సమర్ధతను నిరూపించుకున్నట్లు బిల్డప్
అంతా లోకేష్ చేసినట్లు ఎల్లో మీడియా హైప్
త్వరలో సీఎం పీఠంపై ప్రతిష్టాపన.
రాష్ట్రాన్ని మోంథా తుపాను వణికించింది. రైతులను, మత్స్యకారులను ఇతర చిరు జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నాలుగైదు రోజులు ప్రజలు ఇళ్ళకే పరిమితమైపోయి గుమ్మం దాటి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ అధికారులు సైతం తమ స్థాయిల్లో శ్రమించి తుపాను నష్టాన్ని.. కష్టాన్ని తగ్గించడానికి కృషి చేశారు.
అయితే, ఈ మొత్తంలో మోంథా తుఫానుపై ప్రభుత్వ సహాయ చర్యలు.. నష్ట నివారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తదితర అంశాలు అన్ని లోకేష్ బాబుకు ఉపకరించేలా ఉన్నాయి. అటు లోకేష్, చంద్రబాబు ఇద్దరు కూడా తుపాను నష్టాన్ని తగ్గించడంలో తీవ్రంగా కృషి చేశారు అని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివిధ శాఖల అధికారులు, మంత్రులను ఆదేశిస్తూ సమన్వయపరుస్తూ లోకేష్ అత్యద్భుత పనితీరు కనబరిచారని తెలుగుదేశం నాయకులతో పాటు అధికార యంత్రాంగం సైతం సర్టిఫికెట్లు ఇస్తూ వస్తోంది.
అంటే రాష్ట్రంలో తుపాను నష్టాన్ని తగ్గించడంలో చంద్రబాబు కన్నా లోకేష్ మరింత సమర్థవంతంగా పనిచేశారు అనేది తెలుగుదేశం వాదన. ఇది వాదన కాదు లోకేష్ బాబుకు స్థాయికి నుంచి ఎలివేషన్లు ఇస్తూ ఆయన సామర్ధ్యాన్ని ప్రజల్లోకి మరింత గొప్పగా తీసుకువెళ్లడానికి టీడీపీతో పాటు దాని అనుబంధ మీడియా సోషల్ మీడియా వ్యవస్థలకు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. క్యాబినెట్‌లో కేవలం ఒక మంత్రిగా ఉన్న లోకేష్ అన్ని శాఖలను సమన్వయపరుస్తున్నారని వివిధ శాఖలపై అవగాహన పెంచుకొని ఆ మంత్రులను సైతం కమాండ్ చేస్తూ మార్గదర్శకునిగా నిలబడ్డారని టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పటికే ఎలివేషన్లు ఇస్తుంది. తెలుగుదేశం నాయకులు, మంత్రులు కూడా లోకేష్ సామర్థ్యాన్ని గొప్పగా చెబుతూ ఆయనకు తిరుగులేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
లోకేష్ ప్రాక్టీస్ కోసం మోంథా సహాయ చర్యలు..
వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వ కాలంలోనే అంటే 2029 ఎన్నికలలోపే లోకేష్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాలన్నది చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి అభీష్టంగా కనిపిస్తున్నది. దీనికి సపోర్టివ్ అన్నట్లుగా ఇప్పటికే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం లోకేష్ బాబుకు ఎనలేని ప్రాధాన్యమిస్తూ చంద్రబాబు సమక్షంలోనే చినబాబును ముఖ్యమంత్రిగా చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే లోకేష్ సత్తాను, సమర్ధతను చాటుకోవడానికి ఈ తుఫాను సహాయ చర్యలు.. ముందస్తు ఏర్పాట్లు.. ప్రజలకు పునరావాస కల్పన.. విద్యుత్ పునరుద్ధరణ.. వంటి పనులన్నీ లోకేష్ సునాయాసంగా చేసేసినట్లుగా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.
అంటే ఈ విపత్తు.. లోకేష్‌కు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉపయోగపడిందని టీడీపీ భావిస్తోంది. ఇక, ఆయన అన్ని పనులు చేసేయగలుగుతున్న నేపథ్యంలో లోకేష్‌ను ఇక ముఖ్యమంత్రిగా చేసేయాల్సిందే అన్నట్లుగా డిమాండ్లు వస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ బాగా చేసి బ్రహ్మాండమైన పనితీరు కనబరుస్తున్నందున ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.
మరోవైపు.. మోంథా తుఫాను రైతులను, ఇతర ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన లోకేష్‌కు మాత్రం ప్రయోజన కార్యగా మారిందని.. ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆ ఉత్పాతం ఒక అవకాశంగా మారిందని తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే లోకేషను ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాల్సిందే అన్నట్లుగా ఎలివేషన్లు ఇస్తున్నారు. దీనికి జనసేనాని పవన్ కళ్యాణ్, కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏమంటారో చూడాలి.
-సిమ్మాదిరప్పన్న.


