రేపు వరంగల్‌కు సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Orders Strict Action for Negligence in Telangana Paddy Procurement | Sakshi
Sakshi News home page

రేపు వరంగల్‌కు సీఎం రేవంత్‌

Oct 30 2025 12:46 PM | Updated on Oct 30 2025 1:41 PM

CM revanth Reddy Key Orders To Collectors Over Paddy Purchase

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతీ ఒక్కరు ఫీల్ట్‌లో ఉండాల్సిందే.. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రేపు వరంగల్‌, హుస్నాబాద్‌లో పర్యటించనున్నట్టు తెలిపారు. 

తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ వేముల శ్రీనివాసులు, డీజీపీ శివధర్ రెడ్డి, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అధికారులపై చర్యలుంటాయ్‌.. 
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..‘అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలి. ప్రతీ కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలి. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గర లోని ఫంక్షన్స్ హాల్స్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతీ 24 గంటల పరిస్థితిపై ప్రతిరోజు కలెక్టర్‌కు రిపోర్ట్ అందించాలి. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానీటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయాలి. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలి. 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై ముందస్తు చర్యలు తీసుకున్నా. ఇది వరి కోతల కాలం.. అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరి సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి. అవసరమైన చోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి

హైడ్రా సేవలు వినియోగించుకోండి.. 
వరంగల్‌లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను వినియోగించుకోవాలి. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలి. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు కలెక్టర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత జిల్లా ఇంచార్జ్ మంత్రికి తెలపాలి. వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదు

రేపు వరంగల్‌, హుస్నాబాద్‌ పర్యటన.. 
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ్టి వరంగల్ ఆకస్మిక పర్యటన వాయిదా వేసుకున్నా. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తా. తుఫాను ప్రభావిత జిల్లా ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement