స్వతంత్ర భారత మార్గదర్శకులు | Sakshi Guest Column Special Story On Independence and Freedom Struggle | Sakshi
Sakshi News home page

స్వతంత్ర భారత మార్గదర్శకులు

Aug 15 2026 2:52 AM | Updated on Aug 15 2026 2:52 AM

Sakshi Guest Column Special Story On Independence and Freedom Struggle

గతవారం అండమాన్, నికోబార్‌ దీవుల్లో పర్యటించినప్పుడు హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే గౌరవం నాకు లభించింది. అక్కడ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని స్మరించుకొని, నివాళులు అర్పించాను. నేతాజీ స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ 1943 డిసెంబర్‌ 30న భారత భూభాగంపై తొలిసారి మువ్వన్నెల జెండాను ఎగరవేసిన పవిత్ర భూమిపై నిలబడటం నా హృదయాన్ని కదిలించే అనుభవం. పసుంపోన్‌ ముత్తురామలింగ థేవార్‌ ఆహ్వానం మేరకు 1939 సెప్టెంబరులో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మదురైని సందర్శించిన విషయాన్ని ఈ సందర్భం నాకు గుర్తు చేసింది. 

డూ ఆర్‌ డై
జాతీయ స్మారకమైన సెల్యూలార్‌ జైలును సందర్శించడం కూడా నా పర్యటనలో మరో స్ఫూర్తిదాయకమైన సందర్భం. వీర్‌ సావర్కర్, యోగేంద్ర శుక్లా, బటుకేశ్వర్‌ దత్, సచ్ఛీంద్రనాథ్‌ సన్యాల్‌తో సహా ఎందరో భరతమాత వీరపుత్రులను వలసవాద శక్తులు ఇక్కడ బంధించాయి. స్వేచ్ఛగా, గౌరవంగా భారత్‌ మనుగడ సాగించాలనే లక్ష్యంతో ప్రాణాలర్పించిన వారి ధైర్యాన్నీ, వేదననూ, నేటికీ ఈ జాతీయ స్మారకం గోడలు ప్రతిధ్వనిస్తున్నాయి. 

క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, ఆగస్టు 9న అండమాన్‌ దీవుల్లో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. జాతిపిత మహాత్మాగాంధీ 1942లో ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించి ‘డూ ఆర్‌ డై’ అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని ఇచ్చారు. ఈ పిలుపుతో దేశ
వ్యాప్తంగా స్వాతంత్య్రం సాధించాలనే ఆకాంక్ష తీవ్రమైంది. తమ కాలంలో వలసవాద శక్తులతో పోరాడిన తరానికి ధన్యవాదాలు. వారి కారణంగానే ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ హక్కులతో జీవించే అదృష్టాన్ని పొందాం.

స్వాతంత్య్ర యోధుల ఘన చరిత్ర
ఉత్తరాన కశ్మీర్, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన గుజరాత్, తూర్పున అస్సాం... ఇలా అన్ని ప్రాంతాలకూ, నేపథ్యాలకూ, వయసులకూ చెందిన సమరయోధులూ, ధీరవనితలూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాటానికి శాశ్వత ప్రతీకగా నిలిచిన ఝాన్సీరాణి లక్ష్మీబాయి శౌర్యం, మంగళ్‌ పాండే ధైర్యం, ‘స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తాను’ అనే నినాదంతో దేశాన్ని జాగృతం చేసిన బాలగంగాధర తిలక్‌ నిర్భయ పిలుపు– ఇలా ప్రతిస్వరం స్వాతంత్య్రం దిశగా చేపట్టిన ప్రయా ణాన్ని బలోపేతం చేసింది.

