సాక్షి, విశాఖ: మోంథా తుపాను(Cyclone Montha) ప్రభావంతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రవాణా వ్యవస్థపైన కూడా ప్రభావం చూపింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటికే పలు విమాన సర్వీసులు నిలిచిపోగా.. తాజాగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ కాకుండానే తిరిగి వచ్చేసింది.
వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరింది. ఈ క్రమంలో విశాఖలో ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ కాలేదు. దీంతో, ఎయిర్‌పోర్టు అధికారులు విమానాన్ని తిరిగి హైదరాబాద్‌కు పంపారు. అనంతరం, హైదరాబాద్ విమానం సేఫ్‌గా ల్యాండింగ్ అయ్యింది. ఈ క్రమంలో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు.. విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. మోంథా తుపాను (Cyclone Montha) ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. రద్దయిన వాటిలో విశాఖపట్నం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 3 విమానాలు ఉన్నాయి.


