 
													చేతికొచ్చిన పంట నీటిపాలు
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, పాలమూరు, ఖమ్మంలో భారీ నష్టం
వ్యవసాయ శాఖ పంట నష్టం ప్రాథమిక అంచనా 4.47 లక్షల ఎకరాలు
సాక్షి, నెట్‌వర్క్: మోంథా తుపాను రాష్ట్రంలో అన్నదాతను నిండా ముంచింది. భారీ వర్షాలు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు సిద్దిపేట జిల్లాలోనూ దాదాపు 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. సవివరంగా పంట నష్టాన్ని అంచనా వేస్తే మరో రెండు లక్షల ఎకరాలు పెరగొచ్చని చెబుతున్నారు.
ప్రాథమిక అంచనా ప్రకారం వరి పంట 2,82,379 ఎకరాలు, పత్తి 1,51,707 ఎకరాలు, మొక్కజొన్న 4,963 ఎకరాలు, మిరప 3,613 ఎకరాలు, పప్పుధాన్యాలు 1,228 ఎకరాలు, వేరుశనగ పంట 2,674 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. దాదాపు 2,53,033 రైతులు పంటలు నష్టపోయినట్లు చెబుతున్నారు.
నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం
కరీంనగర్ జిల్లాలో 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి 2,82,379 ఎకరాల్లో, పత్తి 1,51,707, మొక్కజొన్న 4,963, మిర్చి 3,613, వేరుశనగ 2,674, పప్పుదినుసు పంటలు 1,228, ఉద్యానవన పంటలు 1,300 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. 
పెద్దపల్లి జిల్లాలో 196 మంది రైతులకు చెందిన 271 ఎకరాల్లో వరి, జగిత్యాల జిల్లాలో 19,128 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ తెలిపారు. ఇందులో 17,982 ఎకరాల్లో వరి, 1146 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని వివరించారు.
నష్టం లక్ష ఎకరాలపైనే..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోంథా తుపాను రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. 46,299 మంది రైతులకు చెందిన 1,27,156 ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో 30,359 మంది రైతులకు సంబంధించిన 61,511 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 310 గ్రామాల్లో 35,487 ఎకరాల్లో వరి, 25,919 ఎకరాల్లో పత్తి, 105 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. సూర్యాపేట జిల్లాలో 21,107 మంది రైతులకు చెందిన 64,939 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇందులో వరి 54,006 ఎకరాలు, పత్తి 10,933 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. 
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 54 గ్రామాల్లో 430 మంది రైతులకు చెందిన 706.30 ఎకరాల వరి పంట 33 శాతం వరకు దెబ్బతింది. నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెల కావస్తున్నా ఇంతవరకు వేగంగా కొనుగోళ్లు సాగడం లేదు. జిల్లాలో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వానాకాలం సీజన్‌లో కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇంతవరకు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.
వరంగల్ జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో నష్టం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,29,228 మంది రైతులకు చెందిన దాదాపు 2 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే 80,500 మంది రైతులకు చెందిన 1,30,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లాలో 34,820 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. జనగామ జిల్లాలో 25,796 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.  
సంగారెడ్డి జిల్లాలో 5,500 ఎకరాల్లో నష్టం
సంగారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన వర్షానికి సుమారు 5,500 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనావేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లాలో సుమారు 250 ఎకరాల వరకు పత్తి, వరికి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. 
మంచిర్యాల జిల్లాలో వరి, పత్తి పంటలకు అధికంగా నష్టం జరిగింది. 3,351 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పత్తికి నష్టం వాటిల్లింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 36,970 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఖమ్మంలో 66 వేల ఎకరాల్లో పంట నష్టం
ఖమ్మం జిల్లాలో 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో వరి, పత్తి, పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,124 మంది రైతులకు చెందిన 4,452 ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయని గుర్తించారు. సిద్దిపేట జిల్లా  పంట నష్టం వాటిల్లింది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో వరద నీరు నాలుగు అడుగుల మేర పారటంతో ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లాలో 88 మెట్రిక్ టన్నుల ధాన్యం వరదకు కొట్టుకపోయిందని గుర్తించారు.
ఎకరాకు రూ.10 వేల పరిహారం: మంత్రి తుమ్మల
మోంథా తుపాన్ కారణంగా ఇళ్లు, పశువులు, పంటలతో పాటు ఇతర ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాలు వచ్చాయని, కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రమే ఎకరాకు రూ.10 వేల పరిహారం చెల్లిస్తుందని మంత్రి ప్రకటించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తుమ్మల తెలిపారు. 
తల్లడిల్లిన తారవ్వ
ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే మురికి కాల్వలోకి కొట్టుకుపోవటంతో మహిళా రైతు తారవ్వ బోరున విలపించింది. హుస్నాబాద్ వ్య వసాయ మార్కెట్‌కు పది ట్రాక్టర్ల వడ్లను హుస్నాబా ద్ మండలం పోతారం (ఎస్) గ్రామానికి చెందిన కేడిక తారవ్వ తీసుకువచ్చింది. భారీ వర్షానికి దాన్యమంతా మురికి కాల్వలోకి కొట్టుకుపోయింది. మార్కెట్‌కు వచ్చిన కలెక్టర్ కాళ్ల మీద పడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాధేయపడింది. 
కష్టమంతా నీటి పాలు 
ఈమె పేరు నేనావత్ బుజ్జి, నల్లగొండ జిల్లా చందంపేట మండలం నక్కలగండి తండాలో తనకున్న ఐదెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగుచే సింది. పత్తి చేతికందే సమయంలో మోంథా తుపాన్ కారణంగా నీటిపాలైందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రూ.2.50 లక్షల వరకు తాను పెట్టిన పెట్టుబడి నష్టపోయానని, ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతోంది.

అప్పే మిగిలింది
పది ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. పెట్టుబడి రూ.2.50 లక్షలు కాగా, కౌలు కోసం రూ.1.65 లక్షలు చెల్లించాల్సి ఉంది. అంతా బాగుంటే అప్పులు, పెట్టుబడి పోగా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని అనుకున్నా. కానీ అకాల వర్షంతో వరి పంట మొత్తం నీరు నిలిచింది. మాయదారి వాన నా కడుపు కొట్టింది.  – పచ్చిపాల రవి, సుర్దేపల్లి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా

పంట నష్టపోయి.. రైతు ఆత్మహత్య
లింగాపూర్ (ఆసిఫాబాద్): మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. లింగాపూర్ మండలం సీతారాంనాయక్ తండాకు చెందిన జాదవ్ బలిరాం (59) ఎనిమిది ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. 
బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చేను చూసేందుకు వెళ్లాడు. భారీ వర్షానికి పంటలు దెబ్బతినడంతో అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు సిర్పూర్(యూ) ఆస్పత్రికి.. అనంతరం పరిస్థితి విషమించడంతో ఉట్నూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