తొలి స్వదేశీ నౌకారవాణా సంస్థను ప్రారంభించి వలస పాలన ఆర్థిక ఆధిపత్యాన్ని వి.ఒ.చిదంబరం పిళ్లై సవాలు చేశారు. యుద్ధభూమిలో మాత్రమే కాకుండా, వాణిజ్యంలోనూ స్వాతంత్య్ర పోరాటం సాగిందని ఆయన నిరూపించారు.  భగత్‌ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ విప్లవ కాంక్ష... స్వేచ్ఛా సాధనకు త్యాగం చేసేలా తరతరాలకూ స్ఫూర్తిగా నిలిచింది. ఈశాన్యంలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన జ్వాలను రాణి గైడిన్లియు రగిలించారు. అస్సాంలో అంచంచలమైన ధైర్యంతో జాతీయ పతాకాన్ని మోస్తూ, క్విట్‌ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ కనకలతా బారువా  ప్రాణాలను అర్పించారు. 

భగవాన్‌ బిర్సా ముండా, అనేక మంది ఇతర గిరిజన నాయకులు వలస పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన చారిత్రక పోరాటానికి నాయకత్వం వహించారు. మన చరిత్ర పుటల్లో పోరాట పటిమనూ, ధైర్యాన్నీ, పట్టుదలనూ ప్రదర్శించే అనేక గాథలున్నాయి. అసంఖ్యాకమైన వీరుల సమష్టి సంకల్పంతోనే భారతదేశ స్వాతంత్య్రం సాధ్యమైందని మనకు గుర్తు చేస్తాయి.

నేలకొరిగిన సమర కిశోరాలు
మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కోడి కాథ కుమరన్‌(పతాక రక్షకుడు కుమరన్‌)గా ప్రసిద్ధి చెందిన తిరుప్పూర్‌ కుమరన్‌కు నివాళి అర్పిస్తున్నారు. నా స్వస్థలమైన తిరుప్పూర్‌లో, స్వాతంత్య్ర పోరాట సమయంలో జాతీయ పతాకాన్ని కింద పడనీయకుండా పట్టుకొని మృత్యు ఒడిలోకి చేరారు. అందుకే ఆయనకు ఈ బిరుదు లభించింది. ‘స్వరాజ్యం మన జన్మహక్కు’ అనే పిలుపుతో ఆయన స్వాతంత్య్ర పోరాటంలో చేరారు. ‘దేశబంధు యూత్‌ అసోసియేషన్‌’ను ప్రారంభించారు.  గాంధీజీ సామాజిక సంస్కరణలకు కట్టుబడి, మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేశారు. ఆత్మనియంత్రణను అలవర్చుకోవాలని ప్రోత్సహిస్తూ, కల్లు దుకాణాల వద్ద పికెటింగ్‌లో పాల్గొన్నారు.

1932 జనవరి 10న జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కుమరన్‌ ఓ యాత్రకు నాయకత్వం వహించారు. ‘వందేమాతరం’ నినాదాలతో తిరుప్పూర్‌ వీధులు ప్రతిధ్వనించాయి. ఈ బృందంపై వలసవాద శక్తుల దాడిలో తలకు గాయమైన కుమరన్‌ వందే మాతరం అని నినదిస్తూనే జెండాను శరీరానికి హత్తుకొని ప్రాణాలర్పించారు. ఆయన వయసు కేవలం 27 ఏళ్లు. భగత్‌ సింగ్‌ (23), సుఖ్‌దేవ్‌ (23), రాజ్‌గురు (22), ఖుదీరామ్‌ బోస్‌ (18), కనకలతా బారువా (18), అనంత లక్ష్మణ్‌ కన్హేరే (19), వంచినాథన్‌ (25) లాంటి ఎందరో యువకులు స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులయ్యారు.

స్వాతంత్య్ర సంగ్రామంలో అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవను ప్రశంసిస్తున్నాను. అజ్ఞాత స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నాను. ఈ మహత్తర సందర్భంలో, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం. అచంచలమైన ధైర్యంతో పోరాడి, మన స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు మనం అర్పించగల సముచితమైన నివాళి ఇదే. జై హింద్‌! భారత్‌ మాతాకీ జై!
వ్యాసకర్త భారత ఉపరాష్ట్రపతి

 

సి.పి. రాధాకృష్ణన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement