పేరుకుపోతున్న అర్జీలు.. పేరుకే సదస్సులు రెవె‘న్యూసెన్స్‌’! | Chandrababu govt did not respond at all to complaints of Revenue issues | Sakshi
Sakshi News home page

పేరుకుపోతున్న అర్జీలు.. పేరుకే సదస్సులు రెవె‘న్యూసెన్స్‌’!

Dec 23 2025 4:33 AM | Updated on Dec 23 2025 4:36 AM

Chandrababu govt did not respond at all to complaints of Revenue issues

ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు 

ప్రతి సోమవారం ‘పీజీఆర్‌ఎస్‌’లో 80 శాతం రెవెన్యూ సమస్యలే

కబ్జాలు, సరిహద్దు సమస్యలు, రికార్డులు మాయం, అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ 

పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితుల ఆక్రందన.. రసీదుల జారీతోనే సరి.. పరిష్కారం దొరకక జనం సతమతం 

సమస్య తీర్చాలని పదేపదే వేడుకుంటున్నా ఫలితం శూన్యం  

22–ఏ నిషేధిత జాబితాలోని భూములకు గత ప్రభుత్వంలో ఫ్రీహోల్డ్‌.. బాబు రాకతో తిరిగి నిషేధం  

గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాదారు పుస్తకాలు రద్దు.. తిరిగి కొత్తవి ఇవ్వని చంద్రబాబు సర్కారు 

క్రయవిక్రయాలు, రుణాలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్న రైతన్నలు.. వారసత్వ భూములను మ్యుటేషన్‌ చేయడంలోనూ అంతులేని జాప్యం 

తూతూ మంత్రంగా గ్రామ సభలు.. రెవెన్యూ సదస్సులు  

రెవెన్యూ సమస్యలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన.. ఊరూరా బాధితుల అవస్థలు

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బత్తులవారిపాలెంలో నివసించే చిమటా మార్క్‌కు సర్వే నెంబర్‌ 351/9 లో 1.26 ఎకరాలు, 314/6 లో 22 సెంట్లు కలిపి మొత్తం 1.48 ఎకరాల పొలం ఉంది. డాక్యుమెంట్లు అన్నీ ఆయన పేరుతోనే ఉన్నా తటవర్తి సాయి, పందరబోయిన శ్రీను అనే వ్యక్తులు ఆ సర్వే నంబర్లలో 1.22 ఎకరాలను ఆక్రమించుకున్నారు. మార్క్‌ను భూమిలోకి రానివ్వడం లేదు. తన భూమిని ఆక్రమించారని.. సమస్య పరిష్కరించాలని డాక్యుమెంట్లు చేత పట్టుకుని మార్క్‌ ఏడాదిన్నరగా తహసీల్దార్, కలెక్టర్‌ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించామంటూ రసీదు చేతిలో పెట్టడం మినహా సమస్య పరిష్కరించే నాథుడే లేడని మార్క్‌ వాపోతున్నాడు.

సాక్షి ప్రతినిధి, కర్నూలు: తప్పుడు పేర్లతో ఆన్‌లైన్‌లో రికార్డులు మాయం చేయడం.. పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం.. భూ కొలతల్లో తిమ్మిని బమ్మిని చేయడం.. భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. తమ గోడు పట్టించుకునే దిక్కులేక లక్షలాది మంది సతమతమవుతున్నా చంద్రబాబు సర్కారు చేష్టలుడిగి చూస్తోంది. చలానాలు కట్టినా.. స్వయంగా న్యాయస్థానాలు ఆదేశించినా.. భూములు సర్వే చేసే దిక్కులేక అల్లాడుతున్నారు. ప్రతి సోమవా­రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే వినతుల్లో సింహభాగం రెవెన్యూ సమ­స్యలే ఉంటున్నాయి. ఈ నెల 15న చిత్తూరు కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 293 అర్జీలు వస్తే రెవెన్యూ సమస్యలే 204 ఉన్నాయి. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుతున్న ఫిర్యాదుల్లో 70–80 శాతం రెవెన్యూ సమస్యలే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉదాశీనత, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘సాక్షి’ బృందాలు ఈ నెల 15న సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలో పీజీఆర్‌ఎస్‌ను ఆసాంతం పరిశీలించాయి. మొత్తంగా ఆయా జిల్లాల్లో ఒక్క రోజులో ఎన్ని సమస్యలు వచ్చాయి..? వాటిలో రెవెన్యూ సమస్యలు ఎన్ని..? అని ఆరా తీశాయి. 

ఆ తర్వాత మంగళ, బుధవారాల్లో పీజీఆర్‌ఎస్‌కు హాజరైన కొందరు బాధితుల గ్రామాలకు వెళ్లి సమస్య మూలాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడాయి. వెళ్లిన ప్రతి చోటా సమస్యల పరిష్కారంలో లెక్కలేనితనం, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, అవి­నీతి స్పష్టంగా కనిపించాయి. ఒక్క రోజులో పరిష్కరించగలిగే చిన్న సమస్యలను సైతం నెలల తరబడి పట్టించుకోకపోవడం లేదని తేటతెల్లమైంది. చలానాలు కూడా కట్టించుకుని సర్వేలు చేయడం లేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకుందో కళ్లకు కడుతోంది.  

గత ప్రభుత్వం పరిష్కరించినా.. మళ్లీ అసైన్‌ ఉచ్చు  
ఏళ్ల తరబడి పొలాలు సాగు చేసుకుంటున్నా 22–ఏ నిషేధిత జాబితాలో అసైన్డ్‌ భూములు ఉండటంతో బ్యాంకు రుణాలు అందక, అవసరాలకు భూములు విక్రయించుకోలేక సుదీర్ఘకాలంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్యలను గుర్తిస్తూ, 20 ఏళ్లుగా లబ్ధిదారుల అనుభవంలో ఉన్న అసైన్డ్‌ భూములను 22–ఏ జాబితా నుంచి తొలగించి వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు హక్కులు కల్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పేద రైతులు ఎంతో సంతోషపడ్డారు. కానీ 2024లో చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఫ్రీహోల్డ్‌ అయిన భూములను తిరిగి 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో రుణాల నుంచి క్రయవిక్రయాల వరకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

పట్టాదారు పుస్తకాలు ఎక్కడ? 
గత ప్రభుత్వంలో రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో ఉందనే సాకుతో వాటిని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా ప్రభుత్వ ఎంబ్లమ్‌తో పాసు పుస్తకాలను ఇస్తామని ప్రకటించింది. ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు పాసు పుస్తకాల జాడలేదు. పాత పాస్‌ పుస్తకాలు రద్దు కావడం, కొత్తవి ఇవ్వకపోవడంతో రైతులు రుణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాసు పుస్తకాలు ఇవ్వాలని పీజీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి.  

మొక్కుబడిగా గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు 
భూముల సంబంధిత సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం జనవరిలో 10 రోజులు గ్రామ సభలు నిర్వహించింది. అనంతరం మరో 15 రోజులు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహించింది. కర్నూలు సహా పలు జిల్లాల్లో ఈ సభల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదు. రికార్డుల్లో మాత్రం  సమస్యలు పరిష్కారమైనట్లు నమోదు చేశారు. క్షేత్ర స్థాయిలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీంతో రెవెన్యూ సదస్సులకు వచ్చిన వారు తిరిగి పీజీఆర్‌ఎస్‌కు క్యూ కడుతున్నారు. దీన్నిబట్టి రెవెన్యూ సదస్సులు ఎంత అధ్వానంగా జరిగాయో స్పష్టమవుతోంది. 
 
మ్యుటేషన్లు బంద్‌..  
రీ సర్వేలో మిగులు భూముల మ్యుటేషన్లను చంద్రబాబు ప్రభుత్వం కఠినతరం చేసింది. ఆ భూముల్లో అనుభవదారులున్నా, వాటిని వారి వారసులకు మ్యుటేషన్‌ చేయడం లేదు. దాదాపు ఏడాదిన్నరగా రైతులు వాటి కోసం పడిగాపులు కాస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో చుక్కల భూములపై హక్కులు ఇచ్చారు. అయితే ఆధారాలు చూపలేని కొందరు రైతులకు సంబంధించిన భూములు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ రైతులంతా తమ భూములను డాటెడ్‌ జాబితా నుంచి తొలగించాలని ఆధారాలతో రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకుంటున్నా ఆలకించడం లేదు. రీసర్వేలో జాయింట్‌ ఎల్‌పీఎంలను తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీని కోసం గ్రామాల్లో రైతుల నుంచి లంచాలు వసూలు చేస్తూ టీడీపీ నాయకులు సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. వీటిపై కూడా పీజీఆర్‌ఎస్‌కు అర్జీలు భారీగా వస్తున్నాయి.
 
