breaking news
Alex Hale
-
చరిత్రను మార్చిన 'పరాజితుల చరిత్ర'
1976 ఆగస్ట్ 17. సరిగ్గా యాబై సంవత్సరాల కింద. అమెరికన్ స్వాతంత్య్ర దినం (జూలై 4) ద్విశతాబ్ది వేడుకలు దేశమంతా అట్టహాసంగా జరిగి ఇంకా ఆరు వారాలు కాలేదు. ఆ రోజున ఒక పుస్తకం వెలువడింది. సుప్రసిద్ధ అమెరికన్ ప్రచురణ సంస్థ డబుల్ డే ప్రచురించిన పుస్తకం అది. పేరు రూట్స్– ద సాగా ఆఫ్ యాన్ అమెరికన్ ఫామిలీ. రచయిత ఆఫ్రికన్ అమెరికన్ బానిస సంతతి ఏడో తరానికి చెందిన అలెక్స్ హేలీ (1921–1992). ఆ పుస్తకంతో ఆయన ప్రపంచ సాహిత్యంలో విజయ పతాక ఎగరేశాడు. అమెరికా జిలుగు వెలుగుల వెనుక దాగిన అపారమైన అంధకారాన్నీ, అందవికారాన్నీ విప్పి చూపిన అత్యంత ప్రభావశీలమైన పుస్తకం అది. రెండు వందల సంవత్సరాల చరిత్రను తవ్వి తీసి, కొత్త చరిత్ర సృష్టించిన పుస్తకం అది. ఇంతవరకూ విజేతలు రాసుకుంటూ వచ్చిన చరిత్రను సవాలు చేసి, తుడిచేసి, పరాజితుల చరిత్రను రంగస్థలం మీద ప్రవేశపెట్టిన పుస్తకం అది. వెలువడిన మొదటి సంవత్సరంలోనే అమెరికన్ మార్కెట్లో అరవై లక్షల ప్రతులు అమ్ముడైన ఈ పుస్తకం, ఇప్పటికి కనీసం నలబై భాషల్లోకి అనువాదమైంది. ఎన్ని కోట్ల ప్రతులు వెలువడ్డాయో లెక్కలేదు. వెండితెర మీద, బుల్లితెర మీద కోట్లాది మందిని ప్రభావితం చేసింది. ఇంగ్లిష్‌లో వెలువడిన నాలుగు సంవత్సరాల్లోనే తెలుగులోకి సహవాసి సంక్షిప్త అనువాదంతో, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణగా ‘ఏడు తరాలు’గా వెలువడి ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతున్నది. అమ్మమ్మ చెప్పిన కుటుంబ కథమొట్టమొదట దీన్ని హిస్టారికల్ ఫిక్షన్ (చారిత్రక కల్పన) అనాలా, నాన్ ఫిక్షన్ (కాల్పనికేతర రచన) అనాలా అని చర్చ జరిగింది. అలెక్స్ హేలీ తన కుటుంబ చరిత్ర గురించి ఇంట్లో విన్న మౌఖిక ఆధారాల దగ్గర ప్రారంభించి, మూడు ఖండాలలో, అనేక చారిత్రక, ప్రభుత్వ పత్రాల, నౌకాయానాల లిఖిత ఆధారాల మీద పరిశోధన జరిపి దీన్ని రాశాడు. దొరుకుతున్న చారిత్రక సాక్ష్యాధారాలు భిన్నమైన కథనాన్ని చెపుతున్నాయని ఆ పుస్తకాన్ని ఖండించిన చరిత్ర కారులు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మరొక పక్క, దానిలో కొంత వాస్తవ చరిత్ర ఉన్నప్పటికీ, అది నవల అని, కాల్పనిక రచన అని అనేవాళ్లు కూడా ఉన్నారు. స్వయంగా రచయిత దాన్ని ఒక కొత్త పేరుతో పిలిచాడు: అది ఫాక్ట్ (వాస్తవం), ఫిక్షన్ (కల్పన) కలిసిన ఫాక్షన్ అన్నాడు. పూర్తి వాస్తవమూ కాదు, పూర్తి కల్పనా కాదు, అద్భుత రసాయనిక సంయోజనంలో