ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో విద్యార్థుల నిరసన ప్రదర్శన
సందర్భం
దేశం ఈ నెల 15న 80వ స్వాతంత్య్ర సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఒక అపూర్వమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని పేరు ‘స్కూల్స్ ఠీక్ కరో’, లేదా ‘ఫిక్స్ రూరల్ గవర్నమెంట్ స్కూల్స్’. సీజేపీ ఉద్యమం మొదలైందే విద్యారంగ సమస్యలపై. ఈ దేశ భవిష్యత్తు ఆధారపడింది విద్యా వ్యవస్థపై అనీ, అది పేదలకూ, గ్రామీణులకూ అందుబాటులో లేకుండా పోయిందనీ, కనుక ఈ సమస్యపై మొత్తం దేశాన్ని కదిలించేందుకు ప్రయత్నించగలమనీ నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో మొదటి రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమాల వీడియోలు, వార్తలు అందుబాటులోకి వస్తున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కే తన స్వస్థలమైన ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల మధ్య కూర్చుని, వివిధ సౌకర్యాలు, బోధనా పరిస్థితుల గురించి వారిని చిన్న చిన్న ప్రశ్నలు వారి మాతృభాష మరాఠీలో అడుగుతూ నోట్స్ రాసుకోవటం కన్పించింది. ఆ పిల్లలు ఉత్సాహంగా చెప్తున్నారు. అదే రోజున సీజేపీ ఇతర బాధ్యులు, ఇంకా వందలాది మంది కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాలలోని వేర్వేరు గ్రామాలలో అదే పని చేశారు.
నూతన ఉద్యమ వాతావరణం
గమనించదగిన విశేషం మరొకటి జరిగింది. జంతర్ మంతర్ ఉద్యమస్ఫూర్తితో అంతటా ఒక కొత్త వాతావరణం ఏర్పడినందున, అనేకచోట్ల సీజేపీ బాధ్యులెవరూ లేకుండానే బడిపిల్లలు ఈ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమం గురించి విని, తమంతట తామే తమ బడులలో వివిధ సౌకర్యాల లేమిపై పాఠశాల పెద్దలనే కాక, సమీపాన గల ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి ప్రశ్నించటం కనిపించింది. ఇదే చైతన్యం దేశమంతటా వ్యాపిస్తే? వ్యాపింపజేయటమే జంతర్ మంతర్ తర్వాత తమ తదుపరి కార్యక్రమమని సీజేపీ ప్రకటించింది. దానిని ‘సీజన్–2’ ఉద్యమ మంటున్నది. అందులో భాగంగా చేపట్టే కార్యక్రమం కోసం ఒక ఫారాన్ని తమ వెబ్‌సైట్‌లో పెట్టింది. దాని ద్వారా ఎవరైనా సభ్యు లుగా చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. యథాతథంగా కార్యక్రమంలో చేయవలసిన పనులు మూడు విధాలు. ఒకటి– మంచినీళ్ళు, టాయిలెట్ సౌకర్యాల పరిస్థితి.
రెండు– విద్యుత్తు, తరగతి గదులు, వాటి భద్రత. మూడు– ప్రహరీ గోడలు, భద్రత. ఇదంతా మొదటి విధమైన పని. రెండవ విధమైన దానిలో కార్యకర్తలు లైట్లు, ఫ్యాన్లతో సహా వీట న్నింటిని ఫొటోలు, వీడియోలు తీయాలి. అగ్నిమాపక సిలిండర్లు ఉన్నాయో లేదో చూడాలి. మూడవ విధమైన పని ఈ వివరాలన్నీ అధికారులకు అందజేయటంతో పాటు, సీజేపీ అడ్రసుకు అప్‌లోడ్ చేయాలి. మన దేశం స్వతంత్రమైనప్పటినుంచి విద్యారంగానికి సంబంధించి ఆధా రాలతో అధికారులను ఒత్తిడి చేయటం వంటి కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఎన్నడూ జరగలేదు. గమనించదగిన మరొకటి, నెహ్రూ కాలంలోనూ ఉన్నత విద్యపై తప్ప గ్రామీణ విద్యపై, ప్రాథమిక విద్యపై తగిన శ్రద్ధ చూపలేదు.
అయినా అణచివేతలా?
సీజేపీ కార్యక్రమం ఏ విధంగా సాగి ఎటువంటి ప్రభావాలు చూపగలదో ఇప్పుడే చెప్పలేము. విద్యారంగానికి సంబంధించి వారి అవగాహనలు, ఆలోచనలు, లేవనెత్తుతున్న ప్రశ్నలు, తలపెట్టిన కార్యక్రమాలు మాత్రం సమగ్రంగా కనిపిస్తున్నాయి. వాటిలో లోతు, దూరదృష్టి ఉన్నాయి. విద్యార్థి లోకంలో, వారి తండ్రులలో, సమా జంలో, ఆలోచనాపరులలో మద్దతు పెరుగుతున్నది. మరొక విషయం, ఆ నిర్వాహకులపై, వారి కార్యక్రమాలపై వ్యతిరేకత, అణచివేత చర్యలు జంతర్ మంతర్ దశ తర్వాత కూడా కొనసాగు తుండటం. ఉదాహరణకు, తమ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమ ప్రకటనకు ఢిల్లీలో కార్యకర్తల సమావేశాన్ని జరపచూడగా, అందు కోసం హాలును ఇవ్వకుండా యజమానులను బెదిరించారు. చివరకు ఒక పార్కులో సమావేశమవుతుండగా పోలీసులను పంపి గేట్లకు తాళాలు వేశారు. గట్టిగా ప్రశ్నించిన మీదటగానీ తెరవలేదు. ఇటువంటి నిర్హేతుకతలు, అణచివేతల ప్రభావం, దేశమంతటా ఇప్పటికే జంతర్‌మంతర్ సృష్టించిన ప్రభావాలను మరెంత పెంచు తుందో అధికారంలో గల వారికి అర్థం కావటం లేదు. జంతర్ మంతర్ దరిమిలా స్వయంగా ప్రధాని మోదీ, ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ విద్యారంగం గురించీ, యువ తరం అసంతృప్తి న్యాయబద్ధం కావటం గురించీ చెప్పిన మాటలను గమనించినప్పుడు, ఈ అణచివేతలు విచిత్రంగా తోస్తాయి.
ప్రభుత్వ విద్యారంగం బాగుపడక ప్రైవేట్ రంగం మాత్రమే వర్ధిల్లినంత కాలం సాధారణ కుటుంబాల పిల్లలు చదువులో ముందుకుపోలేరు. అందువల్ల వారికేగాక దేశానికి కూడా నష్టమే. కనుక విద్యారంగానికి బడ్జెట్లను జీడీపీలో ఆరు శాతానికే కాదు,అంతకు మించి పెంచాలి. నివేదికలను అమలుపరచాలి. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పించి విద్యాబోధనను మెరుగుపర చాలి. ఈ దిశలో తమ తొలి దశ కార్యక్రమాన్ని ఆరు మాసాలపాటు సాగి స్తారు. ఇది క్రమంగా ఊపందుకుని దేశవ్యాప్తమైన కొద్దీ కొత్త పరిస్థితులను చూడగలమని ఆశించవచ్చు. వారు మూతపడిన 94 వేల స్కూళ్ల గురించి కూడా ప్రశ్నిస్తున్నందున వాటిని తిరిగి తెరవటం, ఇక ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మూసివేత లను కొనసాగించకపోవటం కూడా జరుగుతుందని ఆశించాలి.
క్యా బోల్తీ పబ్లిక్?
పోతే, కాక్రోచ్ సీజన్ 2 సరైన మార్గంలో ముందుకు సాగుతున్న సూచనలు ఇతరత్రా కూడా ఉన్నాయి. వారి కోర్ కమిటీ ఈ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తాము విద్యతో పాటు ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యలపై ప్రభుత్వాలను ఒత్తిడి చేసే ఉద్యమంగానే ఉంటాము తప్ప రాజకీయాలలోకి ప్రవేశించబోమన్న అంతకుముందటి వైఖరినే పునరుద్ఘాటించటం వాటిలో మొదటిది. అందువల్ల వారి విశ్వసనీయత పెరిగి, పునాది స్థిరపడి విస్తరిస్తుంది. అదే సమావేశంలో సంస్థ బాధ్యుల టీమ్‌ను ప్రకటించటంతోపాటు, దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నలుగురు ఇన్‌ఛార్జ్‌లను నియమించుకున్నారు. కార్యాచరణకు సంబంధించి, ఈ సెప్టెంబర్ నుంచి, దేశమంతటా పర్యటనలు జరిపి ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరిట అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలూ, ఆలోచనలేమిటి? ఏమి జరగాలనుకుంటున్నారు? అనేవి తెలుసుకోవటం; దాని ఆధారంగా భవిష్యత్తు అజెండాలను, కార్యాచరణను రూపొందించటం.
ఎంతో సంయమనంతో, ప్రజాస్వామికంగా, శాంతియుతంగా ప్రజలతో సమన్వయమవుతూ ముందుకు సాగేందుకు సీజేపీ ప్రయత్నిస్తున్న తీరును, అందుకు సమాజంలో కనిపిస్తున్న సానుకూలతలను గమనించినప్పుడు, మన దేశపు 80వ స్వాతంత్య్ర సంవత్సరంలో కొత్త గాలులు మొదలుకానున్నాయా అనే సూచనలు కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రానంతర దేశం 1991 నాటి ఆర్థిక సంస్కరణలతో ఒక కొత్త మలుపు తిరగగా, ఈ 2026లో మరొక మలుపు తిరిగే అవకాశమున్నదా? ఈ ప్రశ్నలు ఇప్పటికే ఆలోచనా పరుల మెదళ్లకు మేతగా మారాయి.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


