విశ్లేషణ
భారత్ ఇటీవలే వినియోగదారుల ధరల సూచీ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ –సీపీఐ)కి కొత్త రూపం ఇచ్చింది. 2012ను ఆధార సంవత్సరంగా తీసుకున్న పాత శ్రేణి స్థానంలో, 2024ను ఆధార సంవత్స రంగా తీసుకున్న కొత్త శ్రేణి 2026 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 ఆధారంగా వినియోగ బుట్టను, దాని బరువులను పునర్నిర్మించారు. అయితే, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణ సూచీలు ఒక కుటుంబం ప్రత్యక్షంగా అనుభవించే ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా ప్రతి బింబించడం లేదనే వాదన కొన్ని వర్గాల్లో ఉంది. ఉదాహరణకు, ఆగస్ట్ 12న విడుదలైన జూలై నెల సీపీఐ సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం రేటును 4.45 శాతంగా, పట్టణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం రేటును 5.05 శాతంగా చూపించింది. వాస్తవానికి తాము మోస్తున్న ధరల భారం మరింత ఎక్కువని కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి సీపీఐ తప్పుగా లెక్కించబడటం లేదు. అయితే, సీపీఐ ఒక సగటు వినియోగ బుట్ట ఆధారంగా దేశంలోని కుటుంబాలందరికీ ద్రవ్యోల్బణ రేటును సూచిస్తుంది. కానీ ప్రతి కుటుంబం ఒకే వస్తువులను, ఒకే పరిమాణంలో, ఒకే ధరకు కొనదు. అందువల్ల అధికారికంగా సూచించే ద్రవ్యోల్బణం, కుటుంబం అనుభవించే ద్రవ్యోల్బణం కొంత భిన్నంగా ఉండవచ్చు.
ఒకే బుట్ట... భిన్నమైన కుటుంబాలు
ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి, ప్రజలు సాధారణంగా కొనుగోలు చేసే వస్తువులు, సేవలను ఒక ‘వినియోగ బుట్ట’గా వర్గీక రిస్తారు. పాత శ్రేణిలోని 299 వెయిటెడ్ వస్తువుల స్థానంలో కొత్త శ్రేణిలో 358 వస్తువులు చేరాయి. ప్రతి వస్తువుకు, కుటుంబాల మొత్తం వినియోగ వ్యయంలో దాని ప్రాధాన్యతకు అనుగుణంగా ఒక బరువు కేటాయిస్తారు. వాటి ధరల మార్పును ఈ బరువుల దామాషాలో గణించి సీపీఐని లెక్కిస్తారు. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 ప్రకారం, సగటున భారతీయ కుటుంబం తన వినియోగ వ్యయంలో దాదాపు 40–50 శాతం ఆహారంపైనే ఖర్చు చేస్తోంది. అయితే తక్కువ ఆదాయ కుటుంబాలు ఆహారంపై తమ వినియోగ వ్యయంలో ఎక్కువ భాగం ఖర్చు చేయడం వల్ల, ఆహార ధరలు వేగంగా పెరిగినప్పుడు, వారిపై సగటు సూచీ చూపే ద్రవ్యోల్బణం కంటే అధిక భారం పడుతుంది. ధరల కారణంగా ఒక కుటుంబం పామాయిల్ కొనడం తగ్గించి, వేరుశనగ నూనెకు మారిందనుకుందాం. కానీ, వెంటనే సూచీ బరువులు మారవు. అందువల్ల వినియోగ బుట్టలోని వస్తు వులు, వాటి బరువులను ఒకసారి సవరించి సుదీర్ఘకాలం కొనసాగించే బదులు, వినియోగ వ్యయ సర్వేల ఆధారంగా మరింత తరచుగా బరువులను పునఃసమీక్షించే విధానం అవసరం. భారత్ కొత్త సీపీఐలో 2024ను ఆధార సంవత్సరంగా ఎంచుకోవడం ద్వారా ఈ దిశగా ముందడుగు వేసింది.
ధర మారకపోయినా... ఖర్చు పెరగవచ్చు
ఇటీవలి కాలంలో సూపర్ మార్కెట్లలో తరచూ చూస్తున్న ‘ష్రింక్‌ఫ్లేషన్’ మరో సమస్య. నిత్యావసరమైన ‘పాలు’ ఉదాహర ణగా తీసుకుందాం. 500 మిల్లీలీటర్ల ఉత్పత్తి స్థానంలో అదే ధరకు 400 మిల్లీలీటర్లు లభిస్తే, ధర పెరగకపోయినా వినియోగదారుడి వాస్తవ ఖర్చు పెరుగుతుంది. సీపీఐలో ఉత్పత్తి పరిమాణం లేదా ఉత్పత్తి లక్షణాలు మారినప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకునే విధానం ఇప్పటికే ఉంది. అయితే వేలాది ఉత్పత్తుల ప్యాక్ పరిమాణాలు మారుతూ ఉండే రిటైల్ మార్కెట్లో, ఇటువంటి మార్పులను సకాలంలో గుర్తించి, యూనిట్ ధరలో వచ్చిన మార్పును త్వరితంగా నమోదు చేయడానికి ఈ–కామర్స్, రిటైల్ స్కానర్ డేటాను విస్తృతంగా ఉపయోగించాల్సి ఉంటుంది. బ్రిటన్ 2026లో గ్రోసరీ స్కానర్ డేటాను సీపీఐలో ఇముడ్చుతూ, పరిమాణ మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వస్తువుల నాణ్యత మారినప్పుడు కూడా కొత్త సీపీఐలో నాణ్యత సర్దుబాటుకు ప్రత్యేక విధానం ఉంది. అయితే స్మార్ట్‌ఫోన్లు, కంప్యూ టర్లు వంటి వేగంగా మారే ఉత్పత్తుల్లో కెమెరా సామర్థ్యం, స్టోరేజ్, ప్రాసెసింగ్ వేగం వంటి లక్షణాల విలువను, బ్రిటన్ , అమెరికాల తరహాలో విడివిడిగా అంచనా వేసే ‘హెడానిక్ ప్రైసింగ్’ (వస్తువు ధరలో దాని వివిధ లక్షణాల వాటాను విడిగా అంచనా వేసే పద్ధతి)ని విస్తృతంగా ఉపయోగిస్తే, ఉత్పత్తుల ధరల్లో వచ్చిన వాస్తవ మార్పులను సూచీలు మరింత నిక్కచ్చిగా ప్రతిబింబించగలవు.
జాతీయ సగటు సరే, మా ఇంటి పరిస్థితేంటి?
మొదట, ప్రస్తుత జాతీయ సీపీఐకి తోడుగా వివిధ ఆదాయ వర్గాలకు ప్రత్యేక వినియోగ బరువులతో సూచీలను రూపొందిస్తే, ధరల పెరుగుదల దిగువ, మధ్య, ఎగువ ఆదాయ కుటుంబాల జీవనవ్యయాన్ని విడివిడిగా, మరింత కచ్చితత్వంతో చూపిస్తుంది. రెండవది, ప్రతి కుటుంబానికి వ్యక్తిగత ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే డిజిటల్ సాధనాన్ని ప్రభుత్వం అందించవచ్చు. ఒక కుటుంబం ఆహారం, ఇంధనం, విద్య, ఆరోగ్యం, అద్దె తదితరాలపై తన నెల వారీ వినియోగాన్ని, ఖర్చును నమోదు చేస్తే, అదే సీపీఐ ధరల డేటాను ఉపయోగించి ఆ కుటుంబం ప్రత్యక్షంగా అనుభవించే వాస్తవ ద్రవ్యోల్బణాన్ని లెక్కించవచ్చు. అటువంటి సూచీ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలకు దోహదపడుతుంది. కెనడాలో ఇప్పటికే ఇలాంటి అధికారిక వ్యక్తిగత ద్రవ్యోల్బణ కాలిక్యులేటర్ ఉంది. మూడవది, ధరల పెరుగుదలతో పాటు పన్నుల అనంతరం మిగిలే ఆదాయంలో మార్పును కూడా పరిగణనలోకి తీసుకుని, ఒక కుటుంబం వాస్తవంగా ఎంత కొనుగోలుశక్తిని కోల్పోయిందో లేదా పొందిందో చూపించే ‘నికర వాస్తవ కొనుగోలు శక్తి సూచీ’ని అభివృద్ధి చేయవచ్చు.
ఆదాయంలో మార్పు, ప్రత్యక్ష పన్నుల భారం వంటి అంశాలను సమన్వయం చేసే ఈ సూచీ, ‘నా ఆదాయం పెరిగినా నా చేతిలో మిగిలే డబ్బు ఎందుకు పెరగడం లేదు?’ అనే సామాన్యుడి ఆవేదనకు గణాంకపరమైన సాంత్వన చేకూర్చుతుంది. భారత్ కొత్త ద్రవ్యోల్బణ శ్రేణిలో 1,465 గ్రామీణ, 1,395 పట్టణ మార్కెట్లతో పాటు 12 ఆన్ లైన్ మార్కెట్ల నుంచి ధరలను, ఈ–కామర్స్, టెలిఫోన్ , విమాన ప్రయాణం, ఓటీటీ వంటి విభా గాల్లో ఆన్ లైన్ డేటాను కూడా ఉపయోగిస్తోంది. తదుపరి దశలో జీఎస్టీ, ఈ–ఇన్ వాయిస్ డేటా, ఈ–కామర్స్ విక్రయాలు, రిటైల్ స్కానర్ డేటా వంటి వనరులను... ధరలతో పాటు కొను గోలు పరిమాణాలను అంచనా వేయడానికి ఉపయోగిస్తే ష్రింక్ ఫ్లే్లషన్ వంటి ధోరణుల ప్రభావాన్ని కూడా మరింత కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. కొన్ని యూరోపియన్ దేశాలు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.
కృష్ణ బాలాజి పల్లపోతు
వ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు


