కోతదశకు చేరుకున్న పంటపై దిగులు
ఈదురుగాలులతో నేలకొరుగుతున్న పైరు
ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం
సాక్షి, అమరావతి: ధాన్యం రైతు గుండెల్లో ‘మోంథా’ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు కోతదశకు చేరుకున్న పంటచేలు నేలకొరిగాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరికంకులు దెబ్బతింటున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరాన్ని తాకిన ఈ తుపాను ప్రభావం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తాం«ధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తుపాను తర్వాత దాదాపు మూడురోజులు కురిసే వర్షాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో పంటలపై ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా వరితోపాటు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పెసర పంటలకు అపారనష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 72.87 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగవగా, అందులో 38.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
సాగైన వరి విస్తీర్ణంలో దాదాపు 31.14 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇందులో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంట తీవ్ర ప్రభావానికి గురవుతుందని వ్యవసాయశాఖ ముందస్తు అంచనా వేసింది. ఇతర పంటలన్నీ కలుపుకొంటే 20 లక్షల ఎకరాల్లో పంటలపై తుపాను ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
దిగుబడులపై ప్రభావం
తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో వరిపైరు తీవ్రంగా దెబ్బతింటుంది. ముంపునీరు దిగిపోయిన తర్వాత సత్వర యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ తుపాను ప్రభావం దిగుబడులపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎకరాకు కనీసం 5 నుంచి 8 బస్తాలు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ధాన్యం రంగుమారడం, తేమశాతం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే మొలకలొచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.
బిహార్ ఎన్నికల విధుల్లో వ్యవసాయశాఖ డైరెక్టర్
వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ బిహార్‌లో ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లారు. గతంలో ఉన్నతాధికారులు ఎన్నికలతోపాటు ఇతర సేవల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వారి బాధ్యతలను ఇతర అనుబంధ శాఖల అధికారులకు అప్పగించేవారు. ఇప్పుడు వ్యవసాయశాఖ డైరెక్టర్ బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు. దీంతో లాగిన్స్ అన్నీ ఆయన వద్దే ఉన్నాయి. విపత్తు వేళ ఆ శాఖలో విభాగాధిపతులు ప్రతి చిన్న విషయాన్ని బిహార్‌లో ఉన్న డైరెక్టర్‌కి ఫోన్ ద్వారా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.


