మోంథా తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది. వర్షం, చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వర్షంలో తడవడం వల్ల జలువు, జ్వరం గొంతు నొప్పి లాంటి వ్యాధులు ముసిరే అవకాశం ఉంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అలాంటి జాగ్రత్తలు కొన్ని చూద్దాం.
చలికాలంలో ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
చలిగాలులు అనేక రకాల వ్యాధులను మోసుకొస్తాయి. వైరస్‌లు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు ఇన్‌ఫెక్షన్స్, గతంలో కీళ్ల నొప్పులు ఉన్నవారిలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కనీస జాగ్రత్తలు
వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి.
రెయిన్ కోట్లు, గొడుగులు, చలికి తట్టుకునేలా స్వెట్లర్లు, చెవులు కవర్ అయ్యేలా టోపీలు తప్పనిసరిగా వాడాలి.
ఒకవేళ వర్షంలో తడిచినా, వెంటనే వేడినీటితో స్నానం చేయడం, జుట్టు తడిలేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవడం తప్పనిగా పాటించాలి.
చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది.
చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది.
ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ఇన్‌హేలర్లను అందుబాటులోఉంచుకోవాలి.
ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి ఆహారం కాకుండా, అప్పటికప్పుడు వండుకున్నది వేడి, వేడిగా భుజించాలి.
చల్లని డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలకు పిల్లల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది.
నిల్వ పదార్థాలను జోలికి వెళ్లవద్దు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.
వ్యాధి నిరోధకశక్తి పెంచుకునేలా
చలికాలంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యేలా జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తుండాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పనీర్ లాంటివి తీసుకోవాలి.
అలాగే ఈ చలిగాలులు చర్మాన్ని, జుట్టును కూడా ఇబ్బంది పెడతాయి. వాతావరణం చల్లగా ఉన్నా గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ, చర్మంపైన ఉండే నూనె పొరను కాపాడుకునేలా మంచి మాయిశ్చరైజర్‌ను వాడాలి.
ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ సార్... లీవ్ ప్లీజ్! వైరల్ మెయిల్


