నల్లగొండలో ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు (ఇన్‌సెట్‌లో) నల్లగొండ సభలో మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అల్లుళ్లు దోచుకున్నట్లు కూతురు కవితే చెప్పింది
కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా రూ.1.20 కోట్లు జీతం తీసుకున్నారు
నల్లగొండలో కాంగ్రెస్ ఆవిర్భావ సభ
నల్లగొండ టూటౌన్: ‘అల్లుళ్లు హరీశ్‌రావు, సంతోశ్‌రావులు రూ.2 వేల కోట్లు దోచుకున్నారని కేసీఆర్ సొంత కూతురు కవితే చెప్పింది. వాళ్లు దోచుకున్న రూ.2 వేల కోట్లకు లెక్కలు చెప్పు కేసీఆర్’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానం నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద గడియారం సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
గత 24 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా రూ.1.20 కోట్ల జీతం తీసుకున్నారని మంత్రి విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎవరూ భయపడరని, ఆ మొనగాడిని ఉతికి ఆరేస్తామని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ, గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఒక్క రేషన్‌కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు.
అమరావతికి రోడ్డు..
నల్లగొండ జిల్లా కనగల్ –గుర్రంపోడు మండలాల మధ్య నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని అమరావతి వరకు రూ.20 వేల కోట్లతో నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్‌వే రహదారి సర్వే ప్రారంభమైందని, ఈ రోడ్డు కనగల్, గుర్రంపోడు మండలాల మధ్య నుంచి అమరావతికి వెళుతుందని స్పష్టం చేశారు. కాగా, పదవులు శాశ్వతం కాదని తాను ఢిల్లీకి వెళ్లకున్నా మంత్రి పదవి వచ్చిందని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


