కాళేశ్వరం వేగం పాలమూరుపై చూపలేదు: సీఎం రేవంత్
కేసీఆర్ రీడిజైన్ చేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ధ్వజం
కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్‌తో కలిసి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్ చేసిన అన్యాయాన్ని ఆధారాలతో ఎండగట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించడానికి 2013లో ఈ ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగా, జూరాల ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణ ఆధీనంతో ఉండటంతో ఎలాంటి సమస్యలు వచ్చేవి కావని గుర్తుచేశారు.
జూరాలకు వచ్చే నీళ్లను వచ్చినట్టు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తరలించుకోవడానికి అవకాశం ఉండేదన్నారు. జూరాలకు బదులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నాటి సీఎం కేసీఆర్ రీడిజైన్ చేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు.
కాళేశ్వరం వేగం పాలమూరుపై చూపలేదు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరించిన వేగాన్ని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అనుసరించలేదని గత బీఆర్‌ఎస్ సర్కారును సీఎం రేవంత్ ఎండగట్టారు. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి అనుమతులు, నీటి కేటాయింపుల విషయంలో ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందన్నారు. జూరాల నుంచే ప్రాజెక్టును చేపట్టి ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యేదని, అంచనా వ్యయం కూడా పెరిగేది కాదని చెప్పారు. రాష్ట్ర పునరి్వభజన చట్టంలో 2014కి ముందు ప్రతిపాదించిన/నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కల్పించిన రక్షణ సైతం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు వర్తించేదన్నారు.
ఈ ప్రాజెక్టుకి కేటాయించిన 90 టీఎంసీల్లో గోదావరి జలాల మళ్లింపు ద్వారా లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీలూ ఉన్నాయని, వాటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పునఃకేటాయింపులు జరిపే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన మిగిలిన 45 టీఎంసీలతో ప్రాజెక్టుకి తొలి దశ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, ఏడాదిలోగా ట్రిబ్యునల్ విచారణ పూర్తైతే.. మిగిలిన 45 టీఎంసీల కేటాయింపులూ వస్తాయని స్పష్టం చేశారు. పూర్తిగా 90 టీఎంసీలను వాడుకోవాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం గత బీఆర్‌ఎస్ సర్కారుకు లేదని ఆరోపించారు. ఇప్పుడూ తప్పుడు ఆరోపణలతో అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రానికి తీవ్ర నష్టం
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కృష్ణా బేసిన్‌లోని పెండింగ్ ప్రాజెక్టులను సైతం ఎందుకు పూర్తి చేయలేకపోయారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 2014కు ముందు పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులు 2023లో బీఆర్‌ఎస్ అధికారం నుంచి దిగే నాటికి అలానే పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. బీఆర్‌ఎస్ చేసిన ద్రోహంతోనే కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 2004–14 మధ్య తరలించుకున్న నీళ్లతో పోల్చితే 2014–23 మధ్య తరలించుకున్న నీళ్లు చాలా ఎక్కువని గుర్తుచేశారు.
ఏపీ అక్రమంగా చేపట్టిన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులకు కేసీఆర్ పూర్తిగా సహకరించారని ఆరోపించారు. ఇలాంటి వివరాలతో అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ను ఎండగట్టడానికి నివేదికలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్ చేసిన ద్రోహంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న దిద్దుబాటు చర్యలను వివరిస్తూ జనవరి 1న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం నిర్దేశించారు.


