనా, ఉత్సవానికైనా! ఇప్పుడిది రెండూ కలగలిసిన ‘దుఃఖోత్సవం’! ఢిల్లీలో ఆ రోజు టెహ్రాన్‌కు ఫ్లయిట్‌ టేకాఫ్‌ అయ్యేముందు ఖురాన్‌ ను తీసి, పేజీలు తెరిచి చూశాను. ‘‘వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు జీవించి ఉన్నారు, కానీ మీరు దానిని గ్రహించలేరు’’ – లేపనం లాంటి మాట! అల్లాహ్‌ చూపిన ధర్మ మార్గంలో నడిచిన నాయకుడికి మృత్యువు ఎదురు పడుతుందా? అసలు ఎదురొచ్చి నిలబడుతుందా?! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement