మోంథా తుపాను నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
పత్తి, ధాన్యం విక్రయ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి
రైలు ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అధిక ప్రభావం
అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. వరి కోతల సమయం,.. పలుచోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మోంథా ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అధికంగా ఉండటం.. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్దేశించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడం.. పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
మోంథా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలని.. జిల్లా కలెక్టర్లు మార్గదర్శకత్వం వహించాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని చెప్పారు.
నీటిమట్టాలను పరిశీలించండి
నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పురపాలక, గ్రామాల పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్యారోగ్య శాఖ తగినన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ప్రాణ, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్, అగి్నమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.