రెండూ కలగలిసిన వినూత్న రచనాశైలి. ఒక వ్యక్తి తన వంశ చరిత్రనూ, తన మూలాలనూ అన్వేషించడంలో చేసిన అపార కృషి ఫలితం. రెండు వందల సంవత్సరాల వలసవాద దుర్మార్గాన్ని కళ్లకు కట్టిన దస్తావేజు. ఒక మానవ మహా విషాద కథనం. గొప్ప మానవ సంబంధాల చిత్రణ. దుర్భేద్యమైన అవరోధాలను అధిగమించి మానవ సంకల్పం, మానవ శ్రమ, మానవ సృజనాత్మకత ఎలా విస్తరిస్తుందో సజీవంగా చూపే చారిత్రక–సామాజిక విశ్లేషణ. ఆఫ్రికన్ దేశం గాంబియాలో 1750లో ప్రారంభమై, 1970ల దాకా సాగిన 120 అధ్యాయాల రచనలో చివరి అధ్యాయాలలో అలెక్స్ హేలీ ఈ రచనకు తన ప్రేరణనూ,కృషినీ వివరించాడు. తన అమ్మమ్మ పదే పదే చెప్పిన తమ కుటుంబ కథలోని శకలాలను పట్టుకుని, కుటుంబ చరిత్ర రాయగలనా అనే ప్రశ్నతో ఈ 730 పేజీల ఉద్గ్రంథం తయార యింది. ఇది పురాతత్వ పరిశోధన వంటి ప్రయత్నం. పురాతత్వ పరిశోధకులు ప్రాచీన యుగ అవశేషాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు దొరికేవి కుండ పెంకులు మాత్రమే. పూర్తి కుండలు కూడా దొరకవు. కాని ఇతరేతర ఆధారాలతో పరిపుష్టం చేసుకుంటూ, ఆ కుండ పెంకు ఏ కుండలో భాగమో, ఆ కుండ ఏ శ్రమనుంచి ఉద్భవించిందో, ఏ సంస్కృతికి ప్రతిబింబమో, ఆ కుండను వాడిన మనుషుల సామూహిక జీవన విధానం ఏమిటో వివరించడానికి ప్రయత్నిస్తారు. అలెక్స్ హేలీ చేసినది సరిగ్గా అటువంటి కృషి. నిజానికి ఆయన అప్పటికి పరిశోధకుడూ కాదు, రచయితగా కూడా సుప్రసిద్ధుడూ కాదు. తీరప్రాంత గస్తీ దళం ఉద్యోగిగా పనిచేస్తూ, ఏవో కొన్ని రచనలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత జర్నలిస్టు అయ్యాడు. అమెరికన్ ప్రముఖులు కొంద రిని ఇంటర్వ్యూ చేశాడు. నల్లజాతి ఉద్యమ నాయకుడు మాల్కోమ్ ఎక్స్ హత్య కావడానికి ముందు నాలుగు సంవ త్సరాల పాటు ఆయనను ఇంటర్వ్యూలు చేసి, ఆయన హత్య తర్వాత ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కోమ్ ఎక్స్ రాసి పేరు తెచ్చుకున్నాడు. ఈ అక్షర కృషికి, పురాతత్వ పరిశోధన తోడయింది. చిన్నప్పటి నుంచీ అమ్మమ్మ సింథియా నుంచి విన్న విషయాలు రాయాలనుకున్నాడు. లండన్ మ్యూజియంలో ఒక ప్రాచీన లిపి పరిశోధన చూసి తానూ అటువంటి పరిశోధన చేయాలనుకున్నాడు. అమ్మమ్మకు సన్నిహిత బంధువు, అప్పటికి ఎనబైల్లో ఉన్న జార్జ్‌తో ప్రస్తావించి నప్పుడు, ‘‘అవును కుర్రాడా, ఆ ఆఫ్రికన్ తన పేరు కింటే అని చెప్పేవాడు. గిటార్‌ను కో అనేవాడు. నదిని కాంబీ బోలొంగో అనేవాడు. డోలు చెయ్యడానికి కర్ర కోసం అడవికి పోయినప్పుడు వాళ్లు ఎత్తుకొచ్చారనేవాడు’’ అందామె.‘కింటే ఎక్కడి నుంచి వచ్చాడో అన్వేషిస్తాను’ అని ఆమెకు మాట ఇచ్చాడు. ‘‘ఆ పని చెయ్యి. మీ అమ్మమ్మ, మన వాళ్లందరూ పై నుంచి చూస్తుంటారు’’ అని ఆమె ఇచ్చిన ప్రోత్సాహం ఈ రచనకు పునాది. ఏడు తరాల కథగిటార్ వంటి సంగీత సాధనానికి మాండింకా భాషలో పేరు కో అని, కాంబీ బోలోంగో అంటే గాంబియా నది అని గుర్తించి గాంబియా వెళ్లాడు. మౌఖిక వంశచరిత్రా గాయకుల సహాయంతో నిజంగానే కింటా కుంటే అనే పదహారేళ్ల కుర్ర వాడిని ఎత్తుకుపోయి, ఓడలో అమె రికా తీసుకుపోయారని గుర్తించాడు. బానిసగా ఒక యజమానికి అమ్మబడిన కుంటా కింటే తిరగ బడ్డాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. పారిపోకుండా యజమానులు కాలు తెగనరికారు. అక్కడ వంట మనిషిగా ఉండిన బెల్‌ను పెళ్లి చేసుకుని కిజ్జీ అనే కూతురిని కన్నారు. యజమాని ఆ అమ్మాయిని మరొక యజమానికి అమ్మితే, కొత్త యజమాని కిజ్జీ మీద అత్యాచారం చేశాడు. అలా కోడి పందాల జార్జిగా పేరు తెచ్చుకున్న మూడో తరం వ్యక్తి పుట్టాడు. జార్జి– మెటిల్డాలకు పుట్టిన ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లలో ఒకరు అలెక్స్ హేలీ ముత్తాత, కమ్మరి టామ్, నాలుగో తరం. ఆయనకూ ఐరీన్కూ పుట్టిన సింథియా, ఐదో తరం, అలెక్స్ హేలీకి తమ కుటుంబ చరిత్ర చెప్పిన అమ్మమ్మ. ఆమె కూతురు బెర్తా, ఆ వంశంలో కాలేజీకి వెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి, అక్కడ కలుసుకున్న సైమన్ హేలీని పెళ్లి చేసుకుంది. ఆమె కొడుకు అలెక్స్ హేలీ. నెత్తురూ కన్నీళ్లూ కలిసిన ఏడు తరాల కథ ఇది. యాబై సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విశిష్టతలు కనిపిస్తాయి. ఆఫ్రికన్ తెగల సాంస్కృతిక ఆచారాలు, నల్లవాళ్లను అసలు మనుషులు గానే గుర్తించని, ఓడల్లో పశువుల్లా, సరుకుల్లా ఎత్తుకువచ్చి, తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులకు, ముఖ్యంగా పత్తి పంటకు ఉపయోగించిన తెల్లవాళ్లు, హింస, తిరుగుబాట్లు, పారిపోయే ప్రయత్నాలు, తమ మౌఖిక చరిత్రను సంరక్షించుకున్న పద్ధతులు, స్వాతంత్య్రం నుంచి బానిసత్వానికీ, అక్కడి నుంచి మళ్లీ స్వాతంత్య్రానికీ ప్రయాణాలు, బానిస విముక్తి, ఆంతర్యుద్ధం... చరిత్ర, గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణ. ‘తన చరిత్ర తనె పఠించి భోరున ఏడ్చింది ధరణి, తన చరిత్ర తనె స్మరించి ఫక్కున నవ్వింది ధరణి’. ఎన్. వేణుగోపాల్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అంతులేని జాతి వివక్ష.. మూలాలను వెతుక్కుంటూ ఇంటిబాట..ఇక మాకు ఫ్రాన్స్ వద్దు..!
అలెక్స్ హేలీ ‘రూట్స్’. ఆఫ్రికా ఖండంలోని తనవారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లిన ఓ నల్లజాతి అమెరికన్ చరిత్ర. ఆ నవల వెనక 12 ఏళ్ల ఎడతెగని అన్వేషణ, అధ్యయనం, పరిశోధన ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లోని నల్లజాతీయులు కూడా అలాగే తమ మూలాలు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. అయితే వారు వెళ్తున్నది పరిశోధనల కోసం కాదు. కాస్త మెరుగైన భవిష్యత్తు వేటలో. ఫ్రాన్స్‌లో వారికి ఎదురవుతున్న తీవ్ర జాతి వివక్షే ఈ వలసలకు ప్రధాన కారణం. ఫ్రెంచివారి మితిమీరిన జాతీయవాదాన్ని భరించలేక ఫ్రాన్స్‌ను వీడుతున్న ఆఫ్రికన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగి, జీవితమంతా ఆ దేశంతోనే ముడిపడిందని అనుకున్న ఆఫ్రికన్లు కూడా అన్వేషిస్తూ ఈ జాబితాలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఫ్రాన్స్‌ను వీడుతున్న నల్లజాతీయుల సంఖ్య బాగా పెరిగింది. ప్రధానంగా సెనెగల్ వాసులు ఫ్రాన్స్‌ను వీడి స్వదేశీ బాట పడుతున్నారు. ముస్లిం దేశమైన సెనెగల్ పురాతన ఫ్రెంచ్ కాలనీ. సెనెగల్‌తో ఫ్రాన్స్ సంబంధాలకు మూడు శతాబ్దాల పై చిలుకు చరిత్ర ఉంది. 1960లో సెనెగల్‌కు రాజకీయ స్వాతంత్య్రం వచి్చనా వ్యాపారం, జాతీయ భద్రత, సైనిక ఒప్పందాలు, భాగస్వామ్య సాంస్కృతిక ప్రోత్సాహం తదితరాల రూపంలో ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. సెనెగల్ నుంచి వలస వెళ్లిన వారు ఫ్రాన్స్‌లో పలు రంగాల్లో స్థిరపడ్డారు. కానీ ‘ప్రత్యేక సంబంధం’ఇప్పుడు బీటలు వారుతోంది. పెరిగిన జాత్యాహంకార నేరాలు ఫ్రాన్స్‌లో నల్లజాతీయులపై నిర్వహించిన సర్వేలో ఏకంగా 91 శాతం మంది తాము జాతి వివక్షకు గురైనట్టు చెప్పుకొచ్చారు. 85% మంది చర్మం రంగు ఆధారంగా వివక్షకు గురయ్యారు. ఇది బహిరంగ స్థలాల్లో 41 శాతం, పని ప్రదేశాల్లో 31 శాతముంది. చర్మం రంగు వల్ల ఉద్యోగం నుంచి ప్రమోషన్ల దాకా నల్ల జాతీయులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాపరంగా కూడా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇల్లు కొనడం, అద్దెకు తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోయారు. ఒక్క గత ఏడాదిలోనే ఫ్రాన్స్‌లో జాత్యహంకార నేరాలు మూడింట ఒక వంతు పెరిగినట్టు అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 15,000 పై చిలుకు జాతి, మతాధార నేరాలు నమోదయ్యాయి. 2023 జూన్‌లో అల్జీరియా సంతతికి చెందిన నహెల్ మెర్జౌక్ (17) అనే టీనేజర్‌ను పోలీసులు కాలి్చచంపారు. వీటన్నింటి కారణంగా విద్యాధికులైన ఫ్రెంచ్ ఆఫ్రికన్ ముస్లింలు భారీ సంఖ్యలో నిశ్శబ్దంగా వలస బాట పట్టినట్టు పలు పరిశోధనల్లో తేలింది. అయితే వీరి సంఖ్య ఇదమిత్థంగా తెలియరావడం లేదు. జాతి, మతాధారిత గణాంకాల సేకరణపై ఫ్రాన్స్‌లో నిషేధమే ఇందుకు కారణం.మా విశ్వాసాలంటే చులకన 2015లో ఇస్లామిక్ ముష్కరులు పారిస్‌లో పలుచోట్ల దాడులకు పాల్పడ్డారు. వాటిలో ఏకంగా 130 దుర్మరణం పాలయ్యారు. నాటినుంచీ ఫ్రాన్స్‌లో ఇస్లామోఫోబియా తారస్థాయికి చేరింది. లౌకిక దేశమైన ఫ్రాన్స్‌లో హిజాబ్ ధారణ కూడా వివాదాస్పదంగా మారింది. దాన్ని 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వ స్కూళ్లలో నిషేధించారు. ఈ మార్పులు ఆందోళనకరమని కాంగో సంతతికి చెందిన ఆడ్రీ మొంజెంబా అనే టీచర్ తెలిపారు. ఆమె రోజూ తన చిన్న కుమార్తెతో కలిసి బస్సు, రైలు మారి స్కూలుకు వెళ్తుంది. అక్కడ బురఖా తీసేసి లోనికి వెళ్లాల్సి వస్తుంది. ఇటీవలే కుటుంబంతో పాటు సెనగల్లో స్థిరపడ్డారామె. ‘‘ఫ్రాన్స్ నాది కాదని అనుకోవడం లేదు. కానీ మా విశ్వాసాలను, విలువలను గౌరవించే వాతావరణంలో నేను, నా పిల్లలు ఎదగాలనేది నా ఆకాంక్ష’’అంటోంది 35 ఏళ్ల మొజెంబా. సెనెగల్‌కు చెందిన 34 ఏళ్ల ఫటౌమాటా సిల్లాదీ ఇలాంటి కథే. ‘‘మా కుటుంబానికి మెరుగైన జీవితం కోసం మా నాన్న ఆఫ్రికా వదిలి ఇక్కడికొచ్చారు. అయితే మూలాలను ఎన్నటికీ మరవొద్దని నిత్యం చెప్పేవారు. ఆ వారసత్వాన్ని నేను మరిచిపోలేదు. అందుకే ఈ వివక్షను భరించే బదులు సెనెగల్ తిరిగి వెళ్తున్నా. అక్కడ టూరిజం వ్యాపారం చేసుకుంటా’’అని ఆయన చెప్పుకొచ్చారు. వెంటాడుతున్న వివక్ష.. మెంకా గోమెస్దీ ఇదే కథ. వివక్షను తట్టుకోలేక ఫ్రాన్స్‌ను వీడి తమ మూలాలకు తిరిగి వెళ్లాలనుకుంటున్న ఆఫ్రికన్ల కోసం సెనెగల్‌లో ట్రావెల్ ఏజెన్సీనే ఏర్పాటు చేశారాయన. ‘‘నేను ఫ్రాన్స్‌లోనే పుట్టి పెరిగా. కానీ ఇక్కడ జాత్యహంకారం భరిచలేనంతగా పెరిగింది. ఆరేళ్ల వయసులో స్కూల్లో నన్ను ఎన్–వర్డ్ అని పిలిచేవారు. నేను ఫ్రెంచివాన్నే అయినా నా తల్లిదండ్రులు ఎక్కడి నుంచో రావడమే ఇందుకు కారణం. ఆ వివక్ష నీడలా వెంటాడుతూనే ఉంది. ఇక చాలనిపించింద. ఇ అందుకే కుటుంబాన్ని, స్నేహితులను అందరినీ విడిచి మరీ సెనెగల్ వెళ్లిపోతున్న. ఇక నా భవిష్యత్తంతా ఆఫ్రికాలోనే’’అని చెప్పుకొచ్చారు. పుట్టినప్పటి నుంచీ ఫ్రాన్స్‌లోనే గడిపిన ఫాంటా గుయిరాస్సీ కూడా తల్లి జన్మస్థలమైన సెనెగల్ వెళ్లే ఆలోచనలో ఉంది. ‘‘కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌లో రక్షణ లేదు. నా 15 కొడుకు వీధిలో స్నేహితులతో మాట్లాడుతుంటే పోలీసులు అవమానకరంగా తనిఖీ చేశారు. టీవీలో ఎప్పుడు చూసినా మాకు సంబంధించి ఏదో ఒక న్యూస్! ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వెంటాడుతోంది’’అన్నారామె.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రెండో టి20లో ఇంగ్లండ్ గెలుపు
చెస్టర్ లీ స్ట్రీట్: తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్ కొట్టిన దెబ్బ నుంచి ఇంగ్లండ్ తొందరగానే కోలుకుంది. అలెక్స్ హేల్స్ (61 బంతుల్లో 94; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత బ్యాటింగ్‌తో రెండో టి20లో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయ్యింది. రివర్సైడ్ మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన లంబ్ (27 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్సర్), హేల్స్ మెరుపు దాడితో ఆసీస్ బౌలర్లను బెంబేలెత్తారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్నిచ్చారు. తర్వాత వచ్చిన రైట్ (18 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్), మోర్గాన్ (11 బంతుల్లో 20; 2 సిక్సర్లు)లు కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో ఫవాద్ అహ్మద్ 3, ఫాల్క్‌నర్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసి ఓడింది. వార్నర్ (42 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. మాక్స్వెల్ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్సర్), బెయిలీ (13 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్) మినహా మిగతా వారు నిరాశపర్చారు. మార్ష్ (13), వార్నర్ మూడో వికెట్‌కు 67 పరుగులు జోడించినా ప్రయోజనం లేకపోయింది. డెర్న్‌బ్యాచ్ 3, బ్రిగ్స్ 2 వికెట్లు పడగొట్టారు. హేల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.


