కాలజ్ఞాని నివాసంపై ‘మోంథా’ పడగ | Veerabrahmendra Swamy House Collapsed In Kadapa Kandimallayapalle Due To Cyclone Montha, More Details Inside | Sakshi
Sakshi News home page

కాలజ్ఞాని నివాసంపై ‘మోంథా’ పడగ

Oct 30 2025 5:55 AM | Updated on Oct 30 2025 12:25 PM

Veerabrahmendra Swamy house collapsed in Kandimallayapalle

కందిమల్లాయపల్లెలో కూలిన వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు

తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు

అధికారుల నిర్లక్ష్యం కారణమని విమర్శలు 

చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ పెద్దలకూ స్పృహలేదని ఆగ్రహం 

సాక్షి ప్రతినిధి, కడప/బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కందిమల్లాయపల్లె (బ్రహ్మంగారి మఠం)లో నివాసం ఉన్న మట్టి మిద్దె మోంథా తుపాన్‌ వర్షం ధాటికి బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. దీనిపై  భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బ్రహ్మంగారి ఆనవాళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను మఠం నిర్వాహకులు విస్మరించడం, రాజకీయ ప్రయోజనాలు మినహా చరిత్రను పరిరక్షించుకోవాలనే స్పృహ ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం ఈ దుస్థితికి కారణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి 1693లో సజీవ సమాధి అయ్యారు. అటు తర్వాత గ్రామస్తులు, భక్తులు వీరబ్రహ్మేంద్రస్వామి నివాసమున్న రెండు కొట్టాల స్థానంలో మట్టి మిద్దె ఏర్పాటు చేశారు. 1982లో ముందు భాగంలో భక్తులు ఆధునికీకరణ చేపట్టారు. 

జగన్‌ ప్రభుత్వ హయాంలో పరిరక్షణ
చరిత్రాత్మక సంపద స్వామివారి మిద్దె, బావి పరిరక్షించుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దాదాపు రూ.30లక్షలతో మిద్దెకు ప్రాకారం, చప్పట, స్వామివారు స్వయంగా తవ్విన బావి పరిరక్షణ చర్యలు చేపట్టింది. పనులు పూర్తి చేసి 2022 జూన్‌లో అప్పటి మైదుకూరు ఎమ్మెల్యే ఎస్‌. రఘురామిరెడ్డి ప్రారంభించారు. రెండేళ్లుగా మఠం నిర్వాహణ ప్రభుత్వ పరిధిలో ఉంది. 

బాబు ప్రభుత్వం నిర్లక్ష్యం
స్వామివారు నివసించిన ఇంటి పరిరక్షణ చర్యలు బాబు ప్రభుత్వంలో శూన్యమయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చరిత్రను పరిరక్షించుకోవాలనే చొరవ కంటే రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని పలువురు వాపోతున్నారు.  మరోవైపు శిథిలావస్థకు చేరిందంటూ పూజలు చేసుకునే అవకాశం లేకుండా నివాసానికి తాళాలు వేసిన నిర్వాహకులు, తదుపరి పరిరక్షణ చర్యలపై శ్రద్ధ చూపలేదని భక్తులు మండిపడుతున్నారు.

ఇప్పుడు బ్రహ్మంగారి మఠం అప్పుడు కాశినాయన క్షేత్రం..  
ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి కాలజ్ఞాని నివాసం కూలిపోవడం తాజా ఉదాహరణ కాగా, ఇప్పటికే ఇలాంటి విమర్శలు  వైఎస్సార్‌ కడప జిల్లాలో అవధూత కాశినాయన క్షేత్రం విషయంలోనూ వ్యక్తమయ్యాయి. 

ఈ క్షేత్రంలో భక్తులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను కూటమి సర్కారు అటవీశాఖ అ«ధికారులతో కూలగొట్టించిన విషయాన్ని భక్తులు గుర్తుచేసుకుంటున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో కూలగొట్టిన నిర్మాణాలను పునర్నిర్మించడంతో పాటు పెండింగ్‌ పనులన్నింటినీ చేయిస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించి ‘మమ’ అన్పించి చేతులు దులుపుకోవడం గమనార్హం.

నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం..
మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు. బ్రహ్మంగారి నివాసం కూలిపోయిందంటే, ఆయన భక్తు­ల మనోభావాలు దెబ్బ తిన్నట్టే! – ప్రతాప్‌ ఆచారి, బ్రహ్మంగారిమఠం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు 

తీవ్ర విచారకరం
తీవ్ర విచారకరమైన ఘటన ఇది. అధికారుల నిర్లక్ష్యంతోనే స్వామి వారి నివాస గృహం కూలిపోయింది. దీనికి అధికారులు ఏమని సమాధానం చెబుతారు.  – డాక్టర్‌ వేలు ఆనందచారి, పద్మశ్రీ అవార్డు గ్రహీత

తక్షణం పునర్నిర్మించాలి
నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఆధునీకరణ పనులు జరగలేదు. ఇప్పటికైనా ఎండోమెంట్‌ అధికారులు, మఠం నిర్వాహకులు  శ్రద్ధ తీసుకొని కూలి­న గృహాన్ని పునర్నిర్మించాలి.  – విశ్వరూపచారి, స్థానికుడు, బ్రహ్మంగారిమఠం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement