ఆగస్ట్ 17కు అలెక్స్ హేలీ రచన ‘రూట్స్’ ప్రచురితమై 50 ఏళ్లు
సందర్భం
1976 ఆగస్ట్ 17. సరిగ్గా యాబై సంవత్సరాల కింద. అమెరికన్ స్వాతంత్య్ర దినం (జూలై 4) ద్విశతాబ్ది వేడుకలు దేశమంతా అట్టహాసంగా జరిగి ఇంకా ఆరు వారాలు కాలేదు. ఆ రోజున ఒక పుస్తకం వెలువడింది. సుప్రసిద్ధ అమెరికన్ ప్రచురణ సంస్థ డబుల్ డే ప్రచురించిన పుస్తకం అది. పేరు రూట్స్– ద సాగా ఆఫ్ యాన్ అమెరికన్ ఫామిలీ. రచయిత ఆఫ్రికన్ అమెరికన్ బానిస సంతతి ఏడో తరానికి చెందిన అలెక్స్ హేలీ (1921–1992). ఆ పుస్తకంతో ఆయన ప్రపంచ సాహిత్యంలో విజయ పతాక ఎగరేశాడు. అమెరికా జిలుగు వెలుగుల వెనుక దాగిన అపారమైన అంధకారాన్నీ, అందవికారాన్నీ విప్పి చూపిన అత్యంత ప్రభావశీలమైన పుస్తకం అది. రెండు వందల సంవత్సరాల చరిత్రను తవ్వి తీసి, కొత్త చరిత్ర సృష్టించిన పుస్తకం అది.
ఇంతవరకూ విజేతలు రాసుకుంటూ వచ్చిన చరిత్రను సవాలు చేసి, తుడిచేసి, పరాజితుల చరిత్రను రంగస్థలం మీద ప్రవేశపెట్టిన పుస్తకం అది. వెలువడిన మొదటి సంవత్సరంలోనే అమెరికన్ మార్కెట్‌లో అరవై లక్షల ప్రతులు అమ్ముడైన ఈ పుస్తకం, ఇప్పటికి కనీసం నలబై భాషల్లోకి అనువాదమైంది. ఎన్ని కోట్ల ప్రతులు వెలువడ్డాయో లెక్కలేదు. వెండితెర మీద, బుల్లితెర మీద కోట్లాది మందిని ప్రభావితం చేసింది. ఇంగ్లిష్‌లో వెలువడిన నాలుగు సంవత్సరాల్లోనే తెలుగులోకి సహవాసి సంక్షిప్త అనువాదంతో, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణగా ‘ఏడు తరాలు’గా వెలువడి ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతున్నది.
అమ్మమ్మ చెప్పిన కుటుంబ కథ
మొట్టమొదట దీన్ని హిస్టారికల్ ఫిక్షన్ (చారిత్రక కల్పన) అనాలా, నాన్ ఫిక్షన్ (కాల్పనికేతర రచన) అనాలా అని చర్చ జరిగింది. అలెక్స్ హేలీ తన కుటుంబ చరిత్ర గురించి ఇంట్లో విన్న మౌఖిక ఆధారాల దగ్గర ప్రారంభించి, మూడు ఖండాలలో, అనేక చారిత్రక, ప్రభుత్వ పత్రాల, నౌకాయానాల లిఖిత ఆధారాల మీద పరిశోధన జరిపి దీన్ని రాశాడు. దొరుకుతున్న చారిత్రక సాక్ష్యాధారాలు భిన్నమైన కథనాన్ని చెపుతున్నాయని ఆ పుస్తకాన్ని ఖండించిన చరిత్ర కారులు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మరొక పక్క, దానిలో కొంత వాస్తవ చరిత్ర ఉన్నప్పటికీ, అది నవల అని, కాల్పనిక రచన అని అనేవాళ్లు కూడా ఉన్నారు.