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లిలో ఇంజా లక్ష్మీరెడ్డికి వారసత్వంగా వచ్చిన 65 ఎకరాల ఉమ్మడి పొలం ఉంది. నలుగురు అన్నదమ్ములు కావడంతో లక్ష్మీరెడ్డి వాటాగా నాలుగో వంతు రావాలి. సజ్జలదిన్నె గ్రామంలో సర్వే నెంబర్లు 44, 602, 581, 612, 467–డి, 270–ఎం, 270–ఓ, 33, 390–బిలో తొమ్మిది ఎకరాల పొలం వివాదంలో ఉంది. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి పోలీసు భద్రతతో సర్వే చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. సర్వే కోసం బాధితుడు చలానా కట్టినా వీఆర్‌వో సర్వే చేయించడం లేదు. ‘మేం చేయించం.. నీకు దిక్కున్న చోట చెప్పుకో..’ అని బెదిరిస్తున్నాడు. లక్ష్మీరెడ్డి ఇప్పటివరకు 31 సార్లు అర్జీలు ఇచ్చినా భూమిని సర్వే చేయడం లేదు. రెవెన్యూ వ్యవహారాలు ఇంత అధ్వాన్నంగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలని ఆయన వాపోతున్నారు.  

విచారిస్తూనే ఉన్నారు...!  
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేమవరంలో ముప్పరాజు పాపయ్య పేరుతో 11.93 ఎకరాల భూమి ఉండగా ఆయన ఇద్దరు కుమారులు, పెద్దకోడలు కూడా చనిపోయారు. చిన్న కోడలు శేషమ్మ మాత్రమే మిగిలి ఉంది. ఈ భూమిని ఒంగోలుకు చెందిన రియల్టర్‌ మారం వెంకటేశ్వరరెడ్డి తప్పుడు పత్రాలతో అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. శేషమ్మ భూమిని కొట్టేయాలని యత్నిస్తున్నాడు. దీంతో శేషమ్మ రెవెన్యూ అధికారులను సంప్రదించగా ఈ వివాదాన్ని ఎంతకీ తేల్చడం లేదు. ఈ భూమిపై హక్కుదారులెవరో విచారణ చేస్తున్నామని తహసీల్దార్‌ చెబుతున్నారు.

ఎన్ని సమస్యలో..!
మదనపల్లెవాసి మురళీకి కురబలకోట సర్వే నెంబర్‌ 1913/2ఎలో 3.39, 1913/3లో 1.50 ఎకరాలు భూమి ఉంది. 1958లో మురళి తాత దువ్వూరి రామన్న పేరుతో ఉన్న భూమి ఆయన మృతి తర్వాత 1994లో వారసత్వంగా మురళి పేరుతో రికార్డుల్లోకి ఎక్కింది. దీనికి పక్కనే ఉన్న మరో యజమాని మురళి భూమిని ఆక్రమించాడు. సర్వే చేసి తన భూమికి హద్దులు తేల్చాలని రెండేళ్లుగా మురళి సబ్‌ కలెక్టర్‌ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు.  

⇒ చిత్తూరు రూరల్‌ దిగువమాసాపల్లికి చెందిన తులసికి సర్వే నెంబర్‌ 183లో ఇంటి స్థలం ఇచ్చారు. ఆమె స్థలాన్ని రెవెన్యూ అధికారులు మరొకరికి పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. తన స్థలం మరొకరికి ఎలా ఇస్తారని బాధితురాలు ప్రతి వారం తహసీల్దార్‌ చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం లేకపోవడంతో పీజీఆర్‌ఎస్‌ను ఆశ్రయించింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు.

⇒ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కుందేరు వాసి షేక్‌ ఆదాం షరీఫ్‌ ఇంటి స్థలం, ఇల్లు తొలగించి 2015లో రైవస్‌ కాలువపై వంతెన నిర్మించారు. ఆయనకు నష్ట పరిహారం చెల్లిస్తామని స్థలం 
తీసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌తో పాటు మంగళగిరిలో ప్రజా దర్బార్‌కు వెళ్లినా షరీఫ్‌కు పరిహారం దక్కలేదు.  

⇒ కృష్ణాజిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం వాసి విజయభాస్కరరావుకు 3 ఎకరాల పొలం ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చుక్కల భూముల జాబితాలోకి చేర్చడంతో బ్యాంకు రుణాలు తీసుకోలేక ఇబ్బందులు పడ్డాడు. అనంతరం జగన్‌ ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ వాటికి చుక్క పెట్టింది. కళ్లెదుట మూడు ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఎందుకూ ఉపయోగ పడటం లేదని, నిషేధ జాబితా నుంచి తొలగించాలని బాధితుడు మొర పెట్టుకుంటున్నాడు.

⇒ శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రం వాసి ప్రభాకర్‌కు సర్వే నంబర్‌ 201–7లో వారసత్వంగా సంక్రమించిన 27 సెంట్ల స్థలం ఉంది. ఉపాధి కోసం ఆయన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉండటంతో ప్రభాకర్‌ సమీప బంధువు ఆ భూమిని తన పేరుతో ఆన్‌లైన్‌లో ఎక్కించుకున్నాడు. అక్కడ సెంటు రూ.6 లక్షలు వరకు ఉంది. రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి రూ.1.62 కోట్ల ఆస్తిని కబ్జా చేశారు. తన భూమిని ఇవ్వాలని ఏడాదిన్నరగా ప్రభాకర్‌ రికార్డులతో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఈ నెల 15న శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.  

రెవెన్యూ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి గానూ ఇటీవల తిరుపతి కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీగా హాజరైన ప్రజలు    

ఐవీఆర్‌ఎస్‌ కాల్స్, ఆడిట్‌లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు కనీసం ప్రజల ఆర్థి­కే­త­ర సమస్యలకు పరిష్కారం  చూపడంలోనూ దా­రు­ణంగా విఫలమయ్యారు. ప్రభు­త్వం ఇటీవ­ల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులోనే ఈ విష­యం వెల్లడైంది. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపో­యాయి. పరిష్కరించామని చెబుతున్న సమస్యలపై ఆర్టీజీఎస్‌ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ డొల్లతనం బయటపడింది.   

అల్లూరి జిల్లాలో అత్యధికం.. 
విజ్ఞాపనల పరిష్కారంపై ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు ఆర్టీజీఎస్‌ ద్వారా సర్వే చేయగా 43 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కరించినట్లు చెబుతున్న వినతులపై ఆడిట్‌ నిర్వహించడంతోపాటు అర్జీదారులకు ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ చేసి అభిప్రాయం కోరగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 80% మంది, చిత్తూరు జిల్లాలో 60, శ్రీసత్య­సాయి జిల్లాలో 62, అన్నమయ్య జిల్లాలో 60, అనంతపురం జిల్లాలో58, ఎన్టీఆర్‌ జిల్లాలో 53, బాపట్ల జిల్లాలో 50% మంది ప్రజలు విజ్ఞాపనల పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ల సదస్సుల్లో సీఎం సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ఏడాది జూన్‌ 15 నుంచి అసంతృప్తి స్థాయి మూడు­నెలల్లో భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ఇక రెవెన్యూ శాఖలో పరిష్కరించినట్లు చెబుతున్న అంకెలన్నీ తప్పేనని కలెక్టర్ల సదస్సుల్లోనే ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదని కలెక్టర్ల సదస్సులో తేలడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కడో ఫెయిల్‌ అవుతున్నామని వ్యాఖ్యానించారు.  

పట్టా ఇచ్చారు.. భూమి ఎక్కడ? 
నా భర్త సింహాచలం కల్లుగీత కార్మీకుడు. కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయారు. ప్రభుత్వం సర్వే నెంబర్‌ 23పీలో నాకు 0.80 ఎకరాల భూమి ఇచ్చింది. పట్టాదారుపాసు పుస్తకం ఇచ్చారు. అడంగల్‌లో కూడా నా పేరు ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందో చూపించి హద్దులు తేల్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా. కలెక్టరేట్‌లో కూడా అర్జీలు ఇస్తున్నా నా సమస్య తీరడం లేదు. 
    – అప్పమ్మ, ఏవో అగ్రహారం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా


ఊరికి దూరంగా బతుకుతున్నా 
నాకు మా గ్రామంలోని సర్వే నెంబర్‌ 203లో 16 సెంట్ల స్థలం ఉంది. అందులో ఇల్లు కూడా ఉంది. ఈ స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి నన్ను రానివ్వడం లేదు. నాలుగు నెలల క్రితం నేను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడి చేసి చంపాలని చూశారు. అప్పటి నుంచి ఊరికి దూరంగా బతుకుతున్నా. గ్రామసభలో చెప్పినా ఫలితం లేదు. నా పేరుతోనే స్థలం డాక్యుమెంట్లు ఉన్నా ఏమిటీ అన్యాయం? అధికారులకు విన్నవించినా ఫలితం లేదు.   
    – వారి పెద్దిరెడ్డి, ఏట్రవారిపాలెం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా


కలెక్టర్‌కు చెప్పినా.. 
మా నాన్న మంగలి నారాయణ పేరుతో సర్వే నంబర్‌ 893లో 1.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏడాది క్రితం నుంచి ఈ పొలం తమదంటూ 892 సర్వే నంబర్‌లో ఉంటున్న జగదీష్‌ గొడవ పడుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో మేం సాగు చేసిన  పంటను దౌర్జన్యంగా తొలగించాడు. పొలం సర్వే చేసి సమస్య పరిష్కరించాలని ఏడాదిగా తహసీల్దార్, ఆర్డీవోతో పాటు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇస్తున్నా ఫలితం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.     
– మంగలి తిరుపతయ్య, బేతంచెర్ల, నంద్యాల జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement