 
													టెక్నాలజీతో తుపాన్‌ను ఎదుర్కొన్నాం
16 నెలల్లో టెక్నాలజీ వ్యవస్థను తయారు చేశాం
రాష్ట్రంలో వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించాం
కానీ, వర్షాలు అక్కడ కాకుండా వేరేచోట కురిశాయి
కాకినాడ దగ్గర అనుకుంటే... వేరేచోట తీరం దాటింది
మోంథా బీభత్సం వల్ల ప్రాథమిక నష్టం రూ.5,265.51 కోట్లు
పంట నష్టం అంచనాకు ఐదారు రోజులు సమయం పడుతుంది
కేంద్రానికి త్వరలోనే నివేదిక: మీడియాతో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఉపగ్రహ చిత్రాలతో మోంథా తుపాన్ పరిస్థితిని అంచనా వేశామని, భారీవర్షాలు, గాలుల తీవ్రతపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని టెక్నాలజీలను అనుసంధానించి రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో మోంథా కదలికలను పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని తెలిపారు. కానీ, వర్షాలు అక్కడ కాకుండా వేరేచోట కురిశాయన్నారు. ఓ విధంగా మోంథా దాగుడుమూతలు ఆడిందన్నారు.
తుపాన్‌ను టెక్నాలజీ సాయంతో ఎలా ఎదుర్కొన్నామనే అంశాన్ని గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వివరించారు. ‘‘మెరికాలో సంక్షోభం వస్తే మేనేజ్ చేయలేరు. తుపాన్లు వచ్చినా ఎదుర్కోలేరు. మనం 16 నెలల్లో టెక్నాలజీ వ్యవస్థను తయారు చేశాం. దానిని వినియోగించి అద్భుతంగా ఎదుర్కోగలిగాం. ఏ రిజర్వాయర్లో, ఏ చెరువులో ఎంత నీరుందో గుర్తించాం.
ఎక్కడెక్కడ పెద్దఎత్తున ప్రవాహాలు వస్తాయో ఊహించి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేశాం. మరణాలు, ఆస్తి నష్టం బాగా తగ్గించాం. వరద నీటితో పాటు పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాం. గతంలో తుపాన్ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండేది కాదు’’ అని వివరించారు. ‘‘మోంథా బీభత్సం సృష్టించింది. కాకినాడ దగ్గర ఊహిస్తే వేరేచోట తీరం దాటింది. ఇక్కడినుంచి తెలంగాణ వెళ్లింది.
వరంగల్‌లో ఒకేసారి 43 సెంటీమీటర్లు వర్షం పడింది. రాష్ట్రంలో మోంథా కారణంగా రూ.5,265.51 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. పూర్తిస్థాయిలో అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తాం’’ అని తెలిపారు. పంటలకు రూ.829 కోట్లు, ఉద్యాన రంగంలో రూ.39 కోట్లు, సెరీకల్చర్‌కు రూ.65 కోట్లు, ఆక్వా రంగంలో రూ.1,270 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.109 కోట్లు, జల వనరుల విభాగంలో రూ.207 కోట్లు, పంచాయతీరాజ్ రూ.8 కోట్లు, విద్యుత్ శాఖ రూ.16 కోట్లు, పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం వాటిల్లిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఎదురుచూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి నెల, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు.

వరి తినేవారు ఉండరు..
టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య రంగంలో రూ.4, 5 వేల కోట్లు, సాగు నీటి  ఎత్తిపోతల విద్యుత్ చార్జీల్లో రూ.8 వేల కోట్ల బడ్జెట్ తగ్గిస్తామని చంద్రబాబు తెలిపారు. ‘‘ఉపగ్రహం ద్వారా పంట ఉత్పత్తి అంచనా వేస్తాం. దానిప్రకారం మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. రైతులు ఖరీఫ్, రబీలోనూ వరి పంటనే వేస్తున్నారు. వరి తినేవారు ఉండరు. డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే లాభసాటి. ఈ ఖరీఫ్‌లో 37 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాం’’ అని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