స్వయంగా రచయిత దాన్ని ఒక కొత్త పేరుతో పిలిచాడు: అది ఫాక్ట్ (వాస్తవం), ఫిక్షన్ (కల్పన) కలిసిన ఫాక్షన్ అన్నాడు. పూర్తి వాస్తవమూ కాదు, పూర్తి కల్పనా కాదు, అద్భుత రసాయనిక సంయోజనంలో రెండూ కలగలిసిన వినూత్న రచనాశైలి. ఒక వ్యక్తి తన వంశ చరిత్రనూ, తన మూలాలనూ అన్వేషించడంలో చేసిన అపార కృషి ఫలితం. రెండు వందల సంవత్సరాల వలసవాద దుర్మార్గాన్ని కళ్లకు కట్టిన దస్తావేజు. ఒక మానవ మహా విషాద కథనం. గొప్ప మానవ సంబంధాల చిత్రణ. దుర్భేద్యమైన అవరోధాలను అధిగమించి మానవ సంకల్పం, మానవ శ్రమ, మానవ సృజనాత్మకత ఎలా విస్తరిస్తుందో సజీవంగా చూపే చారిత్రక–సామాజిక విశ్లేషణ. 
ఆఫ్రికన్ దేశం గాంబియాలో 1750లో ప్రారంభమై, 1970ల దాకా సాగిన 120 అధ్యాయాల రచనలో చివరి అధ్యాయాలలో అలెక్స్ హేలీ ఈ రచనకు తన ప్రేరణనూ,కృషినీ వివరించాడు. తన అమ్మమ్మ పదే పదే చెప్పిన తమ కుటుంబ కథలోని శకలాలను పట్టుకుని, కుటుంబ చరిత్ర రాయగలనా అనే ప్రశ్నతో ఈ 730 పేజీల ఉద్గ్రంథం తయార యింది. ఇది పురాతత్వ పరిశోధన వంటి ప్రయత్నం. పురాతత్వ పరిశోధకులు ప్రాచీన యుగ అవశేషాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు దొరికేవి కుండ పెంకులు మాత్రమే. పూర్తి కుండలు కూడా దొరకవు. కాని ఇతరేతర ఆధారాలతో పరిపుష్టం చేసుకుంటూ, ఆ కుండ పెంకు ఏ కుండలో భాగమో, ఆ కుండ ఏ శ్రమనుంచి ఉద్భవించిందో, ఏ సంస్కృతికి ప్రతిబింబమో, ఆ కుండను వాడిన మనుషుల సామూహిక జీవన విధానం ఏమిటో వివరించడానికి ప్రయత్నిస్తారు.
అలెక్స్ హేలీ చేసినది సరిగ్గా అటువంటి కృషి. నిజానికి ఆయన అప్పటికి పరిశోధకుడూ కాదు, రచయితగా కూడా సుప్రసిద్ధుడూ కాదు. తీరప్రాంత గస్తీ దళం ఉద్యోగిగా పనిచేస్తూ, ఏవో కొన్ని రచనలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత జర్నలిస్టు అయ్యాడు. అమెరికన్ ప్రముఖులు కొంద రిని ఇంటర్వ్యూ చేశాడు. నల్లజాతి ఉద్యమ నాయకుడు మాల్కోమ్ ఎక్స్ హత్య కావడానికి ముందు నాలుగు సంవ త్సరాల పాటు ఆయనను ఇంటర్వ్యూలు చేసి, ఆయన హత్య తర్వాత ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కోమ్ ఎక్స్ రాసి పేరు తెచ్చుకున్నాడు.
ఈ అక్షర కృషికి, పురాతత్వ పరిశోధన తోడయింది. చిన్నప్పటి నుంచీ అమ్మమ్మ సింథియా నుంచి విన్న విషయాలు రాయాలనుకున్నాడు. లండన్ మ్యూజియంలో ఒక ప్రాచీన లిపి పరిశోధన చూసి తానూ అటువంటి పరిశోధన చేయాలనుకున్నాడు. అమ్మమ్మకు సన్నిహిత బంధువు, అప్పటికి ఎనబైల్లో ఉన్న జార్జ్‌తో ప్రస్తావించి నప్పుడు, ‘‘అవును కుర్రాడా, ఆ ఆఫ్రికన్ తన పేరు కింటే అని చెప్పేవాడు. గిటార్‌ను కో అనేవాడు. నదిని కాంబీ బోలొంగో అనేవాడు. డోలు చెయ్యడానికి కర్ర కోసం అడవికి పోయినప్పుడు వాళ్లు ఎత్తుకొచ్చారనేవాడు’’ అందామె.‘కింటే ఎక్కడి నుంచి వచ్చాడో అన్వేషిస్తాను’ అని ఆమెకు మాట ఇచ్చాడు. ‘‘ఆ పని చెయ్యి. మీ అమ్మమ్మ, మన వాళ్లందరూ పై నుంచి చూస్తుంటారు’’ అని ఆమె ఇచ్చిన ప్రోత్సాహం ఈ రచనకు పునాది.
ఏడు తరాల కథ
గిటార్ వంటి సంగీత సాధనానికి మాండింకా భాషలో పేరు కో అని, కాంబీ బోలోంగో అంటే గాంబియా నది అని గుర్తించి గాంబియా వెళ్లాడు. మౌఖిక వంశచరిత్రా గాయకుల సహాయంతో నిజంగానే కింటా కుంటే అనే పదహారేళ్ల కుర్ర వాడిని ఎత్తుకుపోయి, ఓడలో అమె రికా తీసుకుపోయారని గుర్తించాడు. బానిసగా ఒక యజమానికి అమ్మబడిన కుంటా కింటే తిరగ బడ్డాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. పారిపోకుండా యజమానులు కాలు తెగనరికారు. అక్కడ వంట మనిషిగా ఉండిన బెల్‌ను పెళ్లి చేసుకుని కిజ్జీ అనే కూతురిని కన్నారు. యజమాని ఆ అమ్మాయిని మరొక యజమానికి అమ్మితే, కొత్త యజమాని కిజ్జీ మీద అత్యాచారం చేశాడు. అలా కోడి పందాల జార్జిగా పేరు తెచ్చుకున్న మూడో తరం వ్యక్తి పుట్టాడు. జార్జి– మెటిల్డాలకు పుట్టిన ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లలో ఒకరు అలెక్స్ హేలీ ముత్తాత, కమ్మరి టామ్, నాలుగో తరం. ఆయనకూ ఐరీన్‌కూ పుట్టిన సింథియా, ఐదో తరం, అలెక్స్ హేలీకి తమ కుటుంబ చరిత్ర చెప్పిన అమ్మమ్మ. ఆమె కూతురు బెర్తా, ఆ వంశంలో కాలేజీకి వెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి, అక్కడ కలుసుకున్న సైమన్ హేలీని పెళ్లి చేసుకుంది. ఆమె కొడుకు అలెక్స్ హేలీ. నెత్తురూ కన్నీళ్లూ కలిసిన ఏడు తరాల కథ ఇది.
యాబై సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విశిష్టతలు కనిపిస్తాయి. ఆఫ్రికన్ తెగల సాంస్కృతిక ఆచారాలు, నల్లవాళ్లను అసలు మనుషులు గానే గుర్తించని, ఓడల్లో పశువుల్లా, సరుకుల్లా ఎత్తుకువచ్చి, తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులకు, ముఖ్యంగా పత్తి పంటకు ఉపయోగించిన తెల్లవాళ్లు, హింస, తిరుగుబాట్లు, పారిపోయే ప్రయత్నాలు, తమ మౌఖిక చరిత్రను సంరక్షించుకున్న పద్ధతులు, స్వాతంత్య్రం నుంచి బానిసత్వానికీ, అక్కడి నుంచి మళ్లీ స్వాతంత్య్రానికీ ప్రయాణాలు, బానిస విముక్తి, ఆంతర్యుద్ధం... చరిత్ర, గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణ. ‘తన చరిత్ర తనె పఠించి భోరున ఏడ్చింది ధరణి, తన చరిత్ర తనె స్మరించి ఫక్కున నవ్వింది ధరణి’.
ఎన్. వేణుగోపాల్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


