సమస్య వైపు పరుగెత్తు! | Sakshi Guest Column On Lisa Su Speech At MIT | Sakshi
Sakshi News home page

సమస్య వైపు పరుగెత్తు!

Aug 17 2026 12:18 AM | Updated on Aug 17 2026 12:19 AM

Sakshi Guest Column On Lisa Su Speech At MIT

అమెరికాలోని మిట్‌ (మెసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)లో 2026 బ్యాచ్‌ పట్టభద్రులను ఉద్దేశించి అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైసెస్‌ (ఏఎండీ) చైర్‌పర్సన్‌ , సీఈఓ లీసా సూ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం:

విశ్వగురు

నేను చాలా ప్రసంగాలు చేశాను. కానీ ఇది నాకు వ్యక్తిగతమైనది. 1986 చలికాలంలో మిట్‌లో చేరాను. నా తల్లిదండ్రులు నన్ను నెక్ట్స్‌ హౌస్‌ హాస్టల్‌లో దింపి వెళ్లారు. అప్పుడు నాకు 17 ఏళ్లు. నేను తైవాన్‌లో పుట్టాను. అమెరికాలోని క్వీన్స్‌ ప్రాంతంలో పెరిగాను. గణితంలో నేను దిట్ట అని నమ్మేదాన్ని! కానీ రెండు వారాల్లోనే ఒక విషయం అర్థమైంది: ఎంఐటీలో గణితంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు! మొదటి అసైన్‌మెంట్‌లను చూస్తూ అనుకున్నాను: ‘అయ్యో! ఇవి ఎంతో కష్టంగా ఉన్నాయి!’ 

నేను కాలేజీకి (ఫ్రెష్‌మన్  ఇయర్‌కు) వచ్చేవరకు ఎప్పుడూ రాత్రంతా నిద్రలేకుండా చదవడం లేదా పనిచేయడం అనేది లేదు. మిట్‌లో చేరాక ఆ అనుభవం కొత్తగా ఉన్నా... క్లాస్‌మేట్స్‌తో కలిసి పని చేయడం సరదాగా అనిపించింది. మిట్‌ మనల్ని ఊహించిన దానికంటే ఎంతో ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన మార్గాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు సమస్యలతో కుస్తీ పడతారు. ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒకటి రెండు సర్క్యూట్లు పేలిపోవచ్చు. కానీ ఏదోలా చివరకు ఆ పని పూర్తవుతుంది. అప్పుడు మీరే స్వయంగా ఏదో ఒకటి తయారు చేయగలరని మీకు అర్థమవుతుంది. 

సెమీకండక్టర్లతో ప్రేమ
మిట్‌లో డిగ్రీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) చదువుతున్నప్పుడే రీసెర్చ్‌లో పనిచేసే అవకాశం రావడం నా జీవితాన్నే మార్చేసింది. ఎక్స్‌–రే లిథోగ్రఫీ మాస్క్‌ బ్లాంక్స్‌ తయారు చేయడం ఆ ప్రాజెక్ట్‌ ఉద్దేశం. అప్పట్లో దాని అర్థం ఏమిటో కూడా నాకు పూర్తిగా తెలి యదు. కానీ నా మొదటి ‘బన్నీ సూట్‌’ (క్లీన్ రూమ్‌లో వేసుకునే ప్రత్యేక దుస్తులు) వేసుకుని... చిన్న 2–అంగుళాల వేఫర్లపై పరికరాలు తయారు చేయడం ప్రారంభించాను. ఆ వేఫర్లు సున్నితంగా ఉంటాయనీ, పొరపాటున కూడా వాటిని పగలగొట్టకూదడనీ త్వరగానే గ్రహించాను. నేను ఎన్నో ప్రయోగాలు చేశాను. వాటిలో ఎక్కువ శాతం మేము ఆశించిన విధంగా పనిచేయలేదు. పద్ధతి మార్చుకుని, మళ్లీ ప్రయత్నించాం. నేను తరగతి గదిలో టెక్నాలజీ గురించి చదవడం మాత్రమే చేయలేదు; కొత్త విషయాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న ఒక బృందంలో భాగమయ్యాను. 

నాకైతే అప్పట్లో ఒకటే ఆలోచనొచ్చింది. వావ్, మనం ఇంత చిన్న వస్తువులను కూడా తయారు చేయగలమా? కానీ ప్రపంచాన్నే మార్చగల శక్తిమంతమైన చిన్న పరికరాలు ఇవి. అప్పుడే నేను సెమీ కండక్టర్లతో ప్రేమలో పడ్డాను. అక్కడే నేను సమస్యలను ఎలా పరిష్కరించాలో అసలు సిసలు పాఠాలు నేర్చుకున్నాను. ఆ రంగా నికి కొత్తగా వచ్చిన విద్యార్థి స్థాయి నుంచి, స్వయంగా ఆ రంగానికి కొత్త విషయాలు అందిస్తున్న వ్యక్తిగా మారాను. ఆ ప్రయాణంలో, నా మీద నాకు నమ్మకం కలగడం మొదలైంది. అది నాకు ఎప్పుడూ అన్ని సమాధానాలూ తెలుసనే అతివిశ్వాసం కాదు; అసలు సమాధానం ఇప్పుడే తెలియకపోయినా దాన్ని నేను కనుగొనగలను అనే ఆత్మవిశ్వాసం. మిట్‌ నాకు సెమీకండక్టర్‌ ఫిజిక్స్‌ కంటే పెద్ద విషయాన్ని నేర్పిందని నాకు అర్థమవుతోంది.  

మైండ్‌ అండ్‌ హ్యాండ్‌ 
మిట్‌ మోటో ‘మైండ్‌ అండ్‌ హ్యాండ్‌’ కేవలం ఒక నినాదం అనుకున్నాను. కానీ అది మిట్‌ ప్రత్యేకతను సరిగ్గా తెలియజేస్తుందని భావిస్తున్నాను. మిట్‌ మనకు లోతుగా ఆలోచించడం నేర్పిస్తుంది. ఏదైనా తయారు చేయడం, ఆలోచనలను పరీక్షించడం, మొదటి ప్రయోగం లేదా ఐదో ప్రయోగం కూడా విఫలమైనా ఆగిపోకుండా ముందుకు సాగడం నేర్పిస్తుంది. ఒకప్పుడు అసాధ్యమని పించిన సమస్యలను కూడా మీరు పరిష్కరించగలరని మీపై మీకే నమ్మకం కలిగేలా చేస్తుంది. నేను క్యాంపస్‌ వదిలి వెళ్లిన చాలా కాలం తర్వాత కూడా అదే భావనతో ఉన్నాను. నేను ఐబీఎంలో చేరినప్పుడు,మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినట్లు అనిపించింది. ఐబీఎంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. అప్పట్లో నాకు 25 ఏళ్లు.

అంత పెద్ద కంపెనీలో నేను ఎలా మార్పు తీసుకురాగలను అని ఆశ్చర్యపోయాను. కానీ త్వరగా ఒక ముఖ్యమైన విషయం తెలుసు కున్నాను. ఇంజినీరింగ్‌ మీ వయసును పట్టించుకోదు. మీ ఆలోచ నలు పనికొస్తాయా లేదా అనేదే చూస్తుంది. నా మెంటార్లలో ఒకరు నాకు చెప్పిన ఒక మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేదు: అత్యంత కష్టమైన సమస్యల వైపు పరు గెత్తుకుంటూ వెళ్లు! అప్పట్లో అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. కాలక్రమేణా, నా జీవితంలో లభించిన అత్యుత్తమ సలహా అదేనని అర్థమైంది. కష్టమైన సమస్యలే మీ అసలు సత్తా ఏమిటో మీకు తెలియజేస్తాయి. కొంచెం వెనక్కు వెళ్తే... 12 ఏళ్ల క్రితం, ఆ పాఠాన్ని నిజ జీవితంలో పరీక్షించి చూసే అవకాశం వచ్చింది. నాకు  ఏఎండీ సంస్థకు సీఈఓ అయ్యే అవకాశం లభించింది. ఆ ఉద్యోగంలో చేరడం రిస్క్‌ అని నా మెంటార్లలో కొందరు భావించారు. కానీ ఇది నా డ్రీమ్‌ జాబ్‌ (కలల ఉద్యోగం). నిజంగా ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై,సాంకేతిక రంగంలో కొత్త టెక్నాలజీతో పనిచేసే అవకాశం. భవి ష్యత్తులో అత్యంత కీలకమైన సాంకేతికత హై–పెర్ఫార్మెన్స్‌ కంప్యూ టింగ్‌ (అధిక పనితీరు గల కంప్యూటింగ్‌) అని మేము దీర్ఘకాలికంగా నమ్మాం. మా ప్రతిభావంతులైన బృందానికి పెద్ద ఆలోచనలు చేసే స్వేచ్ఛను ఇచ్చాం. తదుపరి కొన్ని సంవత్సరాలలో, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లను తయారు చేయడానికి వీలుగా మేము టెక్నాలజీని అభివృద్ధి చేశాం. 

భవిష్యత్‌ను నిర్ణయించేది మనుషులే!
గడచిన కొన్ని దశాబ్దాలలో మనం అనేక సాంకేతిక మార్పులను చూశాం. ఇప్పుడు ఏఐ విప్లవానికి ప్రారంభంలో ఉన్నాం. ఏఐ మనుషులను భర్తీ చేయదు. బదులుగా, ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. వైద్యం, శాస్త్రం, ఇంధనం, వాతావరణం– ఏ రంగంలోనైనా, మనం గడిచిన ముప్పై ఏళ్లలో కనుగొన్న దానికంటే ఎక్కువ విషయాలను రాబోయే పదేళ్లలోనే కనుగొనవచ్చు. అయితే భవిష్యత్తు ఎలా ఉండాలనేది సాంకేతికత నిర్ణయించదు, మనుషులే నిర్ణయిస్తారు. శక్తిమంతమైన పరికరాలను ఎలా ఉపయోగించాలో తెలిసిన మనుషులు ప్రపంచానికి అవసరం లేదు. వాటిని ‘దేని కోసం’ ఉపయోగించాలో తెలిసిన మనుషులు కావాలి. 

నన్ను ఎవరైనా కెరీర్‌ సలహా అడిగితే, ఒకటే చెబుతుంటాను: కష్టపడి పనిచేయండి, కానీ అదృష్టం కూడా ముఖ్యం అని గ్రహించండి. కాలక్రమేణా నేను ఒక విషయాన్ని నమ్మడం మొదలు పెట్టాను. గొప్ప వ్యక్తులు తమ అదృష్టాన్ని తమంతట తామే సృష్టించుకునే మార్గాలను వెతుక్కుంటారు. అదృష్టం అంటే సరైన సమయంలో, సరైన స్థలంలో ఉండటమే కాదు. ఒక కష్టమైన పని చేయ డానికి రిస్క్‌ తీసుకోవడం. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం. మీకు తెలిసిన విషయాల హద్దులు దాటి కొత్త సమస్యలను ఎంచుకోవడం. మిమ్మల్ని మరింత మెరుగుపరిచే వ్యక్తుల మధ్య ఉండటం. ‘అవును.. మనం ఈ ప్రపంచాన్ని మార్చగలము’ అని నమ్మడం. మీరు ఎంచుకునే సమస్యల విషయంలో పెద్ద ఆశయాలు కలిగి ఉండండి. అన్నింటికంటే కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రండి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement