పోటాపోటీగా పొర్లు దండాలు..! | Chandrababu Bhogapuram Airport Credit Theft | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా పొర్లు దండాలు..!

Aug 2 2026 7:23 AM | Updated on Aug 2 2026 7:38 AM

Chandrababu Bhogapuram Airport Credit Theft

సాక్షిప్రతినిధి, విజయనగరం: హూ ఈజ్‌ మోదీ.. అయామ్‌ ఫాదరాఫ్‌ లోకేశ్‌.. నౌ టెల్‌ మీ.. హూ ఈజ్‌ మోదీ.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా.. గోద్రా నరహంతకుడు మోదీ దేశానికి ప్రధానిగా ఎలా పనికొస్తాడు అంటూ అప్పట్లో హూంకరించిన చంద్రబాబేనా ఈయన.. కొంపదీసి డూప్‌ చంద్రబాబు గట్రా స్టేజి మీద ఉన్నారా అని ఒక్క క్షణం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన జనానికి అనిపించింది. 

ఈ దేశానికి మోదీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది.. అసలు మోదీ  అవసరం దేశానికీ ఉంది.. ఆయన లేకపోతే దేశం లేదు.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలాంటి నాయకుడిని చూడలేదు అంటూ బాబు ఉన్నఫళంగా మోదీ దండకం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీని ఏదో మర్యాదకోసం... ప్రొటోకాల్‌ కోసం అభినందించడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు పూర్వకంగా రెండు మాటలు మాట్లాడడం సహజమే.. కానీ శనివారం చంద్రబాబు.. లోకేశ్‌.. పవన్‌ కల్యాణ్‌ ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ మోదీ భజన చేస్తుంటే... అసలు ఇది విమానాశ్రయ ప్రారంభమా ? మోదీ భజన కోసం ఇన్ని వేలమందిని తరలించారా అనే సందేహం అందరిలోనూ కలిగింది.    

లోకేశ్‌ చిడతల భజన  
చంద్రబాబు, పవన్‌ ఒక్కోరేంజిలో భజన చేయడంతో... ఇక లోకేశ్‌ కూడా తనవంతు పాత్ర గట్టిగానే పోషించేశారు. మోదీజీ విజన్‌.. చంద్రబాబు ఎగ్జిక్యూషన్‌ అంటూ పావుగంటసేపు చిడతలు వాయించేశారు. ఉన్న సమయమంతా మోదీని పొగడడానికి సరిపెట్టేశారు. రాష్ట్ర, దేశ ప్రగతికి మోదీ చేస్తున్న సేవలు.. ఆయన కృషి అంటూ మొదలెట్టి పలు పథకాలు.. రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెబుతూ మోదీజీకి జై అనేలా ప్రజలను బతిమాలి మరీ జై కొట్టించారు. వచ్చీరాని మాటలు, అర్ధంలేని ప్రసంగాలతో తనదైన ‘ముద్ర’ను ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ముగ్గురూ ఒకరిని మించి ఒకరు ప్రధానమంత్రి మోదీని ఉబ్బించేసి తాము ఉబ్బిపోయి వేదిక దిగిపోయారు.  

పవన్‌కు కన్నీళ్లు వచ్చేశాయి 
సముద్రం ఒకరి కాళ్లదగ్గర మోకరిల్లదు .. పర్వతం ఎవరికీ సలాం చేయదు అంటూ విప్లవ డైలాగులు చెప్పే పవన్‌ కల్యాణ్‌ సైతం ఈ రోజు పదిపన్నెండు మెట్లు దిగి మోదీకి భజన కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాల మీద యువత మోదీని తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చేశాయి అంటూ సెంటిమెంట్‌ పండించారు.

 మోదీని కొట్టేవాళ్లు దేశంలోనే లేరని, ఆయనకు నచ్చినన్నాళ్లు ప్రధాని పదవిలో ఉండచ్చని చెబుతూ ఆయనకు బోర్‌ కొడితే మాత్రమే పదవిని వదులుకోవాలన్నారు. అలాంటి ప్రధాని సారథ్యంలో పని చేయడం తనకు జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతుంటే... గతంలో మనం ఢిల్లీ వాళ్ల ముందు తలవంచుతామా ? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అంటూ గొంతు చించుకుని అరచిన పవన్‌ కల్యాణ్‌ జనానికి గుర్తొచ్చారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేస్తున్నందుకే మోదీజీకి ఈ నిందలు అంటూ పవన్‌ మ్రాన్పడిపోవడాన్ని చూసి సభికులు విస్తుపోయారు. నటనా చాతుర్యం బాగుందని కితాబిచ్చారు.

యువత దుమ్మెత్తిపోస్తుంటే...  
దేశవ్యాప్తంగా జెన్‌జీ యువత అటు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. నీట్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్ర«దాన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో మోదీ ప్రభ కాస్త మసకబారుతోందన్న సూచనలు సైతం సమాజంలోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలో కలుస్తుండడంతో ఈ అవకాశవాద చంద్రబాబును మోదీ పక్కనబెడతారు.. ఇక బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందన్న వెర్షన్‌ కూడా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు అత్యవసరంగా లోకేశ్‌ను సీఎంగా చేయాలన్న ఇంటిపోరు సైతం మొదలైంది. మోదీ అనుమతి లేకుండా లోకేశ్‌ను సీఎం చేయడంకుదరని పని. 

దీంతో అటు తృణమూల్‌ రూపంలో కేంద్రంతో తన ప్రాధాన్యాన్ని ముంచుకొచ్చిన ముప్పును తప్పించుకుంటూ ఇంకా మోదీకి విధేయత చూపడానికి బాబు ఎక్కడలేని తంటాలు పడ్డారు. మేకిన్‌ ఇండియా.. ఆత్మనిర్భర భారత్‌.. బులెట్‌ ట్రైన్, డిజిటల్‌ పేమెంట్స్‌.. రోడ్లు.. విమానాశ్రయాలు.. జాతీయ రహదారులు అంటూ పలు  ప్రాజెక్టులు, పథకాల పేర్లు చెబుతూ వెనువెంటనే మోదీమోదీ అంటూ అరవాల్సిందిగా బాబు సభికులకు ప్రాథయపడ్డారు. ఒకానొకదశలో బాబు పూనకం వచ్చినట్లు గొంతు చించుకుని మోదీమోదీ అని అరవడాన్ని చూసి వీఐపీ గ్యాలరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు.  ఉన్నఫళంగా ఈ స్థాయి పూనకానికి కారణం ఏమిటో అర్థంకాక ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. లోకేశ్‌ను సీఎంను చేసేందుకే ఇంత ప్రాపకమా అన్న విషయం తెలిసుకున్నాక ముక్కనవేలేసుకున్నారు.

సీఎం పవన్‌ సారథ్యం అవసరం: శ్రీనివాస వర్మ  
రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరం అని కేంద్ర పరిశ్రమల శాఖ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో దోహదపడుతోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘనత సాధించడానికి ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ఉప ముఖ్య మంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కాంబినేషన్‌ ఇలాగే ఉండాలని అభిలషించారు. 

పొరపాటున ఆయన ఇలా అన్నారేమో అనుకుని సభికులు కలవరపడ్డారు. ముఖ్యమంత్రి పవన్‌ అని కేంద్రమంత్రి అనగానే  జనంలోంచి కాస్త గుసగుసలు.. కేకలు, అరుపులు వినిపించాయి... కానీ కేంద్ర మంత్రి ఏకంగా రెండుమూడు సార్లు పవన్‌ను ముఖ్యమంత్రి అని, చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం వెనుక బీజేపీ నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మోదీ ఈయనతో ఇలా మాట్లాడించారా అనే గుసగుసలు వినిపించాయి.

రాష్ట్రమంత్రులకు నో మైక్‌  
విమానాశ్రయం ప్రారంభ వేదిక మీద కేవలం ప్రధాని మోదీ, లోకేశ్, పవన్‌ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రామ్మోహన్‌ నాయుడు మాత్రమే ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కానీ రాష్ట్ర మంత్రులు టీడీ జనార్దన్, జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్, హోం మంత్రి అనితకు మైక్‌ దక్కలేదు. ఆఖరుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా  ప్రసంగించేందుకు అవకాశం దక్కలేదు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ , గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు సైతం వేదిక మీద ఆసీనులయ్యారే తప్ప మాట్లాడేందుకు మైక్‌ అందలేదు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement