1.38 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక నివేదిక
తక్షణ సాయం చేయాల్సిందిగా వినతి
ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు బృందాలను పంపండి
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నివేదన
సాక్షి, అమరావతి: మోంథా తుపాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. 17 శాఖలు, రంగాలలో రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. పూర్తిస్థాయిలో వివరాలు వస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఈ నివేదిక పంపారు. తక్షణ ఆర్థిక సాయం చేయాలని కోరారు.
ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని, 1.38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని 2.96 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని, 1.74 లక్షల మంది రైతులు రూ.829 కోట్ల వరకు నష్టపోయినట్లు వివరించారు. 249 మండలాల్లోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై ప్రభావం ఉందని, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరారు. 12,215 హెక్టార్లలో రూ.40 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతినగా 23,979 మంది రైతులకు నష్టం వాటిల్లిందని, ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లోని రూ.514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారని తెలిపారు. 2,261 పశువులు మృతిచెందాయన్నారు. 2,817 విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా, 429 కి.మీ. మేర తీగలు తెగిపడ్డాయి.
ఈ శాఖకు రూ.19 కోట్ల నష్టం జరిగింది. నీటి పారుదల శాఖకు రూ.234 కోట్ల మేర నష్టం కలిగింది. 23 జిల్లాలలోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంగన్వాడీలు, పాఠశాలలు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, చేనేత మగ్గాలు అన్నీ కలిపి రూ.122 కోట్ల నష్టం వాటిల్లింది.
బాగా దెబ్బతిన్న రోడ్లు.. మృతులు ముగ్గురు
రోడ్లు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుపానుతో ముగ్గురు చనిపోయారని వెల్లడించారు. 4,794 కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు, 311 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని, రూ.2,774 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు.
18 జిల్లాల్లోని 862 కి.మీ. మేర పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు పాడవడంతో రూ.454 కోట్ల నష్టం జరిగిందని, 48 పట్టణాల్లోని రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని, వీటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు కావాలని నివేదికలో వివరించారు.


