ఐరోపా వలస సంక్షోభం | Sakshi Guest Column On European migration crisis | Sakshi
Sakshi News home page

ఐరోపా వలస సంక్షోభం

Aug 14 2026 12:22 AM | Updated on Aug 14 2026 12:22 AM

Sakshi Guest Column On European migration crisis

విశ్లేషణ

జూలై 30న మద్యధరా సముద్ర తీరంలో మొరాకో అంచున ఉన్న స్పానిష్‌ ఎన్‌క్లేవ్‌ స్యూటాలోకి ఒక్కసారిగా 50 వేల నుండి 60 వేల మంది మొరాకన్లు సము ద్రాన్ని ఈదుకుంటూ రావటం, సుమారు 72 మంది మృత్యువాత పడటం, స్పెయిన్‌ ఎమర్జెన్సీ ప్రకటించటం ఒక్కసారిగా సభ్యసమాజం ఉలిక్కిపడేలా చేసింది. గత సంవత్సర కాలం నుండి అమెరికాలో ‘ఐస్‌’ (ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ఏజెంట్లు వలస దారులపై చేస్తున్న దాడులు చర్చనీయాంశమయ్యాయి. స్వదేశంలో అంతర్యుద్ధాలు, పేదరికం, నిరుద్యోగ సమస్యల కారణంగా అనేక వేలమంది ప్రాణాలకు తెగించి ఏదో రకంగా ఐరోపా దేశాలకు చేరుకోవటానికి సాహసం చేస్తున్నారు. 

అటు అంతర్యుద్ధాలు ఇటు శ్రామిక కొరత
సిరియా, లిబియా, అఫ్గాన్, ఇరాక్, ఎరిట్రియాలలో అంతర్యు ద్ధాల వలన ఒక మిలియన్‌కు పైగా శరణార్థులు ఒక్కసారిగా 2015లో ఐరోపాలోకి ప్రవేశించారు. దీనిని 2015 ఐరోపా శరణా ర్థుల సంక్షోభంగా పేర్కొంటారు. ఈ శరణార్థుల చొరబాటు ప్రధా నంగా మూడు మార్గాల గుండా జరిగింది. 1. తూర్పు మద్యధరా సముద్రంలో టర్కీ నుండి గ్రీకుకు చెందిన లెస్‌బాస్, చియోస్‌ దీవుల గుండా ఐరోపాలోకి. 2. పశ్చిమ బాల్కన్‌ ప్రాంతంలో మెసడోనియా నుండి సెర్బియా, హంగరీ, క్రొయేషియాల గుండా జర్మన్, ఆస్ట్రియా, స్కాండినేవియా ప్రాంతానికి. 3. మధ్య మద్యధరా ప్రాంతంలో లిబియా నుండి ఇటలీగుండా ఐరోపాలోనికి. ఐరోపా దేశాల ఉదారవాద విధానాల వలన అక్రమ వలస దారులు ఒకసారి ఐరోపాలోనికి ప్రవేశిస్తే వారిని వెంటనే వెనక్కు పంపటం సాధ్యం కాదు. వీరి దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవటా నికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఐరోపా దేశాల సంక్షేమ పథకాల ఆలంబనతో వీరు ఏదోరకంగా ఐరోపాలో స్థిరపడుతుంటారు.

ఐరోపా దేశాలలో కనీసం 2.5 మిలియన్ల శ్రామికుల కొరత ఉన్నది. ఐరోపా జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. చౌక శ్రామిక శక్తి ఆవశ్యకతను గుర్తించి ఐరోపా దేశాలు వలసల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాయి. 2020 కంటే ముందు ఐరోపా దేశాలు శరణా ర్థులు, అక్రమ వలసదారుల ఎడల మెతక వైఖరిని అవలంభించాయి. ముఖ్యంగా జర్మనీ (ఆంజిలా మెర్కెల్‌ ప్రభుత్వం) కేవలం 2015లోనే 8.9 లక్షల శరణార్థులను అనుమతించింది. ఐరోపా దేశాలు అక్రమ వలసదారులను నియంత్రిస్తూ, వారిని క్రమంగా ఐరోపా సంస్కృతిలో విలీనం చేయాలనే సిద్ధాంతాన్ని అమలు పరచాయి. యూకే, నెదర్లాండ్స్, స్వీడన్‌ వంటి దేశాలు శరణార్థులు వారి సంస్కృతిని కాపాడుకోవటానికి సహాయం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్‌ మతబోధనల పాఠశాలల ఏర్పాటుకు కూడా సహకరించాయి. వీరికి పౌరసత్వం ఏర్పాటు చేశాయి. ఫ్రాన్స్‌ దీనికి విరుద్ధంగా ఫ్రెంచ్‌ భాషను తప్పనిసరి చేసింది. పాఠశాలలు, పబ్లిక్‌ ప్రదేశాలలో మతసంబంధ చిహ్నాలను నిషేధించింది. జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలు నైపుణ్యంగల వలస దార్లను మాత్రమే అనుమతించటానికి ప్రాధాన్యతనిచ్చాయి. పౌరసత్వ సదుపాయం కల్పించలేదు.

నియంత్రణల కసరత్తు
2020 తర్వాత ఐరోపా దేశాలలో ఉగ్రవాద చర్యలు, హింసా త్మక సంఘటనలలో వలసదారుల ప్రమేయం బయటకు రావటంతో ఐరోపా దేశాలు తమ విధానాలను పునస్సమీక్షించుకోవటం మొదలెట్టాయి. స్వీడన్‌లో గ్యాంగ్‌వార్స్, 2024లో యూకేలో దొమ్మీలు, 2023లో ఫ్రాన్స్‌లో అల్లర్లు, యూకేలో గ్రూమింగ్‌ గ్యాంగ్‌ లపై నివేదికలు వలసలను వ్యతిరేకించే రైట్‌వింగ్‌ రాజకీయ పక్షాలు బలోపేతమవటానికి దోహదం చేశాయి. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో సుమారుగా 6.4 కోట్ల మంది విదేశాలలో జన్మించినవారు. మొత్తం జనాభాలో వీరి వాటా సుమారు 13.3 శాతం. ప్రతి సంవత్సరం సుమారు 6.7 లక్షల శరణార్థులు వస్తున్నారు. ఇప్పుడు ఐరోపా దేశాలు దరఖాస్తులపై తుది నిర్ణయం తీసు కొనేవరకు ఐరోపా బయట వేరే దేశాలలో ఉంచే పథకాన్ని ప్రారంభించాయి. రువాండా, అల్బేనియా, ట్యునీషియాలో వీరిని క్యాంపు లలో ఉంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

వలసదారులకు స్థానిక భాష, సంస్కృతిపై అవగాహనను నిర్ధారించే పరీక్షలను తప్పనిసరి చేస్తున్నారు. స్కాండినేవియన్‌ దేశాలలో వలస వచ్చిన వారిని సంక్షేమ పథకాల నుండి మినహాయిస్తున్నారు. స్వీడన్‌లో శరణార్థులు నివసిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నేరా లతో సంబంధమున్న వారిని దేశం నుండి బహిష్కరిస్తున్నారు. భద్రతా కారణాలు, సాంస్కృతిక–రాజకీయ నేపథ్యంలో ఐరోపా దేశాలు వలసలను నియంత్రించటానికి ప్రయత్నించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వలసలను పూర్తిగా నిషేధిస్తే ఐరోపా ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు. ముఖ్యంగా హెల్త్‌కేర్‌ రంగంలో నర్సులు, డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, ఎల్డర్లీ కేర్‌ రంగాలలో తీవ్ర కొరత ఉన్నది. ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్‌ రంగాలలో డ్రైవర్లు, మెకానిక్‌లు, క్రేన్‌ ఆపరేటర్ల కొరత ఉన్నది. నిర్మాణ రంగంలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లకు కొరత ఉన్నది. 

ఇండియాకు ఐరోపా ద్వారాలు
ప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది తమ మాతృదేశాల నుండి వలస వెళ్లి ఇతర దేశాలలో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వీరి వాటా 3.7 శాతం. వీరంతా అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలకు చెందినవారు. ప్రధానంగా యూఎస్‌ఏ, కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియాలకు వలస వెళ్తున్నారు. ట్రంప్‌ రెండవసారి అధికారంలోకి వచ్చాక వలసల విషయంలో కఠినమైన వైఖరిని అనుసరిస్తున్నారు. భారత్‌ అక్రమ వలసలను, చొరబాట్లను ఏ రకంగానూ సమర్థించదు. అయితే చట్టబద్ధ వలసల విషయంలో ట్రంప్‌ వైఖరి భారత్‌ను ఒత్తిడికి గురిచేస్తున్నది. హెచ్‌1బీ వర్క్‌ వీసాలలో భారత్‌ వాటా 70 శాతం. హెచ్‌1బీ, గ్రీన్‌కార్డ్‌ వర్క్‌ వీసాల నిబంధనలతో బాటుగా అమెరికాలో జన్మించినవారికి లభించే పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసే యత్నాలు భారత్‌కు నిరాశను కలిగిస్తున్నాయి.

ఇవి ఒక రకంగా కొత్త అవకాశాలకు దారి తెరిచే అవకాశం ఉన్నది. 2023లో 9 లక్షలమంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్యకు వెళితే 2025లో 6.26 లక్షలమంది మాత్రమే విదేశీ విశ్వవిద్యాలయాల వైపు మొగ్గు చూపారు. వీరు కూడా యూఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ లేదా ఐరోపా విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటున్నారు. అమెరికా నుండి రివర్స్‌ బ్రెయిన్‌ డ్రెయిన్‌ సూచనలు కన్పడుతున్నాయి. అమెరికన్‌ కంపెనీలు భారత్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆఫ్‌ షోరింగ్‌ స్థానంలో ఆన్‌ షోరింగ్‌ ప్రారంభమవుతున్నది. 

భారతీయుల అమెరికన్‌ డ్రీమ్‌ చెదిరిపోయే తరుణంలో ఐరోపా ద్వారాలు తెరుచుకుంటున్నాయి. భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సంబంధాలలో వాణిజ్యాన్ని – వలసలను కలిపి ప్రతిపాదిస్తున్నది. ఇండియా – ఈయూ మొబిలిటీ పాక్ట్‌ (2026)పై ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత విద్యార్థుల వీసాలను ఫాస్ట్‌ట్రాక్‌ చేయటం, ఐరోపా విశ్వవిద్యా లయాలలో భారతీయ విద్యార్థులు కోర్సు ముగించిన తరువాత ఉద్యోగం వెతుక్కోవటానికి 12 నెలల వీసా అనుమతికి వీలున్నది. ముఖ్యంగా ఐటీ, ఇంజినీరింగ్, మానుఫాక్చరింగ్, గ్రీన్‌ ఎనర్జీ,హెల్త్‌ కేర్‌ రంగాలలో భారతీయులకు వర్క్‌ వీసాలకు ఐరోపా దేశాలు అనుమతిస్తాయి. అమెరికాలో వీసా నిబంధనల సమస్యల నేపథ్యంలో ఐరోపా వలస సంక్షోభం, ఘర్షణలు భారత్‌కు కలిసొచ్చాయనే చెప్పవచ్చు. బహుశా 2050 కల్లా ఐరోపా ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలలో భారతీయులు తమదైన ముద్రను వేసే అవకాశం ఉన్నది.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement