ఒక ఫోటో... కాలానికి అద్దం | World Photography Day 2026 history and why the date matters | Sakshi
Sakshi News home page

World Photography Day ఒక ఫోటో... కాలానికి అద్దం

Aug 19 2026 12:27 PM | Updated on Aug 19 2026 12:37 PM

World Photography Day 2026 history and why the date matters

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

‘ఒక చిత్రం వెయ్యి మాటలకు సమానం’ అంటారు. కానీ ఒక మంచి ఫొటో వెయ్యి మాటలకే పరిమితం కాదు; అది ఒక జ్ఞాపకాన్నీ, ఒక భావోద్వేగాన్నీ, ఒక సంఘటననూ, ఒక్కోసారి ఒక కాలాన్నే తనలో శాశ్వతంగా భద్రపరుస్తుంది. తరాలు మారిపోతాయి. కానీ ఒక ఫొటో ఆ ఒక్క క్షణాన్ని ఆపి ఉంచుతుంది. నవ్వులు, కన్నీళ్లు, విజయాలు, విషాదాలు, పోరాటాలు, సంబరాలు అందులో నిశ్శబ్దంగా జీవిస్తూనే ఉంటాయి.

1839లో ఫ్రెంచ్‌ ఆవిష్కర్త లూయిస్‌–జాక్‌–మాండే డాగ్యేర్‌ అభివృద్ధి చేసిన డాగ్యేరియో టైప్‌ ప్రక్రియ ప్రపంచానికి పరిచయం కావడంతో ఫొటో గ్రఫీ ఒక కొత్తయుగంలోకి ప్రవేశించింది. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌లో ఈ ప్రక్రియను అధికారికంగా ప్రకటించడంతో ఆ రోజుకు ఫొటోగ్రఫీ చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది. అందుకే ప్రతి సంవ త్సరం ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ’ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం.

తెలంగాణ విషయానికి వస్తే ఫొటో జర్నలిజానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతఉంది. హైదరాబాద్‌ నగర జీవితం నుంచి తెలంగాణ పల్లెల వరకు, బతుకమ్మ నుంచి బోనాల వరకు, మేడారం జాతర నుంచి వివిధ సాంస్కృతిక ఉత్సవాల వరకు, ఎన్నికల నుంచి ప్రజా సమస్యల వరకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి సామాజిక పరిణామాల వరకు తెలంగాణ జీవితంలోని అనేక కోణాలను ఫొటో జర్నలిస్టులు తమ కెమెరాల్లో భద్రపరిచారు. తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్రలో జరిగిన వివిధ ఉద్యమాల సందర్భంలో కూడా ఫొటో జర్నలిజం ఒక ముఖ్యమైన దృశ్య రికార్డుగా నిలిచింది. 1969 ఉద్యమం నుంచి తరువాతి దశల వరకు జరిగిన ర్యాలీలు, విద్యార్థుల ఆందోళనలు, ప్రజా సమావేశాలు, నిరసనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం వంటి అనేక దృశ్యాలను ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో భద్రపరిచారు. 

ఇదీ చదవండి: ఏ రకమైన దోమ కుడితే ఎలాంటి వ్యాధి వస్తుందో తెలుసా?

ఫొటో జర్నలిస్టు పని బయటకు కనిపించేంత సులభమైనది కాదు. మంచి ఫ్రేమ్‌ కోసం కొన్నిసార్లు గంటల తరబడి ఎదురుచూడాలి. ఎండ, వర్షం, రద్దీ, ప్రమాదకర పరిస్థితులు... ఏవీ పట్టించుకోకుండా సరైన క్షణాన్ని కెమెరాలో బంధించాల్సి ఉంటుంది. సరైన క్షణాన్ని గుర్తించే చూపు, సంఘటనను అర్థం చేసు కునే అవగాహన... ఇవే మంచి ఫొటోగ్రాఫర్‌కు అసలైన సంపద. ఒక ఫొటో తీసిన క్షణంలో అది కేవలం ఒక చిత్రం. కానీ సంవత్సరాలు గడిచిన తరువాత అదే ఫొటో ఒక జ్ఞాపకం. మరింత కాలం గడిచిన తరువాత అదే ఫొటో ఒక చరిత్ర. కాలం మారుతుంది. తరాలు మారుతాయి. సాంకేతికత మారుతుంది. కానీ ఒక మంచి ఫొటో మాత్రం కాలాన్ని దాటి జీవిస్తూనే ఉంటుంది.
– నాగులపల్లి వెంకటేశ్వరరావు 
సెక్రెటరీ, మీడియా అకాడమీ ఆఫ్‌ తెలంగాణ
ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement